భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతోన్న వేళ ఇరు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తరవాత ఆయన పోస్ట్ చేసిన వీడియోలపై మాల్దీవుల మంత్రులు (bharat maldevies talks ) చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. గడచిన రెండు వారాలుగా ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది.
తాజాగా ఉగాండా రాజధాని కంపాలాలో అలీనోద్యమ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, మాల్దీవుల మంత్రి మూసా జమీర్ మధ్య చర్చలు జరిగాయి. రెండు దేశాల దౌత్యసంబంధాలపై లోతైన చర్చ జరిగినట్లు జైశంకర్ మీడియాకు వెల్లడించారు. మాల్దీవుల్లో భారత సైన్యాన్ని ఉపసంహరించుకునే విషయంలోనూ లోతైన చర్చ సాగింది. మాల్దీవుల్లో అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలోనూ చర్చలు సాగాయి. ఇరు దేశాల మధ్య సహకారం పెంపొందించుకోవడానికి కట్టుబడి ఉంటామని మాల్దీవుల మంత్రి ప్రకటించారు.