ఎస్సీ
వర్గీకరణకు సంబంధించి కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేబినెట్ కార్యదర్శి
రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కేంద్రప్రభుత్వం కమిటీని వేసింది. హోం,
న్యాయ, గిరిజన, సామాజిక న్యాయశాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ
జనవరి 23న సమావేశమై ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చర్చించనుంది.
తెలంగాణ
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం భాగంగా ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో పాల్గొన్న ప్రధాని
మోదీ, ఎస్సీ వర్గీకరణ పై కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని హామీ మేరకు కేంద్రం కమిటీని
నియమించింది. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ
ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు కూడా అంగీకారం తెలిపింది.
ఎస్సీ
కేటగిరిలో ఉన్న తమకు రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతుందని జనాభాకు తగ్గట్టుగా న్యాయం
జరగడంలేదంటున్న మాదిగలు, ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. ఇందులో భాగంగా ఎస్సీ
వర్గీకరణకు అనుకూలమని ప్రకటించిన బీజేపీకి మాదిగలు మద్దతు తెలుపుతున్నారు.
మాదిగలంతా
బీజేపీకి ఓటు వేయాలని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట
సమితి వ్యవస్థాపకుడు మందా కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.