అయోధ్యలో
బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రామాయణంతో
సంబంధమున్న పుణ్యక్షేత్రాలను దర్శించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ధునష్కోడిలోని
అరిచల్ మునై పాయింట్ ను సందర్శించారు. అనంతరం కోదండ రాముడిని దర్శించుకుని రామసేతు
తీరంలో ప్రాణాయామం చేశారు.
వానరసేనతో
కలిసి లంకను చేరేందుకు ధునుష్కోడిలో రాళ్ళతో వంతెన నిర్మించినట్లు రామాయణం ద్వారా
తెలుస్తోంది. దీనినే రామసేతుగా పిలుస్తున్నారు. సదరు సేతు ఆనవాళ్ళు ఇప్పటికీ
సముద్రంలో కనిపిస్తున్నాయి.
శ్రీరంగంలో
రంగనాథ స్వామిని నిన్న దర్శించుకున్న ప్రధాని మోదీ, అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఆపై రామేశ్వరం వెళ్ళి
పవిత్రతీర్థాల్లో పుణ్యస్నానం చేశారు. అనంతరం శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామేశ్వరలింగానికి
పూజలు చేశారు.
ఇంతకుముందు
మహారాష్ట్ర నాసిక్‌లోని రామ్‌కుండ్ కాలారామ్ దేవాలయం, ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి వీరభద్ర
ఆలయం, కేరళ గురువాయుర్ ఆలయం, త్రిప్రయార్ రామస్వామి దేవాలయాలను
మోదీ సందర్శించారు. జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాని
మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.