Praggnananda sets record and becomes India’s top ranker
in Chess
చదరంగపు చిచ్చరపిడుగు ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర
సృష్టించాడు. చదరంగంలో భారత నెంబర్ వన్ ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో అతను
విశ్వనాథన్ ఆనంద్‌ను కూడా అధిగమించాడు.
టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ నాలుగో రౌండ్లో
వరల్డ్ చాంపియన్ అయిన చైనా ఆటగాడు డింగ్ లిరెన్‌ను ఓడించి, ప్రజ్ఞానంద ఈ ఘనత
సాధించాడు. భారతదేశంలో చదరంగ క్రీడాకారుల్లో అగ్రస్థానానికి ఎగబాకాడు.
ప్రస్తుతం ప్రజ్ఞానంద ఫిడే ర్యాంకింగ్స్‌లో
2748.3 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. విశ్వనాథన్ ఆనంద్ 2748 పాయింట్లతో 12వ
స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో విషీని ప్రజ్ఞానంద అధిగమించినట్లయింది. అలాగే, భారతదేశపు
చదరంగ క్రీడాకారుల్లో అగ్రస్థానంలో నిలిచినట్లయింది. పైగా, విశ్వనాథన్ ఆనంద్
తర్వాత క్లాసికల్ చెస్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా
ప్రజ్ఞానంద అవతరించాడు.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ప్రజ్ఞానంద
సాధించిన విజయాన్ని ప్రశంసించారు. ఈ అద్భుతమైన విజయం దేశానికి గర్వకారణమని
అభినందించారు. గతేడాది నుంచీ ప్రజ్ఞానందకు అదానీ గ్రూప్ సహాయ సహకారాలు అందిస్తున్నసంగతి
తెలిసిందే.