Replica of Ayodhya Mandir built in Chandigarh
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరపు (Ayodhya
Ram Mandir) నమూనాలో చండీగఢ్‌లో ఒక పండాల్ నిర్మించారు (Replica in Chandigarh). దాని
పొడవు 80 అడుగులు, వెడల్పు 50 అడుగులు. చండీగఢ్ సెక్టార్ 34లో నిర్మించిన ఆ పండాల్
చూపరులను ఆకట్టుకుంటోంది.
అయోధ్య శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ
కార్యక్రమం జనవరి 22న జరగనుంది. ఆ సందర్భంగా దేశమంతటా ఉల్లాస ఉత్సాహ ఉద్వేగాలు
రేకెత్తుతున్నాయి. చండీగఢ్ నగరంలో కూడా ప్రజలు జనవరి 22 కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రాణప్రతిష్ఠ సందర్భాన్ని పురస్కరించుకుని చండీగఢ్‌లో పలు కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి.
శ్రీరామకృప సేవాట్రస్ట్ జనవరి 22వరకూ చండీగఢ్‌లో
పలు కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేసింది. వాటిలో మొదటిగా ఆరోజు సాయంత్రం
సెక్టార్ 23లోని సనాతన్ ధర్మ ఆలయం నుంచి సెక్టార్ 34లో అయోధ్య ఆలయం నమూనాలో
నిర్మించిన పండాల్ వరకూ భారీ ఊరేగింపు జరుగుతుంది. పెద్దసంఖ్యలో రామభక్తులు ఆ
కార్యక్రమంలో పాల్గొంటారు.
‘‘ప్రజలందరూ అయోధ్యలో రామజన్మభూమి మందిర
ప్రారంభోత్సవంలో పాల్గొనలేరు. అందువల్ల ఇక్కడ చండీగఢ్‌లో అయోధ్య ఆలయంలో నమూనా
పండాల్ ఏర్పాటు చేసాం’’ అని చండీగఢ్ నగర మేయర్ అనూప్ గుప్తా చెప్పారు. ప్రస్తుతం
నగరంలో ‘రామ్‌లల్లా వారం’ నడుస్తోందని ఆయన వెల్లడించారు. ‘‘ఈ రోజు రావడం కోసం 500
సంవత్సరాలు పట్టింది. సమాజం మొత్తం ఎంతో ఉద్వేగంగా ఉంది. రామజన్మభూమి ఉద్యమంలో సుమారు
పాతిక తరాలు పాల్గొన్నాయి. ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసారు. గత 75ఏళ్ళుగా ఈ వివాదం కోర్టులో
నలిగింది. ఆ ఉద్యమంలో పాల్గొన్న వారిలో ఎంతోమంది అమరులయ్యారు. ఇన్నాళ్ళకు రాముడి
అపార కరుణ మనపై ప్రసరించింది. ఈ గొప్ప సందర్భానికి సాక్షీభూతులం అవుతున్నందుకు మనం
అదృష్టవంతులం. శ్రీరాముడి దయతో మా పని పూర్తయింది. 5 ఆగస్టు 2020 నాడు అయోధ్యలో
భూమిపూజ జరిగింది. ఇప్పుడు మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది. మేమెంతో
ఆనందంగా, ఉత్సాహంగా, సంతృప్తితో ఉన్నాం’’ అని అనూప్ గుప్తా వెల్లడించారు.
అయోధ్యలో జనవరి 22 మధ్యాహ్న సమయంలో
శ్రీరామచంద్రుడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది.