Congress not willing to
answer why it signed MoUs with Adani in Telangana
తెల్లారి లేస్తే కాంగ్రెస్‌ది ఒకటే
పాట… వ్యాపారవేత్త అదానీకి బీజేపీ అనుచిత లబ్ది చేకూరుస్తోందంటూ ఏడుపు. అలాంటిది
ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అదే అదానీ గ్రూప్‌తో 12వేలకోట్ల
రూపాయల విలువైన ఒప్పందాలు కుదుర్చుకుంది. దానిగురించి అడిగితే మాత్రం నోరు విప్పడం
లేదు.
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్
ఫోరం వేదికపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదానీ
గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుని, ఆ మేరకు ఒప్పంద
పత్రాలపై సంతకాలు కూడా చేసారు. ఆ విషయమై మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం కాంగ్రెస్
నాయకత్వం జవాబు దాటవేసింది.
తెలంగాణ ప్రభుత్వం అదానీ గ్రూప్‌తో ఎంఓయూలు
ఎందుకు కుదుర్చుకుంది అని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరాన్ని ఒక విలేకరి
ప్రశ్నించారు. దానికి జవాబు చెప్పకుండా చిదంబరం తమ పార్టీ అధికార ప్రతినిధి
సుప్రియా శ్రీనాతేకు మైక్ ఇచ్చేసారు. ఆమె సైతం జవాబివ్వడానికి నిరాకరించారు. ఆ
మీడియా సమావేశం ఎన్నికల మ్యానిఫెస్టో గురించి మాత్రమేననీ, దానికి సంబంధించిన
ప్రశ్నలు మాత్రమే అడగాలనీ చెప్పుకొచ్చారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రేవంత్
రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో
జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్‌రెడ్డి బృందం కూడా పాల్గొంటోంది. ఆ
ప్రభుత్వం జనవరి 17న అదానీ గ్రూప్‌తో నాలుగు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది.
వాటి విలువ రూ. 12,400 కోట్లు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదానీ గ్రూప్
చైర్మన్ గౌతమ్ అదానీ సమక్షంలో అవగాహనా ఒప్పందాల మీద సంతకాలు జరిగాయి.
తెలంగాణలో 100 మెగావాట్ల సామర్థ్యంతో రాబోయే 5-7
ఏళ్ళలో రూ.5000 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌తో మొదటి
ఒప్పందం కుదిరింది.
కోయబెస్తగూడెం దగ్గర 850 మెగావాట్ల
సామర్థ్యంతోనూ, నాచారం దగ్గర 500 మెగావాట్ల సామర్థ్యంతోనూ రెండు పంప్ స్టోరేజ్
ప్రాజెక్టులు రూ.5000 కోట్లతో నిర్మించడానికి రెండో ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఏడాదికి 60లక్షల టన్నుల ఉత్పత్తి
సామర్థ్యం కలిగిన సిమెంట్ ప్లాంట్‌ను రూ.1400 కోట్ల పెట్టుబడితో ఐదేళ్ళ వ్యవధిలో నిర్మించడానికి
అంబుజా సిమెంట్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
కౌంటర్ డ్రోన్ అండ్ మిసైల్ సిస్టమ్స్ రంగంలో
పరిశోధన, అభివృద్ధి, డిజైనింగ్, ఉత్పత్తి, సమీకరణ సామర్థ్యంతో సమగ్ర వ్యవస్థను
రూపొందించడానికి సుమారు వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టడానికి అదానీ డిఫెన్స్
సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
కుదుర్చుకుంది.
గౌతమ్ అదానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ,
హోంమంత్రి అమిత్‌షాలతో ఉన్న సాన్నిహిత్యం వల్లనూ…. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలతో
క్విడ్-ప్రో-కో ఒప్పందాలు ఉన్నందువల్లనే… గౌతమ్ అదానీ ఆస్తులు, సంపదలు గత
పదేళ్ళలో గణనీయంగా పెరిగిపోయాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తూ
ఉంటారు. అంతేకాదు, అదానీ గ్రూప్‌కి అనుచిత లబ్ధి చేకూర్చడానికి చట్టవిరుద్ధమైన
పనులకు కూడా పాల్పడతారంటూ బీజేపీ
ప్రభుత్వాల మీద రాహుల్ మండిపడుతుంటారు. అలాంటి అదానీ గ్రూప్‌తో తెలంగాణలోని
కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందాలు ఎలా కుదుర్చుకుందన్న ప్రశ్నలకు జవాబివ్వడానికి
మాత్రం కాంగ్రెస్ నేతలకు నోళ్ళు రావడం లేదు.