కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన చీతాల పెంపు ప్రాజెక్టు (project cheetah) ముందడుగు పడింది. మొదట్లో అనేక చీతాలు చనిపోవడంతో విమర్శలు వచ్చాయి. అవి ఇక్కడి వాతావరణానికి అలవాటుపడి, కూనలకు జన్మనిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాలను 2022లో వదిలారు. తాజాగా జ్వాల అనే చీతా మూడు పిల్లలు పెట్టింది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఎక్స్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.‘‘ జ్వాల మూడు పిల్లలు పెట్టింది. ఇటీవల ఆశా కూడా కూనలకు జన్మనిచ్చింది. చీతాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వన్యప్రాణుల ప్రేమికులందరికీ అభినందనలు’’ అంటూ కేంద్ర మంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
దేశంలో అంతరించిపోయిన చీతాలను పెంపొందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2022లో ఈ ప్రాజెక్టు చేపట్టింది. నమీబియా నుంచి ఎనిమిది చీతాలను తీసుకువచ్చారు. వాటిని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కునో జాతీయ పార్కులో వదిలారు. ఆ తరవాత మరో 12 చీతాలను తీసుకొచ్చి కునో అడవిలో వదిలారు.