Investigation should be done on who revealed the pics of
Ram Lalla
నూతన మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కంటె
ముందు మూలవిరాట్టు నేత్రోన్మీలనం చేయకూడదని శ్రీరామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి
ఆచార్య సత్యేంద్రదాస్ స్పష్టం చేసారు.
అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న భవ్యరామమందిరంలో
బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగనున్న సంగతి తెలిసిందే.
కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన బాలరాముడి మూలవిరాట్టును
గర్భగృహంలోకి ఇప్పటికే చేర్చారు. అంతకుముందే మూలవిరాట్టు నేత్రాలను వేష్టబంధనం
చేసారు.
గురువారం నాడు జరిగిన ఆ కార్యక్రమం తర్వాత కనులు
కప్పి ఉంచిన బాలరాముడి మూలవిరాట్టు మూర్తి చిత్రాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే,
శుక్రవారం నాడు పూర్తి మూలవిరాట్టు ఫొటోలు సైతం బహిర్గతమయ్యాయి. ఆ విషయమై ఆచార్య
సత్యేంద్రదాస్ అసంతృప్తి వ్యక్తం చేసారు.
‘‘ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తవకముందు
శ్రీరామచంద్రమూర్తి నేత్రాలను బహిర్గతం చేయకూడదు. అలా కనిపించిన విగ్రహం నిజమైన
మూలవిరాట్టు కాబోదు. ఒకవేళ ఆయన నేత్రాలే బహిర్గతమైతే, అలా చేసినది ఎవరు, ఆ ఫొటోలు
ఎలా వైరల్ అయ్యాయి అన్న విషయాలపై దర్యాప్తు జరగాలి’’ అని సత్యేంద్రదాస్
అభిప్రాయపడ్డారు. ‘‘పద్ధతులన్నీ మామూలుగానే కొనసాగుతాయి. అయితే ప్రాణప్రతిష్ఠ
పూర్తయేవరకూ రామ్‌లల్లా నేత్రోన్మీలనం జరగదు’’ అని ఆయన స్పష్టం చేసారు.
ఇన్నాళ్ళూ టెంట్‌లో ఉంచి పూజలు చేసిన బాలరాముడి
విగ్రహాన్ని ఆలయంలో ప్రవేశపెట్టడం గురించి కూడా సత్యేంద్రదాస్ వివరణ ఇచ్చారు. ‘‘ఆ
మూర్తిని కూడా కొత్త విగ్రహంతో పాటే గర్భగృహంలో ఉంచుతాము. దానికి నిర్దిష్టమైన
ముహూర్తమేమీ లేదు. కొత్త విగ్రహాన్ని పెట్టేటప్పుడు మాత్రమే ముహూర్తం చూస్తాము’’
అని వివరించారు. ‘‘ప్రశ్నల్లా, ఆ విగ్రహాన్ని ఆలయంలోకి ఎవరు తీసుకొస్తారు అన్నదే.
గతంలో అప్పటి ముఖ్యమంత్రి టెంట్ నుంచి తాత్కాలిక ఆలయంలోకి తీసుకువచ్చి పెట్టారు.
ఈసారి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ పని చేసే అవకాశముంది’’ అని చెప్పారు.
1949లో బాలరాముడి మూర్తి
వివాదాస్పద కట్టడం లోపల ప్రత్యక్షమైంది. దానికే హిందువులు పూజలు చేసుకుంటూ
ఉండేవారు. 1992లో వివాదాస్పద కట్టడాన్ని కరసేవకులు కూల్చివేసినప్పుడు ఆ మూర్తిని
ఒక టెంట్‌లో ఉంచి అక్కడే పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ మూర్తిని కూడా గర్భగృహంలో
ఉంచుతామని సత్యేంద్రదాస్ స్పష్టతనిచ్చారు.