Soil erosion to cause massive destruction
యుగాంతం గురించి పలు మతగ్రంథాలు పలురకాలుగా
సూచనలు చేస్తే భవిష్యత్తును దర్శించిన కొందరు వివిధ రకాలుగా వివరించారు. అందులో
ముఖ్యంగా మన భారతదేశం నుండి పోతులూరి వీరబ్రహ్మంగారు, మహాపురుష అచ్యుతానంద దాస
లాంటి వారు, అలాగే విదేశాలలో నోస్ట్రడామస్, బాబా వాంగా
లాంటి వారు వివిధ రకాలుగా తమ భవిష్యవాణిని వినిపించిన వారే.
వీరి వాణిలో నిజనిజాలు ఎలా ఉన్నా, ప్రస్తుత పరిస్థితులను
శాస్త్రీయ దృక్కోణంలో గమనిస్తే మానవులు వినాశనం వైపే పయనిస్తున్నారని స్పష్టం అవుతోంది.
కారణం ఒకప్పుడు మనిషి జీవన విధానం ముఖ్యంగా భారతదేశంలో జీవన విధానం, అహారపు
అలవాట్లు, సంస్కృతీసంప్రదాయాలు
అన్నీ ప్రకృతితో ముడిపడి ఉండేవి, ఉన్నాయి కూడా. ప్రకృతి మార్పులకు అనుగుణంగా
ఇక్కడి జీవన విధానం, ఆహార విషయాలు మలుచుకునేవారు.
కాని నేటి రోజున మనుషులు అభివృద్ధి పేరుతో
వ్యాపారం లాభార్జన కోసం ఆధునిక జీవనవిధానం పేరుతో ప్రకృతి విరుద్ధమైన జీవన
విధానానికి అలవాటు పడిపొయారు. ముఖ్యంగా ఆహార విషయాల్లో ఈ మార్పు చాలా స్పష్టంగా
ఉంది. అధిక దిగుబడి పేరుతో చేసిన ప్రయోగాలతో, పంటల
భూములపై వాటి ఫలితాలు, పంట నాణ్యత వాటి సాగు విధానం, దాని
ఫలితాలు సమాజం పై, ప్రజల ఆరోగ్యం పై ఎన్ని దుష్ఫలితాలు చూపిస్తున్నాయో
చూస్తూనే ఉన్నాం.
ఈ క్రమంలో అతి ముఖ్యమైనది సాగు భూమి వినాశనం. ప్రస్తుతం
సాగుభూమి ఎలా దెబ్బతింటోందో, భవిష్యత్తులో అవి ఏ రూపానికి మారబోతున్నాయో గ్రహించేవారు
చాల తక్కువగానే ఉన్నారు.
నేటి ప్రపంచంలో క్లైమేట్ చేంజ్ అనగా వాతావరణ
మార్పులు, భూతాపం, నీటి కొరత, కార్బన్
ఎమిషన్లు (కర్బన ఉద్గారాలు), వాయు కాలుష్యం లాంటివి వాటినే చూస్తున్నారు కానీ, పొంచి
ఉన్న పెను ప్రమాదాన్ని చూడలేక పోతున్నారు.
అదే “మట్టి”, దాని సేంద్రియత.
అస్సలు ప్రపంచం మొత్తానికి కావలసిన ఆహార ఉత్పత్తి,
90% పైనే కేవలం మట్టి నుంచే వస్తోంది. అలాంటి మట్టి ఉండే సాగు గుణం రకరకాల క్రిమి సంహారక మందుల వాడకం వల్ల క్షీణిస్తోంది. దాన్ని నిర్లక్ష్యం
చేస్తే ఏ ప్రపంచ యుద్ధాలూ జరగకుండానే, మానవాళి అధిక
సంఖ్యలో ప్రాణాలు కోల్పోతారు.
నాణ్యతా ప్రమాణాలు లేని ఆహారం ఎంత
ఉత్పత్తి చేసినా ఏం లాభం. 1970లో పండించిన ఒక్క పండులో ఉండే పోషకాలు, నేడు పండించే 10 పండ్లలోనైనా లభించని పరిస్థితి. దీన్నిబట్టే నేటి
పంట సాగు ఎంత నాణ్యంగా ఉంటోందో అర్ధం చేసుకోవచ్చు.
ప్రపంచం మొత్తం మీద సాగుభూమి 52% పడిపోయింది.
దీనికి కారణాలు అనేకం. అన్నింటిలో చాలా ముఖ్యమైన కారణం అధిక
దిగుబడి కోసం అవలంబిస్తున్న వ్యవసాయ పద్ధతులు.
పరిస్థితి ఇదేరకంగా కొనసాగితే, చాలా కొద్ది సంవత్సరాలలో సారవంతమైన సాగు భూమి శాతం 35%-30% కి పడిపోతుంది.
ఫలితంగా రానున్న రోజుల్లో ప్రపంచ జనాభా తీవ్రమైన ఆహార కొరతని చవిచూడాల్సి
వస్తుంది.
నిజానికి మంచి పౌష్టికమైన పంట పండాలంటే
సాగు భూమి పైన 15 అంగుళాల మేర ఉండే మట్టి చాలా కీలకమైనది. ప్రపంచంలోని 85% ఆహార ఉత్పత్తికి కారణం అదే. అలాంటి అతి ముఖ్యమైన,
సారవంతమైన పంట భూమి నాణ్యత ప్రమాదకర స్థాయిలో
దెబ్బ తింటోంది. తగు జాగ్రత్తలు తీసుకోకపొతే దీని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.
ఒక్క పంట పండాలంటే సాగుభూమి భూసారం 6%
ఉండాలి. కనీసం 3% అయినా ఉండాలి. ఈ 3% – 6% సారంలో ఉండే రకరకాల సూక్ష్మజీవులే ఆరోగ్యకరమైన
ఆహార ఉత్పత్తికి కారణం. కాని నేడు ఉత్పత్తి అవుతున్న పంటల నాణ్యత చూస్తే కనీసం
ఉండవలసిన 3% కంటే ఇంకా తక్కువ స్థాయిలోనే ఉంటోంది.
ఒక్కపుడు పండ్ల నాణ్యతతో పోలిస్తే,
నేటి పండ్ల నాణ్యత చాలా తక్కువ. 70వ దశకంలోని ఏదైనా
ఒక్క పండులో ఉండే పొషకాలతో పొలిస్తే, నేడు పండుతున్న
పండ్లలో ఏమాత్రం నాణ్యత లేదు. అప్పటి ఒక్క పండులో ఉండే పొషకాలు నేటి 10 పండ్లుతో
కూడా రావు. ఫలితంగా జనాల అరోగ్యం క్షీణించి, రోగాలపాలవుతారు.కనుక రేపటి తరాలనుదృష్టిలో ఉంచుకుని ప్రపంచ దేశాలు నిబద్ధతతో
తగు చర్యలు తీసుకొవాలి. క్రమంగా రసాయన ఎరువుల వాడకం తగ్గించుకుంటూక్రమంగా సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచుకోవాలి.
ప్రభుత్వాలైనా, వ్యాపారులైనా గుర్తుంచుకోవలసింది ఏంటంటే సామాన్య జనాలు ఆరోగ్యంతో బ్రతికి ఉంటేనే వాటి అస్తిత్వం ఉంటుంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే
మనుషులోయ్ అని ఒక మహాకవి అన్నాడు. కానీ ఎన్ని కోట్ల జనాభా ఉన్నా, పంటకు పనికిరాని
మట్టి గల భూమి ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నా ఏం లాభం, ఎడారితో సమానం అంతే. రక
రకాల క్రిమి సంహారక మందుల వాడకం వల్ల భూసారం క్షీణిస్తోంది. దాన్ని నిర్లక్ష్యం
చేస్తే,
ప్రపంచయుద్ధాలు జరగకుండానే
యుగాంతమే. తస్మాత్ జాగ్రత్త.