అయోధ్య
భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ముహూర్త ఘడియలు సమీపించాయి.
కాసేపట్లో 500 ఏళ్ల నాటి భారతీయుల కల నెరవేరబోతుంది. జై శ్రీరామ్ నినాదాలతో
అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. దేశ, విదేశాల నుంచి రామభక్తులు అయోధ్యకు
చేరుకున్నారు. విమానాలు, రైళ్ళు, ప్రత్యేక
వాహనాల్లో శ్రీరాముడి జన్మస్థలికి తరలివచ్చారు.
దేశమంతా శోభాయాత్రలు
జరుగుతున్నాయి.
ప్రాణప్రతిష్ఠ
కార్యక్రమంలో 150 మంది సాధువులు, మత గురువులు, 50 మంది ఆదివాసీ తెగలకు చెందిన ప్రతినిధులు
భాగస్వాములు అవుతున్నారు.
రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులతో పాటు హిందూ
సంఘాల నేతలు, కరసేవకుల కుటుంబ సభ్యులు సహా 7 వేల మంది అతిథులకు ఆహ్వానం అందింది. ఇందులో
506 మంది అత్యంత ముఖ్య ప్రముఖులు ఉన్నారు.
తెలుగు
రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు ఈ మహాత్తర ఘట్టంలో పాల్గొంటున్నారు. మెగా
హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్
కళ్యాణ్ ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు.
బాలరాముడి
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడంపై స్పందించిన చిరంజీవి, తన ఇష్టదైవం హనుమంతుడే
తనకు ఆహ్వానం పంపినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యక్షంగా ప్రాణప్రతిష్ఠ ను
వీక్షించడం అదృష్టంగా భావిస్తోన్నట్లు చెప్పారు. తనకు ఈ క్షణాలు జీవితాంతం గుర్తు
ఉంటాయన్నారు. ఎన్నో ఎళ్ల ఎదురుచూపులు నిజరూపం దాలుస్తున్న క్షణాలు ఇవి అని రామ్‌చరణ్
అన్నారు. అయోధ్యలోని పలు హిందూ ఆలయాలను టీడీపీ అధినేత చంద్రబాబు సందర్శించి
ప్రత్యేక పూజలు చేశారు.
నటుడు,
బీజేపీ నేత అనుపమ్ ఖేర్ అయోధ్య చేరుకున్నారు. నేడు మరో దీపావళిలా ఉందని వ్యాఖ్యానించారు.
హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా రామమందిర
వేడుకలో పాల్గొనేందుకు అయోధ్య విచ్చేశారు.
సూపర్ స్టార్ రజినీకాంత్, వివేక్
ఒబెరాయ్ కూడా అయోధ్య పయనమయ్యారు. ముంబై నుంచి సచిన్ టెండూల్కర్, మాధురీ దీక్షిత్
దంపతులు, రణబీర్-ఆలియాభట్, కత్రినా కైఫ్ ఆమె భర్త విక్కీ కౌశల్, జాకిష్రాఫ్, రణ్
దీప్ హుడాలు రామజన్మభూమికి పయనమయ్యారు.
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రముఖ
పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ నివాసానికి ప్రత్యేక డెకరేషన్ చేశారు. 27 అంతస్తుల
భవనం రామనామాలతో వెలిగిపోతోంది. శ్రీరాముడి బ్యానర్లతో అలంకరించారు.