PM Modi listens to ‘Kamba Ramayanam’ in Srirangam Temple
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ తమిళనాడులోని
తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలో పర్యటించారు. అక్కడి ప్రఖ్యాత రంగనాథస్వామి
ఆలయాన్ని సందర్శించారు. ప్రముఖ తమిళ కవి కంబర్ రచించిన కంబరామాయణంలోని శ్లోకాలను
విన్నారు.
నరేంద్రమోదీ శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో తమిళ
సంప్రదాయిక దుస్తులు వేష్ఠి, అంగవస్త్రం ధరించి దైవదర్శనం చేసుకుని పూజలు చేసారు.
ఆలయం ఆవరణలో ‘ఆండాళ్’ అనే పేరున్న ఏనుగు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.
ప్రముఖ తమిళ కవి కంబర్ ఈ ఆలయంలోని మంటపంలోనే
కూర్చుని తమిళ రామాయణాన్ని రచించి ఆలపించారు. అది కంబ రామాయణంగా ప్రఖ్యాతి
గడించింది. ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ అదే మంటపంలో కూర్చుని స్థానిక పండితుడు ఒకరు
కంబ రామాయణం నుంచి పారాయణ చేసిన కొన్ని భాగాలను విన్నారు. తమిళనాడుకు, తమిళానికి,
శ్రీరాముడికీ గాఢమైన సంబంధం ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు.
శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం చారిత్రకంగా
ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఇక్కడి రంగనాథస్వామి మూలమూర్తిని బ్రహ్మదేవుడు శ్రీరాముడి
పూర్వీకులకు ఇచ్చారనీ… శ్రీరాముడు, ఆయన పూర్వీకులూ ఆ రంగనాథస్వామిని అర్చించారనీ
స్థానిక ఐతిహ్యం. రాముడు ఆ మూర్తిని విభీషణుడికి కానుకగా ఇచ్చాడనీ, దాన్ని
విభీషణుడు లంకకు తీసుకువెడుతుండగా దారిలో శ్రీరంగంలో స్థిరపడిపోయిందనీ చెబుతారు.
శ్రీరంగంలోని దేవాలయాన్ని
దర్శించుకున్న మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్రమోదీయేనని ఆలయ ప్రధాన అర్చకులు
సుందర భట్టర్ హర్షం వ్యక్తం చేసారు. శ్రీరంగం నుంచి ప్రధానమంత్రి రామేశ్వరం
వెడతారు. అక్కడ అరుళ్మిగు రామనాథస్వామిని దర్శించుకుంటారు. రామేశ్వరం నాలుగు
పుణ్యధామాల్లో, పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటిగా ప్రశస్తి గాంచింది.