Varanasi’s artisan creates unique replica of Ram Mandir
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం
దగ్గరపడుతున్నకొద్దీ బాలరాముడిని ప్రజలు ఒక్కొక్కరూ ఒక్కొక్కలా స్మరించుకుంటున్నారు,
తమకు తోచిన రీతిలో సేవించుకుంటున్నారు. వారణాసికి చెందిన ప్రఖ్యాత (Varanasi
Artisan) కళాకారుడు నూతన మందిర నమూనాను (Ram Temple Replica) తయారు
చేసారు.
ప్రపంచంలోకెల్లా ప్రాచీన నగరమైన వారణాసికి చెందిన
కుంజ్ బిహారీ (Kunj Bihari), జాతీయ పురస్కారం గెలుచుకున్న కళాకారుడు. ఆయన
అయోధ్యలో నూతనంగా నిర్మితమవుతున్న రామమందిరం నమూనాను రూపొందించారు. ఆ నమూనాకు చాలా
ప్రత్యేకతలున్నాయి.
‘‘నేను నా సోదరులతో కలిసి ఈ నమూనాను తయారు
చేసాను. దీని ప్రత్యేకత ఏంటంటే దీన్ని గులాబీ మీనాకారీ పద్ధతిలో రూపొందించాం. ఆ
పద్ధతిలో కళాఖండాన్ని బంగారం, వెండి వంటి లోహాలతో తయారుచేస్తాం. ఇందులో 108 భాగాలున్నాయి. ఈ నమూనా మొత్తాన్నీ
108 రోజుల్లో తయారుచేసాం’’ అని కుంజ్ బిహారీ వివరించారు.
రామమందిరం నమూనా తయారుచేయడం సంక్లిష్టమైన
ప్రక్రియగా నిలిచిందని కుంజ్ బిహారీ వివరించారు. ‘‘ఈ నమూనాను రూపొందించడం చాలా
కష్టమైన పని. ఒకసారి శ్రీరామచంద్రమూర్తి బంగారు ప్రతిమ తయారీ పూర్తయాక మా లక్ష్యం
సులువైపోయింది. ఈ కళాఖండం రాముడికే అంకితం. ఈ నమూనా ఆలయం బరువు 2.5 కేజీలు.
దీనిమీద జై శ్రీరామ్ అన్న అక్షరాలు చెక్కాం. శిఖరాల మీద నాలుగు అన్కట్ వజ్రాలు
పొదిగాం. గుడి నమూనా, గుడి మీద జెండా అంతా వెండితో తయారు చేసాం. వేర్వేరు రంగులు
రావడానికి వేర్వేరు మూలకాలు ఉపయోగించాం. నీలిరంగు కోసం కోబాల్ట్, టైటానియం వాడాం.
పసుపు రంగు కోసం రాగి ఉపయోగించాం. బంగారం, మెగ్నీషియం ఆక్సైడ్ కూడా వాడాం. ఈ
లోహాలన్నింటినీ వాడి గులాబీ మీనాకారీ పద్ధతిలో ఈ నమూనాను తయారుచేయడానికి 850
డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరమైంది’’ అని కుంజ్ బిహారీ వివరించారు.
ఈ నమూనా రామాలయంలో బోలెడన్ని విశేషాలున్నాయి.
‘‘మన జాతీయ పుష్పం కమలాన్ని ద్వారం మీద చెక్కాం. రాముడి ధనుర్బాణాలు కూడా ఈ నమూనా
మీద ఉన్నాయి. దీనికి చెక్కిన జెండా ఎర్రరంగులో ఉంది. గుడిలోపలి రాముణ్ణి చూడడానికి
లోపలివైపు ఓ బల్బు పెట్టాం’’ అని వెల్లడించారు.
అయోధ్య ఆలయ నిర్మాణం కోసం
ప్రధాని మోదీ చొరవను కుంజ్ బిహారీ ప్రశంసించారు. ‘‘500 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ
తర్వాత ఆలయ సాకారమైందంటే దానికి ప్రధాని మోదీ చేసిన కృషి ఎంతో ఉంది. అందుకే మేం
తయారు చేసిన ఈ నమూనాను శ్రీరామచంద్రప్రభువుకు మోదీజీ చేతుల మీదుగా అంకితం చేయాలని
నా కోరిక’’ అన్నారు.