Lord Ram and Indian Constitution
రామజన్మభూమి ఉద్యమ వ్యతిరేకులు
అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని అడ్డుకోడానికి, అన్ని రాజ్యాంగబద్ధ ఉపకరణాలనూ
దుర్వినియోగం చేసారు. హిందువుల పట్ల వారి ద్వేషం ఏ స్థాయికి పెరిగిపోయిందంటే వారు
ఏకంగా రాముడి ఉనికినే ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో
సవాల్ చేసారు. సుప్రీంకోర్టు తీర్పునిచ్చాక దానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం
చేయడానికి కూడా రాజ్యాంగ పద్ధతులనే ఆసరా చేసుకున్నారు.
అదే సమయంలో వారు దురుద్దేశపూర్వకంగా
ఒక రాజ్యాంగబద్ధమైన వాస్తవాన్ని దాచిపెట్టేసారు. రామభక్తులను అవమానించడం, వారి
నైతికస్థైర్యాన్ని దెబ్బతీయడమే వారి లక్ష్యం కదా. అందుకోసం పన్నిన వ్యూహంలో
భాగంగానే రాజ్యాంగం సాక్షిగా ఉన్న నిజాలను సైతం దాచిపెట్టారు. అదేంటంటే భారతదేశపు
రాజ్యాంగంలో సైతం శ్రీరామచంద్ర భగవంతుడు ఉన్నాడు.
భారత రాజ్యాంగంలో కొన్ని
చిత్రలేఖనాలను, చిత్రాలనూ కూడా పొందుపరిచారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక, ఆ
చిత్రాలూ చిత్రలేఖనాలతో కూడిన మొట్టమొదటి రాజ్యాంగాన్ని పరిమిత సంఖ్యలో మాత్రమే
ప్రచురించారు. అందులో మొత్తం 22 చిత్రాలున్నాయి. వాటిలో రాముడిది కూడా ఒకటి.
రావణవధ అయిపోయాక వనవాసం పూర్తిచేసుకుని రాముడు అయోధ్యకు తిరిగివెడుతున్న
దృశ్యాన్ని చిత్రీకరించిన చిత్రలేఖనాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. అయితే ఆ
రాజ్యాంగం ప్రతులు ఇప్పుడు అందుబాటులో లేవు. పార్లమెంటు గ్రంథాలయంలో, హీలియం
వాయువు నింపిన ప్రత్యేకమైన పేటికలో మాత్రమే ఆనాటి రాజ్యాంగ ప్రతిని చూడవచ్చు. విచిత్రం
ఏంటంటే ప్రపంచంలో మరే ఇతర దేశ రాజ్యాంగంలోనూ అలాంటి చిత్రాలు కానీ, చిత్రలేఖనాలు కానీ
లేవు. అది భారత రాజ్యాంగపు ప్రత్యేకత.
తొలినాళ్ళ రాజ్యాంగప్రతిలో
ఉన్న చిత్రంలో రాముడు పుష్పకవిమానంలో సీతాలక్ష్మణులతో కలిసి కూర్చుని ఉంటాడు. ‘రామాయణం
: లంకను జయించి సీతామాతనే వెనక్కు తీసుకుపోవడం’ అని ఆ చిత్రం కింద రాసి ఉంది. అంటే
భగవాన్ రాముడు అయోధ్యకు తిరిగి వెడుతుండడాన్ని ఆ చిత్రం చూపుతోంది. సీతాదేవిని ‘మాత’
అనడం ద్వారా ఆమె దేవత అని పేర్కొన్నారు.
అదొక వైరుధ్యం. ఏమిటా
వైరుధ్యం అంటే… దేశాన్ని ‘సెక్యులర్’గా ప్రకటించే రాజ్యాంగంలోని బొమ్మలు దాదాపు
అన్నీ మతపరమైనవే. 1950 నాటి రాజ్యాంగంలోనే ఆ చిత్రాలన్నీ ఉన్నాయి. అయితే సెక్యులర్
అన్న పదం మాత్రం 1976లో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు 42వ రాజ్యాంగ
సవరణ ద్వారా మాత్రమే రాజ్యాంగంలోకి వచ్చి పడింది. నిజానికి మొట్టమొదట రాజ్యాంగాన్ని
ఆమోదించడానికి ముందు ‘సెక్యులర్’ అన్న పదం గురించి రాజ్యాంగ అసెంబ్లీలో
చర్చోపచర్చలు జరిగాయి, చివరికి ఆ పదాన్ని మాత్రం ప్రవేశపెట్టలేదు. సెక్యులర్, సోషలిస్ట్ అనే రెండు పదాల గురించి
హోరాహోరీగా చర్చ జరిగింది కానీ ఆ పదాలను రాజ్యాంగంలో చేర్చలేదు. చివరికి ఆ రెండు
పదాలనూ 42వ సవరణ ద్వారా రాజ్యాంగప్రవేశికలో చేర్చారు. అసలా సవరణే, రాజ్యాంగంలో
పొందుపరిచిన చిత్రాలద్వారా అందించిన సందేశానికి విరుద్ధమైన సవరణ.
రాజ్యాంగంలో పొందుపరిచిన
చిత్రాలు భారతదేశపు హిందుత్వ భావనను స్పష్టం చేస్తాయి. ఆ చిత్రాలు సింధునదీ
నాగరికతలో లభించిన ఎద్దు బొమ్మతో మొదలై స్వాతంత్ర్యపోరాటాన్ని ఓ మలుపు తిప్పిన
సుభాష్ చంద్రబోస్ చిత్రంతో ముగుస్తాయి. ఆ చిత్రాల్లో రాముడు, కృష్ణుడు, వైదిక
ఆశ్రమం, బుద్ధుడు, మహావీరుడు, నలంద, నటరాజస్వామి, గుప్తుల కాలం, విక్రమాదిత్యుడి రాజసభ
మొదలైన దృశ్యాలు ఉంటాయి.
ఆ చిత్రలేఖనాలకు రూపకల్పన
చేసిన బృందానికి శాంతినికేతన్‌కు చెందిన శాంతిలాల్ బోస్ నేతృత్వం వహించారు.
ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆ చిత్రాలను రాజ్యాంగంలో పొందుపరచడానికి ఏకగ్రీవంగా అందరూ
ఆమోదించారు. ఎవరూ వ్యతిరేకించలేదు. రాజ్యాంగ నిర్మాతలు అందరూ ఆ చిత్రాలను
ఒప్పుకున్నారనడానికి అదే సాక్ష్యం. ప్రాచీన భారతదేశపు ఉనికి, దాని తాత్వికతలను
వారు గుర్తించారనడానికి అదే నిదర్శనం. 1947కు ముందు భారతదేశం ఎప్పుడూ ఒక దేశంగా
లేదు అని వాదించే వామపక్షీయుల సిద్ధాంతాన్ని ఆ చిత్రాలే పూర్వపక్షం చేసాయి. ఇంకా
చెప్పుకుంటే ఆ చిత్రలేఖనాలు భారతదేశపు మొత్తం భౌగోళిక స్వరూపంలోని అన్ని భాగాలనూ
ప్రతిబింబించాయి, దేశపు భౌగోళిక ఐక్యతను ప్రదర్శించాయి, ప్రాచీనకాలం నుంచీ దేశమంతా
విస్తరించిన సాంస్కృతిక సంబంధాలకు ప్రతీకగా నిలిచాయి. భారత్ కొన్ని రాష్ట్రాల
సముదాయమే తప్ప ఒక దేశం కాదు అన్న వామపక్షుల వాదన తప్పేనని ఆ చిత్రాలు స్పష్టంగా
నిరూపిస్తున్నాయి.
అదే సమయంలో భారతప్రభుత్వం,
వివిధ ప్రభుత్వ విభాగాలూ తమ స్ఫూర్తివాక్యాలుగా ప్రదర్శిస్తున్న వాక్యాలు కూడా
భారతదేశపు ప్రాచీన సంప్రదాయిక, చారిత్రక స్పృహకు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
ఉదాహరణకు మన దేశపు జాతీయ స్ఫూర్తివాక్యం ‘సత్యమేవ జయతే’ అన్నది ముండకోపనిషత్ నుంచి
స్వీకరించబడింది. సుప్రీంకోర్టు స్ఫూర్తివాక్యం ‘యతో ధర్మస్తతో జయః’ – ధర్మంఉన్నచోటనే జయం ఉంటుంది– అన్నవాక్యం మహాభారతంలోనిది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్
జనరల్ వ్యవస్థ స్ఫూర్తివాక్యం ‘లోకహితార్థ సత్యనిష్ఠ’. భారత పురావస్తు సర్వేక్షణ
సంస్థ స్ఫూర్తివాక్యం ప్రత్నకీర్తిమపావృణు. ఆకాశవాణి
స్ఫూర్తివాక్యం ‘బహుజన హితాయ బహుజన సుఖాయ’. ఇంటలిజెన్స్ బ్యూరో స్ఫూర్తివాక్యం ‘జాగృతమ్
అహర్నిశమ్’. ఈ స్ఫూర్తివాక్యాలన్నీ సంస్కృత సాహిత్యంలోనివే. అవి కనీసం 3500
సంవత్సరాల కంటె ప్రాచీనమైనవి. ఇలా స్ఫూర్తివాక్యాల ద్వారా సంస్కృతభాషను గుర్తించడం
భారతదేశపు సాంస్కృతిక జాతీయతకు ప్రత్యక్ష సాక్ష్యమే.
అలా, సనాతన భారతీయ నాగరికత
నుంచి ప్రేరణ పొందాలనీ, పునరుత్తేజం చెందాలనీ స్వాతంత్ర్య భారతం ఉద్దేశపూర్వకంగా
స్పష్టంగా ఎంచుకుంది. రాజ్యాంగ వ్యవస్థా నిర్మాతలు స్వాతంత్ర్యానంతరం మొదటి దశాబ్ద
కాలంలో ఒక సంప్రదాయాన్ని ఏర్పాటు చేసారు, అదేంటంటే సుసంపన్నమైన, సుసమృద్ధమైన మన ఘన
సంస్కృతీ జ్ఞానాల వారసత్వం నుంచి నిర్మించుకున్న మన సొంత విలువలు, నైతిక సూత్రాల ఆధారంగానే
భారతీయ రాజ్యాంగబద్ధ సంస్థలు నడుచుకోవాలనే పద్ధతిని ఏర్పాటు చేసారు. ఆ
సంప్రదాయాన్ని ఈనాటికీ అనుసరిస్తూనే ఉన్నామనడానికి పార్లమెంటు కొత్త భవనమే నిదర్శనం.
ఆ భవనం ఔటర్ కారిడార్‌లో సంస్కృత శ్లోకాలు, 58 కుడ్యచిత్రాలూ ఉన్నాయి.
ప్రజల ప్రాథమిక హక్కులను
పొందుపరిచిన రాజ్యాంగం మూడవ భాగంలో రామచంద్రమూర్తి చిత్రలేఖనం ఉంది. మన సొంత రాజ్యాంగం
అమల్లోకి రావడంతో 800 ఏళ్ళ పరాయి పాలన దాస్యశృంఖలాల నుంచి విడివడి మన సొంత పాలన
ప్రారంభమైంది. ఇక మన ప్రజల ప్రాథమిక హక్కులే మనకు అత్యంత ప్రధానమయ్యాయి. ప్రత్యేకించి
సమానత్వ హక్కు, జీవించే హక్కు అనేవి అత్యంత ప్రధానమైనవి. ఆ రెండూ పుష్కలంగా ఉన్న
రాజ్యాన్ని రామరాజ్యంగా అభివర్ణిస్తాం. అంతేకాదు, సుపరిపాలనకు ప్రత్యక్ష
నిదర్శనంగా రామరాజ్యాన్ని చెప్పుకుంటాం. రాముడి జీవితంలో నుంచి సామాజిక
సమానత్వానికి బోలెడన్ని ఉదాహరణలు లభిస్తాయి. కులం జాతి ప్రాంతాల ఆధారంగా ఎలాంటి
వివక్షా లేనిదే రామరాజ్యం.
రాముడు ఆదర్శ రాజు, ఆయన
పరిపాలనలోని రాజ్యమే రామరాజ్యం. అది ఎంత గొప్పదో, ఎంత బలమైనదో తెలియజేసే ఉదాహరణ
రామాయణంలోనే ఉంది. రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆయన తమ్ముడు భరతుడు అన్నగారి
పేరుమీదనే రాజ్యాన్ని పాలించాడు. పరిపాలనలో ఆధ్యాత్మికతకు అదే పెద్ద నిదర్శనం.
నైతికత పట్ల విశ్వాసం, నిబద్ధత, గౌరవాలకు భరతుడి ప్రవర్తనే తార్కాణం. అదే రామాయణపు
వాస్తవిక సారాంశం.
భారత రాజ్యాంగం, దాని
విలువలు మన సంస్కృతి, మన చరిత్ర నుంచి ప్రేరణ పొందాయి. శతాబ్దాలుగా అనుసరిస్తున్న,
రాసిలేకపోయినప్పటికీ పాటిస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు, విధివిధానాలను అనుసరించి
మనం తయారుచేసుకున్న నియమావళే రాజ్యాంగం. వేదకాలం నుంచి నేటివరకూ మన దేశం, మన
నాగరికత, మన సంస్కృతి అన్నీ… నియమాల మీద ఆధారపడిన సమాజ వ్యవస్థనే విశ్వసించాయి.
పాశ్చాత్య ప్రపంచపు మాగ్నాకార్టా కంటె చాలాముందునుంచే మనదేశంలో అత్యున్నతమైన
న్యాయవ్యవస్థ, న్యాయసూత్రాలూ ఉన్నాయి. అందువల్ల మన రాజ్యాంగం మనకు విదేశీయులు
పెట్టిన భిక్ష కాదు. పాశ్చాత్యదేశాల ఆలోచనలు, విధానాలు అనుకున్నవి మనదేశంలో
ఎప్పటినుంచో ఉన్నాయనీ, వాటిని అనుసరించి పాటించే సంప్రదాయం మనదేశంలో ఏనాటినుంచో
అమలవుతోందనీ మనం గ్రహించగలగాలి. మన రాజ్యాంగాన్ని పాశ్చాత్య దృష్టితో మాత్రమే
కాకుండా భారతీయ సందర్భాలలోనుంచి కూడా చూసి గ్రహించి అర్ధం చేసుకుని
వ్యాఖ్యానించాలి. కలోనియల్ భావజాలంలో నుంచి మన రాజ్యాంగాన్ని విముక్తం చేసుకోవాలి.
మన రాజ్యాంగం భారతీయ విలువల మీద ఆధారపడి రూపొందింది అని మనం గర్వంగా చెప్పుకోగలగాలి.
దానికి సరైన తరుణం ఇదే.