Ram Lalla is reaching his birthplace Ayodhya and taking charge of his abode
అయోధ్యలో శ్రీరామజన్మభూమి మందిరంలో బాలరాముడి
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మరికొద్దిసేపట్లో జరగనుంది. ఐదు శతాబ్దాల పరాధీనత వదిలి
ఇన్నాళ్ళకు రామ్‌లల్లా తన రాజ్యంలో తన జన్మస్థానంలో విరాజమానుడు కాబోతున్నాడు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేశమంతా వేడుక
వాతావరణం నెలకొంది. ఒక్క మనదేశంలోనే కాదు, విదేశాల్లో స్థిరపడిన భారతీయులు సైతం ఇవాళ
పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని మరో దీపావళిలా దేదీప్యమానంగా వేడుక
చేసుకుంటున్నారు. ఇళ్ళన్నీ శోభాయమానంగా అలంకరించారు. రామయ్య మూర్తికి
ప్రాణప్రతిష్ఠ జరిగే క్షణాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా ప్రాణప్రతిష్ఠ
కార్యక్రమం జరగనుంది. దానికోసం ఆయన 11 రోజుల ఆధ్యాత్మిక అనుష్ఠానం చేపట్టారు. ఇవాళ
అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు రావడానికి ముందు ఆయన దక్షిణదేశంలోని ప్రధాన రామక్షేత్రాలను
సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాముడు జటాయువును కలిసిన లేపాక్షిని సందర్శించారు.
తమిళనాడులో తిరుచిరాపల్లి, శ్రీరంగం, రామేశ్వరం క్షేత్రాలను సందర్శించారు. రామయ్య
పాదాలు అడుగిడిన ప్రదేశాల్లో పూజలు, పవిత్రస్నానాలూ చేసారు. అనంతరం అయోధ్య
చేరుకున్నారు.
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హిందూధర్మానికి చెందిన
సాధుసంతులు, మఠాల-పీఠాల అధిపతులు, గిరిజనులు హరిజనులు సహా అన్నివర్గాల ప్రజలూ
హాజరవుతున్నారు. ప్రాణప్రతిష్ఠ ఉత్సవం వైభవంగా నిర్వర్తించడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ
పెద్దలు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసారు. అదేసమయంలో, ఈ కార్యక్రమం సందర్భంగా ఎలాంటి
అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసారు.
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయాక ప్రధానమంత్రి
నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్రీయ స్వయంసేవక్
సంఘ్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రసంగిస్తారు. వారు భవ్యరామమందిరాన్ని
నిర్మించిన కార్మికులతో సైతం సమావేశమవుతారు. ఆ తర్వాత మోదీ కుబేరతిల అనే ప్రాచీన
శివాలయాన్ని సందర్శించి అక్కడ పూజలు చేస్తారు.
రామమందిరం ఉత్తరభారతదేశపు సంప్రదాయ నిర్మాణశైలి
అయిన నాగర పద్ధతిలో నిర్మితమవుతోంది. దీని పొడవు 380 అడుగులు, వెడల్పు 250
అడుగులు. మొత్తం 392 స్తంభాలు, 44 ద్వారాల నిండా దేవీదేవతల మూర్తుల చెక్కడాలు
ఉంటాయి. శ్రీరామచంద్రమూర్తి ఐదేళ్ళ వయసులో ఉండే బాలరాముడి రూపంలో మూలవిరాట్టును
తీర్చిదిద్దారు. దాన్నే గర్భగృహంలో ఉంచుతారు. 51 అంగుళాల ఆ విగ్రహంతో పాటు,
ఇన్నేళ్ళూ అయోధ్యలో విరాజమానుడైన రామ్‌లల్లా చిన్న విగ్రహాన్ని కూడా గర్భగృహంలొనే
ప్రతిష్ఠిస్తారు.
రామమందిర నిర్మాణాన్ని ఉద్యమంలా నిర్వహించిన సాంస్కృతిక
సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, దాని రాజకీయ అనుబంధ సంస్థ భారతీయ జనతా పార్టీ,
సోదర సంస్థలు విశ్వహిందూపరిషత్, బజరంగ్ దళ్ వంటి సంస్థల ప్రధాన నేతలందరూ అయోధ్య
చేరుకున్నారు.
ఐదు శతాబ్దాల తర్వాత అయోధ్య మళ్ళీ రాచనగరు కళ
సంతరించుకుంది. కొన్నివారాల క్రితం వరకూ నిద్రాణంగా ఉన్న చిన్నపట్టణం అయోధ్య
ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన
రైల్వేస్టేషన్లతో దేశంలోని ప్రముఖ నగరాలతో దీటుగా శోభిల్లుతోంది. దేశవిదేశాల నుంచి
వస్తున్న అతిథులను ఆహ్వానిస్తోంది. హోటళ్ళు, గెస్ట్‌హౌస్‌లు, విడిదిళ్ళతో
కళకళలాడిపోతోంది. రామమందిర నిర్మాణం, ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో ఆర్థిక
కార్యక్రమాలు పుంజుకున్నాయి.
వేలయేళ్ళుగా విలసిల్లుతున్న రామమందిరాన్ని 16వ
శతాబ్దంలో పడగొట్టి మొగల్ సుల్తాను బాబర్ అక్కడ మసీదు నిర్మించారు. ఆ వివాదాస్పద
కట్టడాన్ని తొలగించి రామమందిరాన్ని పునరుద్ధరించాలని అప్పటినుంచీ న్యాయపోరాటం
జరుగుతోంది. మొగలులు, బ్రిటిష్ వారి హయాంలో సైతం న్యాయబద్ధంగా రామమందిరాన్ని
పునరుద్ధరించాలని రామభక్తులు పోరాటం చేసారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత
కూడా ఆ ఉద్యమం అదే స్ఫూర్తితో కొనసాగింది. అయితే స్వాతంత్ర్యం తెచ్చిన ఘనతను తమ
జేబులో వేసుకున్న కాంగ్రెస్ పార్టీ హిందూవ్యతిరేకంగా వ్యవహరించడంతో వారి పాలనలో
ఉన్న అర్ధశతాబ్దం పైబడిన కాలంలో రామమందిర నిర్మాణం సాధ్యం కాలేదు.
1992 డిసెంబర్ 6న
వివాదాస్పద కట్టడం ధ్వంసంతో రామమందిర ఉద్యమం మరింత జోరందుకుంది. ఎట్టకేలకు 2019లో
సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. వివాదాస్పద స్థలంలో మందిరం
కట్టుకోవచ్చునని అనుమతించింది. ముస్లిములు మరో ప్రత్యామ్నాయ స్థలంలో మసీదు కట్టుకోవాలని
సూచించింది. దాంతో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. అలా శతాబ్దాల స్వప్నం
నేటికి సాకారమవుతోంది.