Two more opposition leaders not attending consecration
ceremony
అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు
కావడం లేదని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ (Lalu
Prasad Yadav) వెల్లడించారు. ఇవాళ పట్నాలో మీడియాతో మాట్లాడుతూ లాలూ
ఈ విషయం తెలియజేసారు. అయితే ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి లాలూ నిర్దిష్టమైన
కారణం ఏమీ చెప్పలేదు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత
శరద్ పవార్ (Sarad Pawar) కూడా రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి
వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయిపోయాక, దేవాలయ
నిర్మాణం పూర్తయిన తర్వాత మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకుంటాను అని శరద్ పవార్
వెల్లడించారు. అయితే తనకు ఆహ్వానం పంపినందుకు హర్షం వ్యక్తం చేసారు.
రామజన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి
చంపత్‌రాయ్‌కు (Champat Rai) శరద్ పవార్ లేఖ రాసారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ
కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేసారు. ‘‘మర్యాదాపురుషోత్తముడైన రాముడు భారతదేశంలోని కోట్లాది
భక్తుల ఆధ్యాత్మిక అనుభూతులకు ప్రతీక. దేశమంతటా ఉన్న రామభక్తులందరూ ఈ కార్యక్రమం
గురించి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దేవాలయానికి పెద్దసంఖ్యలో వస్తారు. ఈ చారిత్రక
ఘటన తాలూకు హర్షోల్లాసాలు వారిద్వారా నాకు అందుతాయి’’ అంటూ చంపత్‌రాయ్‌కు లేఖ
రాసారు.
జనవరి 22 తర్వాత, అప్పటికి మందిర నిర్మాణం
పూర్తయిపోతుంది కాబట్టి, అప్పుడు వచ్చి రామచంద్రమూర్తిని దర్శించుకుంటానని శరద్
పవార్ వెల్లడించారు.