ఏపీ కాంగ్రెస్లో కీలక నియామకం జరిగింది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను ( ap pcc president ys sharmila) నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించారు. నిన్నటి వరకు ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజుకు పదోన్నతి లభించింది. గిడుగుకు సీడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితునిగా నియమించారు.తాజా నియామకాల ప్రకటనను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణగోపాల్ మీడియాకు విడుదల చేశారు.
ఇటీవల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీ అప్పటి అధినేత్రి వైఎస్ షర్మిల ప్రకటించారు. వెంటనే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జనవరి మొదటివారంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా, చేయడానికి సిద్దంగా ఉన్నట్లు షర్మిల ప్రకటించిన తరవాత ఊహాగానాలు ఊపందుకున్నాయి. నిన్న ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా చేయడంతో ఇక షర్మిల నియామయం లాంఛనమేనని తేలిపోయింది. ఇవాళ షర్మిల నియామకంపై అధికారిక ప్రకటన విడుదలైంది.