Consecration Ceremony Day Four: No entry for general public from today
అయోధ్యలో నిర్మితమవుతున్న మందిరంలో జనవరి
22న జరగబోయే బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ముందస్తు కార్యక్రమాలు ఊపందుకున్నాయి. వారం
రోజుల కార్యక్రమాల్లో ఇవాళ నాలుగవరోజు నవగ్రహాల స్థాపన, హోమం జరిగాయి.
ఈ ఉదయం 9 గంటలకు అగ్నిప్రజ్వలనంతో వైదిక
కార్యక్రమాలు మొదలయ్యాయి. నిన్న గర్భగృహంలో ప్రవేశించిన బాలరాముడి మూర్తికి ఇవాళ ఔషధాధివాసం,
కేసరాధివాసం, ఘృతాధివాసం, పుష్పాధివాసం కార్యక్రమాలు జరుగుతాయి. అంటే వరుసగా ఆయుర్వేద
ఔషధాలు, కుంకుమపువ్వు, ఆవునెయ్యి, ఇంక చివరిగా పూలలో బాలరాముడి మూర్తిని
ప్రవేశపెడతారు. అవన్నీ పూర్తయిన తర్వాత
చివరిగా ఆ విగ్రహాన్ని నవధాన్యాల్లో ఉంచుతారు.
ఇవాళ్టి నుంచి సాధారణ ప్రజానీకానికి ఆలయంలోకి
ప్రవేశం ఉండదు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత జనవరి 23
నుంచి సాధారణ భక్తులకు మందిరంలోకి వెళ్ళే అవకాశం మొదలవుతుంది.
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దగ్గర పడుతుండడంతో
అయోధ్య కరసేవకపురంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు. ‘రామనగరి’ పేరుతో అయోధ్య అంతటా
బాలరాముడి పోస్టర్లు వెలిసాయి. పలు ప్రదేశాల్లో సెల్ఫీపాయింట్లు ఏర్పాటయ్యాయి.
రామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ
సందర్భాన్ని పురస్కరించుకుని అయోధ్యా నగరంలో ‘అమృత మహోత్సవాలు’ జరుగుతున్నాయి. అందులో
భాగంగా, నగరానికి వచ్చే భక్తుల కోసం విశ్వహిందూపరిషత్ పలుచోట్ల టీస్టాళ్ళు ఏర్పాటు
చేసింది. అక్కడ భక్తులకు ఉచితంగా టీ, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు.
గురువారం మందిరంలోకి
ప్రవేశించిన బాలరాముడి మూర్తి అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ విగ్రహాన్ని కర్ణాటకకు
చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కారు. 51 అంగుళాల పొడవున్న ఆ విగ్రహం బరువు 1.5టన్నులు.
వికసిత కమలపుష్పంలో ఐదేళ్ళ బాలరాముడు నిలుచుని ఉన్నట్లుగా ఆ విగ్రహాన్ని
రూపొందించారు.