Lakhs of devotees throng Ram Mandir since early morning
శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు
పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశీ తిథి అభిజిత్ లగ్నంలో భవ్యమందిరంలో బాలరాముడు
సర్వాంగసుందరంగా విరాజమానుడయ్యాడు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ప్రాణప్రతిష్ఠ
కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. ఇక ఈనాటి నుంచీ
సాధారణ భక్తులకు ప్రత్యక్ష దర్శన భాగ్యం ప్రారంభమయింది.
అయోధ్యలోని అన్ని వీధులూ బాలరాముడి మందిరానికే
దారితీస్తున్నాయి. ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, కోదండపాణి అయిన రామయ్యను
దర్శించుకోడానికి అశేష ప్రజావాహిని పోటెత్తుతోంది. ఈ తెల్లవారుజామున 3 గంటల నుంచే
ఆలయం దగ్గర భక్తజనసంద్రం పోటెత్తింది. అంత చలిలోనూ సరయూ నదిలో పుణ్యస్నానాలు
ఆచరించి తమ రామయ్యను చూసుకోడానికి పరుగులు తీసారు.
సోమవారం అయోధ్యలో జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి
ఎంపిక చేసిన కొన్నివేలమంది అతిథులు మాత్రం హాజరయ్యారు. కేంద్రమంత్రులు, రాష్ట్రాల
ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ రాజకీయ నాయకులు తమతమ ప్రదేశాల్లోనే ఉండి స్థానిక
రామాలయాల్లో పూజలు చేసారు, అక్కడినుంచే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించి
తరించారు. ఇక ఈరోజు నుంచీ సాధారణ ప్రజలకు దర్శనమిస్తున్నాడు బాలరాముడు.
‘‘అయోధ్యా నగరం పెళ్ళికూతురిలా ముస్తాబయింది. మా
ఆనందానికి అవధులు లేవు. ఇవాళ రామ్‌లల్లాను దర్శించుకుంటామన్న ఆలోచనతో ఒళ్ళు
గగుర్పొడుస్తోంది. మనసంతా ఉద్వేగంతో ఉప్పొంగుతోంది’’ అని చండీగఢ్ నుంచి వచ్చిన
తేజీందర్ సింగ్ అనే భక్తుడు తన మనసులోని భావాలను వ్యక్తీకరించాడు. ‘‘లక్షల మంది
భక్తులు రామయ్య దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే ఇంత సందడి’’ అంటూ అక్కడి
పరిస్థితిని వర్ణించాడు.
ఒడిషాకు చెందిన మరో భక్తుడు పూరీ జగన్నాథ
క్షేత్రం నుంచి అయోధ్యకు చేరుకున్నాడు. ‘‘రామ్‌లల్లాను దర్శించుకోడానికి పూరీ
నుంచి మోటార్ సైకిల్ మీద మొత్తం 1224 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చాను.
రాముణ్ణి ఎప్పుడెప్పుడు దర్శించుకుంటానా అని తహతహలాడుతున్నాను. దారిలో నన్ను
కొందరు ఎక్కడికి వెడుతున్నావని అడిగారు. ఐదువందల యేళ్ళుగా కట్టకుండా ఉండి ఇప్పటికి
నిర్మాణమైన భవ్యమందిరంలో రామయ్యను దర్శించుకోడానికి వెడుతున్నాను అని వాళ్ళకు
చెప్పాను. మరికొద్దిసేపట్లో నా తండ్రిని చూస్తాను’’ అంటూ ఆనంద పరవశుడయ్యాడు.
భవ్య రామమందిరం పరిసర
ప్రాంతాల్లో పటిష్ట భద్రత కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి అవాంతరాలూ కలక్కుండా దర్శనాలకు
ఏర్పాట్లు చేసారు. అంతకుముందు, గతరాత్రి అయోధ్యలో కన్నులపండువగా దీపోత్సవం నిర్వహించారు.