Bilkis Bano
case
బిల్కిస్‌బానో
కేసులో దోషులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లొంగిపోయేందుకు సమయం
కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. వాటికి
విచారణార్హత లేదని, ఆదివారం నాటికి వారంతా జైలు అధికారుల
ముందు లొంగిపోవాల్సిందేనని మరోసారి స్పష్టం చేసింది.
2002లో గోధ్రా రైలు దహనకాండ ఘటన తర్వాత
గుజరాత్లో అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో
బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు
హత్య చేశారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ
కేసులో దోషులుగా తేలిన 11 మంది 15 ఏళ్ళుగా జైలు జీవితం గడిపారు. వీరికి 2022లో గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ మంజూరు
చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు.
గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ
దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం.. వారి విడుదల చెల్లదని జనవరి 8న తీర్పు చెప్పింది. రెండు వారాల్లోగా
జైలు అధికారుల వద్ద లొంగిపోవాలని ఆదేశించింది.
తమకు
కొన్ని కుటుంబ బాధ్యతలున్నాయని, లొంగిపోయేందుకు
మరింత సమయం ఇవ్వాలంటూ వారు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు
తోసిపుచ్చింది.