ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల(Sharmila) బాధ్యతలు స్వీకరించారు. కానూరులోని ఓ కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ అధినేతలపై ఘాటు విమర్శలు చేశారు.
రాష్ట్రం విడిపోయినప్పుడు రాష్ట్రంపై లక్ష కోట్ల భారం ఉంటే, టీడీపీ పాలనలో అది రెట్టింపు అయిందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంపై అప్పుల భారం రూ. 10 లక్షలకు పెరిగిందన్నారు.
రాష్ట్రానికి రాజధాని లేకపోవడం దురదృష్టకరమన్నారు. అమరావతి పేరిట చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి… మూడు రాజధానులని, ఒక్కటి కూడా లేకుండా చేశారన్నారు. గడిచిన పదేళ్ళలో రాష్ట్రానికి ఒక్క భారీ పరిశ్రమ కూడా రాలేదన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా దక్కకపోవడానికి చంద్రబాబు, జగనే కారణమన్న షర్మిల, సొంతలాభం కోసం ఇద్దరూ ప్రజాప్రయోజనాలను తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ దొందూ దొందే అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు వేయడానికి కూడా డబ్బులు లేవని విమర్శించిన షర్మిల, కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తిందని దుయ్యబట్టారు.