The look of Ram Lalla unveiled
యావద్భారతదేశం ఎప్పుడెప్పుడు చూద్దామా
అని ఎదురుచూస్తున్న బాలరాముడి మూర్తి ఇవాళ బహిర్గతమైంది. స్వర్ణ ధనుర్బాణాలు
ధరించిన శ్రీరామచంద్రుడి చిత్రం చూపరులకు కనువిందు చేస్తోంది.
ఐదు శతాబ్దాల క్రిందట మొగలాయి ముష్కరుల
దాడితో జన్మస్థానాన్ని కోల్పోయిన శ్రీరామచంద్రప్రభువు ఇన్నాళ్ళకు ఇన్నేళ్ళకు
భవ్యమందిరంలో సువర్ణ కోదండపాణిగా అవతరిస్తున్నాడు. ఆ ఐదేళ్ళ పసిబాలుడి రూపం ఎలా ఉంటుందో
అన్న ఉత్కంఠకు తెర పడింది. అయోధ్య రామయ్య అవతారమూర్తి ఆవిష్కృతమైంది.
కర్ణాటక మైసూరుకు చెందిన కళాకారుడు అరుణ్
యోగిరాజ్ నల్లరాతిలో చెక్కిన 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని గురువారం అయోధ్యలో
నిర్మితమవుతున్న నూతన రామమందిరం గర్భగృహంలోకి ప్రవేశపెట్టారు. మొదటగా మూర్తిని కప్పి
ఉంచిన ఫొటోలు విడుదల చేసారు.
శుక్రవారం, అంటే ఈరోజు ఉదయం రామయ్య కనులు
తప్ప మిగతా మూర్తి అంతా కనబడే చిత్రాలు బైటపెట్టారు. మరికాసేపటికి పూర్తి మూర్తి
ఫొటోలు బైటకు వచ్చాయి. అయితే గర్భగృహంలోకి చేర్చిన మూర్తికి మాత్రం ప్రాణప్రతిష్ఠ
చేసేవరకూ పూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించరు. ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాతనే నేత్రోన్మీలనం
జరుగుతుంది. అప్పుడే రామయ్య విగ్రహం ప్రజలకు కనులవిందు చేస్తుంది.
‘‘ఇవాళ వైదిక పండితులు అగ్నిప్రజ్వలన
చేసి హోమం నిర్వహించారు. సమస్త దేవతలకూ హవిస్సులు సమర్పించారు. ఈ హోమంతో వైదిక
ప్రక్రియలు వేగం పుంజుకుంటాయి. ఇక ఇప్పటికే బాలరాముడి మూర్తి గర్భగృహంలోకి
చేరుకుంది. ఆ మూర్తి నేత్రాలను వేష్ఠనంతో బంధిస్తారు. ప్రాణప్రతిష్ఠ రోజు అంటే
జనవరి 22న భగవాన్ రామచంద్రుణ్ణి మూర్తిలోకి
ఆవాహన చేసాక ఆ వేష్ఠనాన్ని తొలగిస్తారు. దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఒక బంగారు
శలాకకు తేనె పూస్తారు. ఆ శలాకతో ప్రతిమ నేత్రాలకు మధువుతో అభిషేకం చేస్తారు.
అనంతరం నేత్రబంధనవేష్ఠాన్ని తొలగిస్తారు. దాన్నే నేత్రోన్మీలనం అంటారు. ఆ లాంఛనం
పూర్తయాక స్వామి భక్తజనులకు నేత్రానందం కలుగజేస్తారు’’ అని శ్రీరామజన్మభూమి
తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడైన స్వామి గోవింద్ దేవ్ గిరి వివరించారు.
అయితే ఇప్పటికే బాలరాముడి
రూపం ఎలా ఉంటుందో చూపించే చిత్రాలు బైటకు వచ్చేసాయి. నీలమేఘశ్యాముడు,
కమలదళాయతాక్షుడు, సువర్ణ కోదండ ధనుర్బాణపాణి అయిన బాలరాముడు ఇంక మూడు రోజుల్లో
పరిపూర్ణ అవతారంగా ఆవిష్కృతమవుతాడు.