AP CM YS Jagan inaugurated Ambedkar Statue
అంటరానితనంపై తిరుగుబాటు, విప్లవం,
స్వాతంత్య్ర పోరాటాల ప్రతిరూపమే అంబేడ్కర్ అని ముఖ్యమంత్రి వైఎస్
జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 77 ఏళ్ల
తర్వాత కూడా అంటరానితనం, వివక్ష రూపం మార్చుకుని సంచరిస్తున్నాయన్నారు.
విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేడ్కర్ 206
అడుగుల ఎత్తైన ‘సామాజిక న్యాయ మహాశిల్పం’ విగ్రహాన్ని సీఎం జగన్ శుక్రవారం
రాత్రి జాతికి అంకితం చేశారు. అంతకు ముందు ఇందిరాగాంధీ
మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘సామాజిక సమతా సంకల్ప
సభ’లో మాట్లాడుతూ కుల అహంకార వ్యవస్థల దుర్మార్గాలపై తన పోరాటానికి అంబేడ్కరే
స్ఫూర్తి అని తెలిపారు. అంబేడ్కర్ జన్మించిన 133 ఏళ్ల
తర్వాత, ఆయన మరణించిన 68 ఏళ్ల
తర్వాత సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఏర్పాటు చేసుకున్నామని జగన్ చెప్పారు. విజయవాడలోస్వాతంత్య్ర సమర చరిత్ర కలిగిన మన స్వరాజ్య
మైదానంలో, 75వ రిపబ్లిక్ డేకి సరిగ్గా వారం ముందు ఆవిష్కరించిన
అంబేడ్కర్ విగ్రహం స్ఫూర్తిదాయకమని జగన్ వ్యాఖ్యానించారు. రూపం మార్చుకున్న
అంటరానితనంపై 56 నెలలుగా తమ ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి
నిదర్శనం సామాజిక న్యాయ విగ్రహమని జగన్ చెప్పుకొచ్చారు. అంబేడ్కర్ ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నారంటూ, తమ
సర్కారు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడాన్ని జగన్
సమర్థించుకున్నారు.
చంద్రబాబునాయుడును, తెలుగుదేశం
పార్టీని పెత్తందారీ నాయకుడు, పార్టీ అంటూ జగన్ దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం ఎస్సీ
ఎస్టీ బీసీ మైనారిటీలను అందలాలు ఎక్కించిందని చెప్పుకున్నారు. రాష్ట్రంలో కుప్పం
నుంచి ఇచ్చాపురం వరకు అన్ని గ్రామాల్లోనూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ
ఫలాలు కనిపిస్తాయని జగన్ చెప్పుకున్నారు.