భారతీయుల
500 ఏళ్ళ స్వప్నం కాసేపట్లో నెరవేరనుంది. అయోధ్యలో కొత్తగా నిర్మిస్తోన్న భవ్య
రామమందిర గర్భాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రంగరంగ వైభవంగా
సాగుతోంది. వైదిక క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు.
మధ్యాహ్నం 12.15
గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రతిష్ఠా కార్యక్రమం జరగనుంది.
ఆలయ
ప్రారంభోత్సవానికి 7 వేల మంది అతిరథమహారథులు హాజరవుతున్నారు. ఇప్పటికే వీరంతా
అయోధ్య చేరుకున్నారు. దీంతో భారీ భద్రతా చర్యలు చేపట్టారు. 13 వేల మంది భద్రతా సిబ్బంది
అయోధ్యలో మోహరించారు.
ఉత్తర
ప్రదేశ్ పోలీసులతో పాటు ఏటీఎస్ కమాండోలు, సీఆర్పీఎఫ్ దళాలు చేరుకున్నాయి. మందిర
పరిసరాల్లో యాంటీ డ్రోన్ జామర్లు ఏర్పాటు చేశారు. యాంటీ బాంబ్ స్క్వాడ్, స్నైపర్లు
మోహరించారు. పదివేల సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ఏఐ ఆధారిత టెక్నాలజీని
వినియోగించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు విధించి పాసులు ఉన్నవారిని మాత్రమే
ఆలయ ప్రాంగణం వద్దకు అనుమతిస్తున్నారు.
అయోధ్య మొత్తం కాషాయమయంగా మారింది. భవనాలు,
టవర్లకు కాషాయ జెండాలు, తోరణాలు కట్టారు. జెండాలపై శ్రీరాముడు, హనుమంతుడి బొమ్మలు
ఉన్నాయి. విద్యుత్ దీపాలతో రామాయణ కాలపు ఘట్టాలను ప్రదర్శిస్తోన్నారు. హెలీకాప్టర్
తో పూలవర్షం కురిపించే ఏర్పాట్లు కూడా చేశారు. హారతి సమయంలో పూలవాన కురిపిస్తారు. జై శ్రీరామ్ నినాదాలతో అయోధ్య ప్రాంతం మార్మోగుతోంది.
రామభక్తుల తాకిడితో సరయూ నదీతీరం పులకించిపోతోంది.