నోటుకు ప్రశ్న కేసులో లోక్సభ నుంచి బహిష్కరణకు గురైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఎట్టకేలకు ప్రభుత్వం కేటాయించిన బంగ్లా ఖాళీ చేశారు. ఎంపీలకు ఢిల్లీలో అధికారిక బంగ్లాలు కేటాయిస్తూ ఉంటారు. అలా కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయడానికి టీఎంసీ బహిషృత ఎంపీ మహువా నిరాకరించడంతో అధికారులు ఆమె నివాసానికి చేరుకున్నారు. బంగ్లా ఖాళీ చేయాలంటూ అధికారులు ఇచ్చిన నోటీసుపై మహువా హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఇవాళ డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆమె బంగ్లాను ఖాళీ చేసినట్లు మహువా తరపు న్యాయవాది అధికారులకు తెలిపారు.
నోటుకు ప్రశ్న కేసులో డిసెంబరు 8న మహువా (mahua moitra) లోక్సభ సభ్యత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 7లోగా ఆమెకు కేటాయించిన బంగ్లా ఖాళీ చేయాల్సి ఉంది. అందుకు అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై ఆమె హైకోర్టులో సవాల్ చేసింది. స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె బంగ్లాను ఖాళీ చేశారు.