Annapoorani film controversy: Nayanthara opens up, issues apology
హిందూ విశ్వాసాలను అపహాస్యం పాలుచేస్తూ,
బ్రాహ్మణ సంప్రదాయాలను అవమానిస్తూ, ఫుడ్ జిహాద్–లవ్ జిహాద్ లను ప్రోత్సహిస్తూ తీసిన
అన్నపూరణి సినిమా విషయంలో వివాదం మొదలైన తర్వాత మొట్టమొదటి సారి ఆ సినిమా బృందం
నుంచి ఒకరు స్పందించారు. ఆ సినిమాలో కథానాయికగా నటించిన నయనతార తన ఇన్‌స్టాగ్రామ్
హ్యాండిల్ ద్వారా క్షమాపణలు చెప్పారు.
అన్నపూరణి సినిమా తమిళంలో విడుదలైనా
పెద్దగా ఆడలేదు. అయితే ఓటీటీలో అన్నిభాషల్లోనూ విడుదల చేసిన తర్వాత చిత్రంపై
వివాదం తలెత్తింది. దానితో సినిమా మీద కేసులు నమోదయ్యాయి. ఓటీటీలోనుంచి
తొలగించకపోతే తగు చర్యలు తీసుకుంటామంటూ విశ్వహిందూపరిషత్ జీటీవీ యాజమాన్యానికి లేఖ
రాసింది. ఆ నేపథ్యంలో జీటీవీ యాజమాన్యం పది రోజుల క్రితం ఓటీటీ నుంచి తొలగించింది.
హిందువుల మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదంటూ క్షమాపణలు చెప్పింది. అప్పటికీ
చిత్రబృందం స్పందించలేదు. పైగా తమిళచిత్రసీమకు చెందిన హిందూవ్యతిరేక భావజాలం
కలిగిన కొంతమంది, సినిమాలోని కంటెంట్‌ను సమర్థిస్తూ ప్రకటనలు చేసారు. ఈ నేపథ్యంలో
నిన్న గురువారం నయనతార ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
నయనతార తన పోస్ట్‌ను ‘జై శ్రీరామ్’ అంటూ
ప్రారంభించింది. ‘‘మా సినిమా అన్నపూరణి గురించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల విషయంలో
స్పష్టత ఇద్దామనే స్వచ్ఛమైన ఉద్దేశంతో బరువెక్కిన హృదయంతో ఈ లేఖ రాస్తున్నాను. ‘అన్నపూరణి’
రూపకల్పన కేవలం ఒక సినిమా రూపొందించే
ప్రయత్నం మాత్రమే కాదు. ఏ విషయంలోనూ ఎప్పుడూ వెనుకడుగు వేయకూడదు అన్న స్ఫూర్తిని
కలిగించడానికిహృదయపూర్వకంగా చేసిన ప్రయత్నమే ఆ సినిమా. జీవన ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులను
మనోధైర్యంతో ఎదుర్కోవచ్చు అన్న విషయాన్ని ప్రతిఫలించడమే మా సినిమా లక్ష్యం’’ అంటూ
రాసుకొచ్చింది.
‘‘ఒక సానుకూల సందేశాన్ని అందించడానికి మేం
నిజాయితీగా ప్రయత్నించాం. ఆ క్రమంలో ఏమరుపాటు వల్ల కొందరి మనోభావాలను దెబ్బతీసి
ఉండవచ్చు. సెన్సార్ అయి, థియేటర్లలో కూడా ప్రదర్శించిన చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్
నుంచి తొలగిస్తారని మేము ఊహించలేదు. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలన్న ఉద్దేశం నాకు
గానీ, మా బృందానికి గానీ లేదు. ఈ అంశం తీవ్రత మాకు అర్ధమయింది. నాకు దైవంపై
పరిపూర్ణ విశ్వాసం ఉంది. నేను తరచుగా దేశంలోని దేవాలయాలను సందర్శిస్తుంటాను.
అలాంటి నేను ఉద్దేశపూర్వకంగా ఒకరిని కించపరచాలని ఎట్టి పరిస్థితుల్లోనూ భావించను.
మా సినిమా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వారికి నిజాయితీగా, హృదయపూర్వకంగా
క్షమాపణలు చెబుతున్నాను’’ అని నయనతార తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది.
‘‘అన్నపూరణి సినిమా తీయడం ద్వారా ఒక
స్ఫూర్తిని కలిగించాలి అనుకున్నాం తప్ప ఎవరినీ బాధించాలి అని మా ఉద్దేశం కాదు. రెండు
దశాబ్దాల నా సినీ ప్రస్థానం వెనుక ఒకే ఒక ఉద్దేశం ఉంది, అది సమాజంలో సానుకూల
దృక్పథాన్ని పెంచడం, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోడాన్ని ప్రోత్సహించడమే’’ అని నయనతార
వివరించింది.
అన్నపూరణి తమిళ చిత్రం డిసెంబర్ 1న
థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో వివిధ భాషల్లో
స్ట్రీమ్ అయింది. ఆ సినిమాపై వివాదాలు రేగడం, పోలీస్ కేసులు నమోదవడంతో ఓటీటీ
ప్లాట్‌ఫాం నుంచి తొలగించారు.
నయనతార జన్మతః
క్రైస్తవురాలు అయినప్పటికీ తర్వాత హిందూమతంలోకి మారింది. శ్రీరామరాజ్యం సినిమాలో
సీతగా నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. అయితే హిందూ వ్యతిరేక భావజాలం
ఉన్న సినిమాల్లో నటించడం ఆమెకు కొత్త కాదు. 2020 నవంబర్ 20న దీపావళి పండుగ రోజు
విడుదలైన మూకుత్తి అమ్మన్ (తెలుగులో అమ్మోరు తల్లి) సినిమాలో నయనతార అమ్మవారిగా
నటించింది. ఆ సినిమాలో కూడా హేతువాదం మాటున, నకిలీ బాబాల చాటున, హిందువుల ఆచార
వ్యవహారాలను అవహేళన చేసే సన్నివేశాలు చాలానే ఉన్నాయి.