Netaji Subhas Chandra Bose: A True Symbol of India’s Freedom Fight
సాంస్కృతికంగా, సామాజికంగా సర్వసమృద్ధమైన
భారత ఉపఖండ చరిత్రలో పరాయి దేశీయుల పాలనా కాలం చీకటి అధ్యాయం. అందునా బ్రిటిష్
వారి పరిపాలన దేశాన్ని గాఢాంధకారంలో ముంచివేసింది. 18వ శతాబ్దం ద్వితీయార్థంలో ఈస్ట్ ఇండియా కంపెనీ
పేరుతో వ్యాపారం కోసం భారత్ వచ్చిన బ్రిటిష్‌వారు క్రమంగా రాజకీయంగా పట్టు సాధించారు.
తమ మోసపూరితమైన విధానాలతో దేశంలోకి అడుగుపెట్టి, దేశంలోని చిన్నచిన్న రాజ్యాలను
ఆక్రమించారు. అదంతా ఇంపీరియలిస్టు విస్తరణవాదపు ప్రణాళిక ప్రకారం జరిగింది. భారత్‌ను
ఆక్రమించడానికి బ్రిటిష్ రాజరికాన్ని ప్రోత్సహించి ప్రేరేపించినది క్యాథలిక్
మతగురువులు. భారతదేశంలో క్రైస్తవమయంగా మార్చివేయడమే వారి లక్ష్యం.
బ్రిటిష్ ఇంపీరియలిజం దక్షిణాసియా,
తూర్పు ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లో బలపడింది. ఐతే ప్రధానంగా శాంతికాముక దేశమూ,
వసుధైవ కుటుంబకం అన్న భావనలో పరిపూర్ణ విశ్వాసమున్నదేశమూ అయిన భారత్, బ్రిటిష్
పాలన అనే రాజకీయ షాక్ నుంచి తేరుకోడానికి కొంత సమయం పట్టింది. 19వ శతాబ్దపు
ద్వితీయార్థం నాటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దాదాపు సగం భారతదేశాన్ని
ఆక్రమించేసింది. 1857 భారత స్వాతంత్ర్య సంగ్రామం దేశంలోని వివిధ ప్రాంతాలను బ్రిటిష్
పాలనకు వ్యతిరేకంగా ఏకత్రితం చేసింది. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న ప్రాంతాల్లో
వారిని గద్దెదింపడానికి భారతీయులు పోరాటాలు చేసారు. కానీ పలు కారణాల వల్ల ఆ
సంగ్రామం విజయవంతం కాలేకపోయింది. వాటిలో ప్రధానమైన కారణం ఈ దేశపు కులీన వర్గాల్లో
ఉన్న కొందరు దేశద్రోహులే. వారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బ్రిటిష్ వారికి మద్దతు
పలికారు, వారితో చేతులు కలిపారు, వారికి దేశ రహస్యాలను చేరవేసారు. అలాంటి కొందరు దేశద్రోహుల
దుశ్చర్యల వల్ల సాహసవీరులైన మన స్వాతంత్ర్య సమరయోధుల ప్రయత్నాలు విఫలమైపోయాయి.
1857 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ రాజ్యం
పోయింది, ఇక నేరుగా బ్రిటిష్ రాణే భారతదేశానికి కూడా రాణి అయింది. విస్తృతమైన
బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశం కూడా చేరిపోయింది. అప్పటినుంచీ భారతదేశాన్ని
వ్యవస్థీకృతంగా దోపిడీ చేయడం, ఆర్థికంగా నిస్సారం చేయడం మొదలైంది. ఇంక జాగ్రత్తగా
తయారుచేసిన చట్టాలు, న్యాయసూత్రాల ద్వారా భారత్ సాంస్కృతిక వైభవాన్ని వక్రీకరించే
పని అప్పటికే అమల్లో ఉంది. ఆ చారిత్రక, సాంస్కృతిక, సామాజిక విధ్వంసం దశాబ్దాల
తరబడి కొనసాగింది. అలాంటి దుస్థితిలో పడిపోయిన దేశాన్ని సముద్ధరించడం కోసం ఈ
పవిత్ర భూమిలో కొందరు మహానుభావులు జన్మించారు. వారి కార్యాచరణ ఈ దేశ చరిత్రలో
సువర్ణాక్షరాలతో లిఖించబడింది.
1897 జనవరి 23న కటక్ నగరంలో జానకీనాథ్
బోస్, ప్రభావతీదేవి దంపతులకు ఒక కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు భారతదేశ చరిత్రనే
మార్చివేస్తాడని ఆ సమయంలో ఎవరికీ తెలియదు. అతనే సుభాష్ చంద్రబోస్. భారత
స్వాతంత్ర్య పోరాటపు నిజమైన కథానాయకుడు. ‘నేతాజీ’గా ప్రశస్తికెక్కాడు.
సుభాష్ తన తొలినాళ్ళను కులీన కుటుంబంలో
హాయిగా గడిపేసాడు. ఐసీఎస్ పరీక్ష కోసం ఉన్నతవిద్యాభ్యాసం చేయడానికి అతన్ని
యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జికి పంపించారు. 1920లో సుభాష్ ఐసీఎస్ పరీక్ష రాసి దేశవ్యాప్తంగా
నాలుగో ర్యాంక్ సాధించాడు. అతను ప్రొఫెషనల్ కెరీర్ అత్యున్నత స్థితికి చేరింది.
కానీ సుభాష్, మరింత ప్రశస్తమైన లక్ష్యాలను సాధించాల్సి ఉంది, అతను 1921లో భారతదేశంలోని
సంక్షోభం గురించి, అక్కడ జరుగుతున్న జాతీయస్వాతంత్ర్య ఉద్యమం గురించీ చదివాడు.
ఇంకెంతమాత్రం ఇంగ్లండులో ఉండలేక ఐసీఎస్ పదవికి రాజీనామా చేసి భారత్ వచ్చేసాడు.
సుభాష్ చంద్రబోస్ భారతదేశం వస్తూనే గాంధీ
ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరాడు. గాంధీ మార్గదర్శనంలో చిత్తరంజన్‌దాస్
శిష్యరికంలో సుభాష్ ఎదిగాడు. బెంగాల్ కాంగ్రెస్ కార్యకర్తలకు కమాండెంట్ అయ్యాడు. 1927లో
భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రధానకార్యదర్శి అయాడు, 1938లో ఆ సంస్థకు అధ్యక్షుడిగా
ఎన్నికయ్యాడు.
కానీ భారత్ కోసం జాతీయవాద భావజాలంతో
అజెండా తయారు చేయడం, దేశానికి స్వాతంత్ర్యం సాధించే ప్రణాళిక రచించడంలో ఆయన
అభిప్రాయాలు గాంధీ అభిప్రాయాలతో కలవలేదు. సుభాష్ ఆలోచనలు ముందుచూపుతో ఆచరణాత్మకంగా
వాస్తవికంగా రాజకీయాలకు అనుగుణంగా ఉండేవి. గాంధీ ఆలోచనలు మాత్రం ఆదర్శంగా, ఉన్మత్తంగా,
స్వాప్నికంగా, అనుమానాస్పదంగా ఉండేవి. సుభాష్ ఆలోచనలు సృజనాత్మకంగా ఉంటే గాంధీ
ఆలోచనలు ఊహాత్మకంగా ఉండేవి. దాంతో కొంతకాలానికే సుభాష్ కాంగ్రెస్ నుంచి బైటకు వచ్చేసాడు.
సుభాష్ ఉద్వేగం, తను సాధించాలనుకున్న
లక్ష్యంపై ఏకగ్రీవమైన తపన – వివిధ మతవర్గాల గ్రూపులను బుజ్జగించే గాంధీ విధానాల
కంటె చాలా బలమైనవిగా ఉండేవి. గాంధీ ఎంతసేపూ ప్రజాదరణ కోసం అతిశయోక్తిగా
వ్యవహరించేవాడు, బ్రిటిష్ వారితో కుమ్మక్కయిపోయి ఆ విషయాన్ని దాచిఉంచాడు.
సుభాష్ 1939లో తన ఫార్వర్డ్ బ్లాక్
గ్రూపుతో సహా కాంగ్రెస్ నుంచి విడిపోయాడు. ఆ సంవత్సరమే రెండో ప్రపంచయుద్ధం
ప్రారంభమైంది. సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌ను నిర్వహించాడు. ఆ సేనలో
ప్రధానంగా జపనీస్ జైళ్ళలో మగ్గుతున్న బ్రిటిష్ ఇండియన్ యుద్ధఖైదీలతో బ్యాండ్
తయారుచేసాడు. అప్పటికే ఆగ్నేయాసియాలోని పలు దేశాల్లో అధికారంలో ఉన్న బ్రిటిష్
వారిపై జపనీయులు విజయం సాధించారు.
అంతకంటె చాలాముందే ప్రముఖ విప్లవయోధుడు రాస్ బిహారీ బోస్ ఏర్పాటు
చేసిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ కొత్తరూపంలా ఉండేది భారత జాతీయ సైన్యం లేదా
ఆజాద్ హింద్ ఫౌజ్. రాస్ బిహారీ బోస్ అప్పటికే చాలాయేళ్ళ క్రితమే భారత్ నుంచి
తప్పించుకుని జపాన్ వెళ్ళి అక్కడ నివసిస్తున్నాడు. ఆగ్నేయాసియా దేశాల్లో
నివసిస్తున్న పలువురు భారతీయుల మద్దతుతో ఆయన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్
ఏర్పాటుచేసి ఉన్నాడు.
సుభాష్ చంద్రబోస్ 1941లో భారతదేశం నుంచి
తప్పించుకుని జర్మనీ వెళ్ళాడు. అక్కడినుంచే భారత స్వాతంత్ర్యం కోసం పోరాడాడు.
1943లో ఆయన సింగపూర్ తిరిగి వచ్చాడు, అక్కడ కనీసం 45వేల మంది సైనికులతో సైన్యాన్ని
రూపొందించాలని ఆయన ప్రణాళిక.
చరిత్రాత్మక దినం 21 అక్టోబర్ 1943 నాడు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్‌లో ఉండగానే స్వాతంత్ర్య భారతదేశాన్ని స్థాపించినట్లు
వెల్లడించాడు. సింగపూర్ నుంచి నేరుగా, జపాన్ ఆక్రమణలో ఉన్న అండమాన్ దీవులకు వెళ్ళి
అక్కడ భారతదేశ పతాకాన్ని ఎగురవేసాడు. బ్రిటిషర్లకు వ్యతిరేకమైన జపాన్ మద్దతుతో,
ఆజాద్ హింద్ ఫౌజ్ సహాయంతో భారతదేశంలో తిరుగుబాటు చేస్తే భారతదేశంలో బ్రిటిష్
పరిపాలనకు చరమగీతం పాడినట్లే అని నేతాజీ భావించాడు. ఆయనెంత సరిగ్గా ఆలోచించాడో కదా.
ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రారంభించిన దిల్లీ
చలో, జైహింద్ నినాదాలు భారతీయుల్లో భావోద్వేగాలను రగిల్చాయి. దేశంలోపలా, వెలుపలా
ఉన్న భారతీయులు అందరికీ ప్రేరణ కలిగించాయి. నేతాజీ ఆగ్నేయాసియా అంతటా ఉన్న
భారతీయులను, వారి కులం మతం లేదా ప్రాంతంతో సంబంధం లేకుండా అందరినీ, భారతదేశ విముక్తి
కోసం జాగృతం చేసాడు. ఆజాద్ హింద్ ఫౌజ్ రంగు, రూపు చాలా గొప్పగా ఉండేవి. అది
భారతీయుల్లో అనూహ్యమైన స్థాయిలో భావోద్వేగాలను రగిలించగలిగింది.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత
బ్రిటిష్ ఇండియన్ నేవీలోని సైనికులకు నేతాజీ సంకేతాలిచ్చాడు. ఆయన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం
నౌకాదళ సైనికులను ఉత్తేజితులను చేసింది. అది భారీ తిరుగుబాటుకు దారితీసింది. దాంతో
బ్రిటిష్ వారు అల్లకల్లోలమైపోయారు.
బ్రిటిష్ వారు భారతదేశం వదిలిపెట్టి వెళ్ళవలసిన
సమయం ఆసన్నమైంది. వాళ్ళు దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు, కానీ అంతకుముందు ఓ
దుర్మార్గమైన ఆలోచన చేసారు. తాము పెంచి పోషించిన తొత్తులను ఉపయోగించి దేశాన్ని
విభజించేసారు. ఆ తొత్తులతోనే నేతాజీని పతితుడిగా, ధర్మాన్ని విడిచి
పారిపోయినవాడిగా ప్రచారం చేసారు. 1945 ఆగస్టు 18న జపనీస్ తైవాన్‌లో జరిగిన విమాన
ప్రమాదంలో నేతాజీ చనిపోయినట్లు ప్రకటించేసారు.
అయితే నేతాజీ మరణంపై భారతప్రభుత్వాలు దశాబ్దాల
పాటు వాస్తవాలను దాచిపెట్టాయి, దానికి కారణం ఆయా ప్రభుత్వాల పెద్దలపై బ్రిటిష్
వారి ప్రభావం ఉండడమే. ఆ విమాన ప్రమాదంలో
బోస్ చనిపోలేదు అనడానికి సరిపడినన్ని ప్రాసంగిక సాక్ష్యాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది…
అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ 1956లో భారత పర్యటనకు వచ్చినప్పుడు
బ్రిటిష్ వారు భారత్ వదిలిపోవడానికి ప్రధాన కారణం నేతాజీ ప్రారంభించిన ఆజాద్ హింద్
ఫౌజ్ అనీ, గాంధీ చేసిన సహాయ నిరాకరణ ఉద్యమం ప్రభావం ఏమాత్రం లేదనీ స్పష్టంగా
ప్రకటించాడు.
నేతాజీ చాలాకాలం పాటు భారత్‌లోనే ఉత్తరప్రదేశ్‌లో
మారువేషంలో జీవించాడని, గుమ్నామీ బాబా అనే సాధువు వేషంలో ఉండేవాడనీ, 1985
సెప్టెంబర్ 16న తుదిశ్వాస విడిచాడనీ కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది. ఏదేమైనా
నేతాజీ గురించిన సమాచారాన్ని డీక్లాసిఫై చేసి వెలుగులోకి తెచ్చిన ఘనత నరేంద్ర మోదీ
ప్రభుత్వానిదే.
తన కాలంలోని సంకుచిత స్వభావం కలిగిన,
మోసపూరితమైన, స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడిన తన సమకాలీన నేతలకు భిన్నంగా
నేతాజీ సుభాష్ చంద్రబోస్ నిజమైన లౌకికవాది, అచ్చమైన దేశభక్తుడు, దార్శనికుడు,
సాహసి. ఆయన లేకుంటే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేదే కాదు. అదృష్టం బాగుండి ఉంటే
ఆయన అఖండమూ, విస్తారమూ, సమైక్యమూ అయిన భారతదేశానికి ప్రధానమంత్రిగా చాలాకాలం
పనిచేసి ఉండేవాడు. అదే జరిగి ఉంటే ఈ ఘనమైన దేశపు గొప్పదనం అంతర్జాతీయంగా ఏనాడో
ప్రతిధ్వనించేది.
ఇవాళ 127వ జయంతి
సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు ప్రణమిల్లుదాం. ఆయన స్ఫూర్తితో భారతమాత
సేవలో తరిద్దాం.