DMK stand on Ayodhya and Ram Mandir
తమిళనాడులోని డీఎంకే
ప్రభుత్వం అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం
చేయవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. లైవ్ టెలికాస్ట్‌ను నిషేధించాలంటూ
స్టాలిన్ సర్కారు ఆదేశాలు జారిచేసిందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపణలు
చేసారు. ఆలయాల్లో పూజలు, భజనలను సైతం అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ
నేపథ్యంలో తమిళనాడు బీజేపీ కార్యదర్శి వినోజ్ పి సెల్వం
తరఫున ఆయన న్యాయవాది
బాలాజీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఇరుపక్షాల వాదనలూ విన్న సుప్రీంకోర్టు,
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాలను అడ్డుకోవద్దని ఆదేశించింది.
ఇప్పటికే అలాంటి అభ్యర్థనలను తిరస్కరించిన వాటికి సరైన కారణాలను చూపించాలని
ఆదేశించింది. అయినప్పటికీ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కాంచీపురం
కామాక్షి ఆలయం వద్ద, అయోధ్య ప్రత్యక్షప్రసారాన్ని చూడడానికి ఏర్పాటు చేసిన ఎల్ఈడీ
స్క్రీన్లను రాష్ట్రప్రభుత్వం తొలగించింది.
అసలు డీఎంకే పార్టీ మొదటినుంచీ హిందూద్వేషిగానే
ఉంది. అయోధ్య రామమందిరం విషయంలో మొదటినుంచీ వ్యతిరేకధోరణే అవలంబిస్తోంది. అది
ఈనాటి కథ కాదు. ఆ పార్టీకి ఆదర్శపురుషుడైన రామస్వామి నాయకర్ వైఖరే ఈనాటికీ
కొనసాగుతోంది.
‘ఆర్యుల దండయాత్ర’
అనే కట్టుకథను తమిళనాడులో ప్రచారం చేసిన దుర్మార్గుడు ఈవీ రామస్వామి నాయకర్.
రామస్వామి మొదటినుంచీ హిందూద్వేషిగానే ఉన్నాడు. ద్రవిడుల కోసం కృషి చేస్తున్నానన్న
ముసుగులో హిందువులపై అత్యాచారాలు సాగించాడు. 1953లో
గణేశ విగ్రహాల విధ్వంసం కార్యక్రమం చేపట్టాడు. ఆ సందర్భంగా వేల సంఖ్యలో గణేశుని
విగ్రహాలను రామస్వామి, అతని అనుచర దుండగులు పగలగొట్టారు.
1956 ఆగస్టు 1న
రామస్వామి ఇంకో పథకం వేసాడు. శ్రీరామచంద్రుడి చిత్రపటాలను తగలబెట్టడానికి ప్రణాళిక
వేసాడు. అసలు రామాయణాన్ని ఆర్యులు, ద్రవిడుల మధ్య యుద్ధంగా దుష్ప్రచారం చేసింది
అతనే. ఆరోజు అతన్ని అరెస్ట్ చేసినప్పటికీ అతని అనుచరులైన దుండగులు రాముడి
చిత్రపటాలను మద్రాసు మెరీనా బీచ్‌లో తగలబెట్టారు.
రామస్వామి 1973లో
చనిపోయాడు. తన చివరికోరికగా రావణలీల ప్రదర్శించాలని అతను రాసిపెట్టాడు. దాంతో,
దసరా శరన్నవరాత్రుల్లో ప్రదర్శించే రామలీలకు వ్యతిరేకంగా, అతని అనుచరులు 1974లో
రావణలీల ప్రదర్శించారు. అలా ఆజన్మాంతం రామవైరిగానే నిలిచాడు రామస్వామి నాయకర్.
రామస్వామి నాయకర్ తన
జీవితకాలంలో రామాయణంపై ఎన్నో అబద్ధాలు ప్రచారం చేసాడు. రాముడు కులవాది అనీ,
ఆడవాళ్ళని చంపేవాడనీ నోటికి వచ్చినట్టు వాగేవాడు. ద్రవిడుల ఉనికిని
చెరిపివేయడానికి మోసగాళ్ళయిన ఆర్యులు రాసిన కట్టుకథలే రామాయణం, మహాభారతం అని
ప్రచారం చేసేవాడు.
ద్రవిడ పార్టీగా పుట్టిన డీఎంకే రామస్వామి నాయకర్
చెత్తవాదనలను ప్రేరణగా తీసుకుంది. ఆ తప్పుడు సిద్ధాంతాలను తమ రాజకీయ లబ్ధి కోసం
మరింత దుర్మార్గంగా ఉపయోగించుకుంది. డీఎంకే నేత కరుణానిధి రాముడిని జీవితాంతం నిందిస్తూనే
ఉన్నాడు.
తమిళ సాహిత్యంలో కంబ రామాయణంగా ప్రసిద్ధికెక్కిన
కావ్యం ‘రామావతారం’కు విశేషస్థానం ఉంది. కంబర్ అనే మహాకవి, సంస్కృతంలో ఉన్న
వాల్మీకి రామాయణానికి చేసిన తమిళ అనువాదం అది. ఆ కావ్యాన్ని తమిళ సాహిత్యంలో
ఆణిముత్యంగా పరిగణిస్తారు. దాన్ని కరుణానిధి తీవ్రంగా వ్యతిరేకించాడు. దానికి
కారణం, వాల్మీకి రామాయణంలో రావణుడిని రాక్షసుడిగా చిత్రీకరించడమే. కంబర్‌ను సైతం
ఆర్య దురహంకారిగా కరుణానిధి దూషిస్తుండేవాడు.
అయోధ్య రామజన్మభూమి విషయంలో డీఎంకే ఎప్పుడూ
వ్యతిరేకంగానే ఉండేది. అయోధ్యలో కరసేవకు తమిళనాడు నుంచి కార్యకర్తలు వెళ్ళే సమయంలో
డీఎంకే రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది.
రామస్వామి నాయకర్ శిష్యుడైన కరుణానిధికి రాముడంటే
ఎప్పుడూ కోపమే. తమిళనాడులో రాముడి అస్తిత్వానికి ప్రతీకగా ఉన్న రామసేతును
కూల్చేయడానికి కరుణానిధి చేయని ప్రయత్నం లేదు. దానికోసమే సేతుసముద్రం షిప్పింగ్ కెనాల్
ప్రాజెక్టును సైతం ప్రారంభించాడు. ఆ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు
దాఖలైనప్పుడు కరుణానిధి ఆగ్రహానికి అంతేలేదు. టీవీ కెమెరాల ముందే రాముణ్ణి
తీవ్రంగా దూషించాడు. ‘‘రాముడెవరు. అసలు రాముడనేవాడు ఒక అబద్ధం. ద్రావిడుడు అయిన
రావణుడిని రాక్షసుడిగా చూపించిన రామాయణంలో ఏమాత్రం చారిత్రక వాస్తవం లేదు’’ అని
అరిచాడు. ‘రామసేతును కట్టడానికి రాముడేమైనా ఇంజనీరా’ అంటూ తన వాచాలత
ప్రదర్శించాడు. కాంగ్రెస్ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న యూపీయే
ప్రభుత్వం, రామసేతును కూల్చేయడం కోసం కరుణానిధి ప్రతిపాదించిన సేతుసముద్రం
ప్రాజెక్టును సమర్ధించింది.
కరుణానిధి, అతని డీఎంకే పార్టీ మొదటినుంచీ
అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయోధ్యలో కరసేవ
చేయడానికి నిర్ణయించిన రోజుకు ముందురోజు, అంటే 1995 డిసెంబర్ 5న తమ పార్టీ పత్రిక
మురసోలిలో కరుణానిధి ఇలా రాసాడు….
‘‘అసలు కరసేవ అంటే ఏంటి? దైవానికి సేవ చేయడమా లేక
సమాజంలో అశాంతి రగిలించడానికి విత్తనాలు జల్లడమా? పైగా ఆ చర్యకు ఇక్కడి ఒక మహిళ
(జయలలిత) మద్దతివ్వడం ఒకటా.’’
‘‘వాళ్ళు, రాముడు త్రేతాయుగంలో పుట్టాడు అంటారు.
ఆ తర్వాత ద్వాపరయుగం వచ్చింది, వెళ్ళింది. ఇప్పుడు కలియుగం జరుగుతోంది అంటారు.
అంటే రాముడు పుట్టి ఇరవై లక్షల సంవత్సరాలు గడిచిపోయాయట. ఇరవై లక్షల యేళ్ళ క్రితం
రాముడు సరిగ్గా అదే చోట పుట్టాడట. ఎవరు చూసొచ్చారు? దానిగురించి ఎవరు రాసారు?
సరిగ్గా ఆ స్థలంలోనే రాముడు పుట్టాడని వాళ్ళు దేనికి చెబుతున్నారో తెలుసా? ఇస్లాం
చరిత్రను ధ్వంసం చేయడానికి. అది న్యాయబద్ధమైనదా?’’
‘‘అయోధ్యలో రాముడికి ఒక గుడి కావాలని మీరు
కోరుకుంటే, దాంతో మాకు ఏ ఇబ్బందీ లేదు, కానీ అక్కడ గుడి కట్టడానికి బాబరీ మసీదును
పడగొడతామంటే మేం ఒప్పుకునేదే లేదు.’’
ఆ వ్యాసాన్ని చూస్తే కరుణానిధి కరసేవను విధ్వంసకాండతో
పోలుస్తూ విమర్శలు చేసాడు. ఇరవై లక్షల సంవత్సరాల క్రితం రాముడు పుట్టడాన్ని ఎవరు
చూసొచ్చారంటూ అపహాస్యం చేసాడు. ఇస్లామిక్ చరిత్రను ధ్వంసం చేయడం అన్యాయమంటూ
కల్లబొల్లి ఏడ్పులు ఏడ్చాడు.
బాబరీ మసీదు ధ్వంసమైనప్పుడు కరుణానిధి తీవ్రంగా
విరుచుకుపడ్డాడు. ఆ నిర్మాణాన్ని రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ
మండిపడ్డాడు. ‘అలాంటి దారుణమైన చర్యను నిలువరించడానికి చర్యలు తీసుకోనందుకు, ఇకపై
జరగబోయేవాటికి పూర్తి బాధ్యత కేంద్రప్రభుత్వమే తీసుకోవాలి’’ అంటూ హెచ్చరించాడు.
కరుణానిధి కొడుకు స్టాలిన్ కూడా తన తండ్రి
వైఖరినే అనుసరించాడు. ఆ కేసులో 32మంది నిందితులను సీబీఐ కోర్టు ఆరోపణల నుంచి విముక్తులను
చేసినప్పుడు స్టాలిన్ తీవ్రంగా దుయ్యబట్టాడు. బాబ్రీ విధ్వంసం కేసులో సీబీఐ
నిజాయితీగా వ్యవహరించలేదంటూ దారుణమైన విమర్శలు చేసాడు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం
గుప్పెట్లో సీబీఐ పంజరంలో చిలుకలా మారిపోయిందని ఆరోపించాడు. సీబీఐ నిష్పాక్షికంగా
పనిచేయలేదనీ, కేంద్రం పాడమన్న పాటే పాడే చిలకలా తయారవడం సిగ్గుచేటనీ, తిట్టిన
తిట్టు తిట్టకుండా తిట్టాడు.
అయోధ్య విషయంలో డీఎంకేకు సంబంధించి ఒక విచిత్రమైన
సంఘటన ఉంది. డీఎంకే మైనారిటీ విభాగానికి చెందిన నాయకుడు ఎస్ మస్తాన్, అయోధ్యలో
రామాలయ నిర్మాణానికి రూ.11వేలు విరాళం ప్రకటించాడు. ఆ సమయంలో అతను గింజీ
నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా. అంతే, డీఎంకే
పార్టీ సభ్యులే అతనిపై విరుచుకుపడి పోయారు.
2019లో అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు తీర్పు
వచ్చినప్పుడు మాత్రం స్టాలిన్ కొంచెం సంయమనం వహించాడు. సుప్రీంకోర్టు తీర్పును
అన్నివర్గాల వారూ అంగీకరించాలని ప్రకటన ఇచ్చాడు. ‘‘సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న
వివాదం మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ప్రజలు దాన్ని వ్యతిరేకించకూడదు’’
అని సూచించాడు. ‘‘మత సామరస్యం కొనసాగడం అవసరం, ఈ దేశపు వైవిధ్యాన్ని చెదరగొట్టకూడదు.
ఈ కేసులో కక్షిదారులు, న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును అతిజాగ్రత్తగా అనుసరించాలి’’
అని హుందాగా వ్యవహరించినట్టు నటించాడు.
చివరికి ఇవాళ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం
వచ్చేసరికి స్టాలిన్ ముసుగు తొలగిపోయింది. ఆ కార్యక్రమం టెలికాస్ట్‌ను సైతం
తమిళనాడు రాష్ట్రంలో అడ్డుకోడానికి చేయాల్సిందంతా చేసాడు. కోర్టు ముందు నాలుక
ఎన్ని మడతలు పెట్టినా, ఆచరణలో మాత్రం ఛానెళ్ళ ప్రసారాలను అడ్డుకున్నాడు. స్వయానా కేంద్ర
మంత్రి కార్యక్రమాన్నే నిలిపివేసి, అక్కడ ఏర్పాటు చేసుకున్న టీవీలను తీయించేసాడు. రాముడి
విషయంలో, భారతదేశపు సమైక్యత విషయంలో ఇలాంటి దుర్మార్గమైన వైఖరి డీఎంకేది. ఆ పార్టీ
తీరు మారదు. అందుకే, డీఎంకే ప్రవర్తనతో తమిళ ప్రజలు విసిగిపోతున్నారు.