Cock Fights during Sankranti Festival Time
సంక్రాంతి (Makar Sankranti) వచ్చిందంటే చాలుగోదావరి జిల్లాల్లో అందరి నోటా వినబడే
పేరు పందెం కోడిఅనడంలో సందేహం లేదు. కోడి పందేల చరిత్ర (Cock Fights) ఈనాటిది కాదు. సురవరం
ప్రతాపరెడ్డి గారి ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర‘ లో కోడి పందేల గురించి విపులంగా రాశారు. సంక్రాంతి వేళ కోడికి కత్తి
కడితే కనక వర్షమే అనే సామెత కూడా ఈ పందేల కథ ఎంత పాతదో తెలియజేస్తుంది. నేడు
కోడిపందేల పేరుతో బెట్టింగ్ సాధారణమైపోయింది.
6000 సంవత్సరాలకు పూర్వమే పర్షియాలో కోడి
పందాలు జరిగాయని తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో ఈ సంప్రదాయం తరతరాలుగా
సంక్రమించి ఇప్పటికీ కొనసాగుతోంది. సాధారణంగా బెట్టింగ్ కోసం కోడిపందేలు
ఆడేవారున్నా ప్రస్తుతం ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసింది. ఐనా దాదాపు
అన్నిచోట్లా అనధికారికంగా బెట్టింగులు జరుగుతూనే ఉన్నాయి.
పందెం కోళ్ళలో చాలా జాతులున్నాయి.
వాటిని వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు.
రసంగి, కౌజు,మైల,చవల,సేతువ, కొక్కిరాయి, పచ్చకాకి,ఎరుపుగౌడు, తెలుపుగౌడు లాంటి పేర్లతో వాటిని పిలుస్తుంటారు. డేగ, కాకి
బాగా పేరు గడించిన జాతులు.
పూర్వం ఆంధ్ర క్షత్రియులు తమ
పౌరుషానికి ప్రతీకగా సంక్రాంతి రోజుల్లో కుక్కుట శాస్త్రాన్ని ఆచరిస్తూ కోడి
పందాలను నిర్వహించేవారు. బొబ్బిలి యుద్ధం ,
పల్నాటి యుద్ధానికి కారణం కూడా కోడి పందేలే
అన్నది జగమెరిగిన సత్యం
1646 లో జార్జి విల్సన్ అనే ఓ ఆంగ్ల రచయిత
‘కాక్ ఆఫ్ ది గేమ్’ అనే గ్రంథంలో కోడి పందేల గురించి రాశారు. ఇరాన్, ఇండోనేషియా, బ్రెజిల్, పెరూ, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఫ్రాన్స్, క్యూబా, పాకిస్తాన్, అమెరికా, జపాన్ మొదలైన దేశాల గ్రామీణ
ప్రాంతాల్లో కూడా కోడి పందేల ఆచారం ఉంది.
పందెం కోడిపుంజులకంటూ ఒక పంచాంగం ఉంది.
దానినే “కుక్కుట శాస్త్రం” అంటారు. కుక్కుటశాస్త్రాన్ని జ్యోతిష్య
శాస్త్ర ప్రకారం రాశారని చెబుతుంటారు. ఏ సమయంలో ఏ జాతి పుంజును బరిలోకి దింపితే..
అది గెలుస్తుందో గణాంకాలు వేసి మరీ పందేలు కాస్తారు. కోడి యజమాని పేరులోని
అక్షరాలు , తిథుల ఆధారంగా కూడా గెలుపోటములు
ఆధారపడి ఉంటాయని కుక్కుట శాస్త్రం చెబుతుంది.
పందెం కోళ్ళ పోషణ ఆషామాషీగా ఉండదు.
వాటికి చాలా బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తారు. జీడిపప్పు, పిస్తా, బాదం వంటివి తినిపిస్తుంటారు.
ప్రస్తుతం పందెం కోళ్ళ అమ్మకానికి సంబంధించి ఆన్లైన్ మార్కెట్ కూడా బాగా
పుంజుకుంది. కార్పొరేట్ బిజినెస్ కూడా షురూ అయ్యింది.
పూర్వకాలం నుండీ కోడి పందేలను నాలుగు
రకాలుగా నిర్వహిస్తున్నారు. ఎత్తుడు దించుడు పందెం, చూపుడు పందెం, ముసుగు పందెం, డింకీ
పందెం అని పిలుస్తారు.
పౌరుషానికీ , రాజసానికీ పెట్టింది పేరు పందెం కోళ్ళు. ఒక్కసారి బరిలో దిగాయంటే
ప్రాణాలైనా వదిలేస్తాయి గానీ వెనకడుగు వెయ్యవు. కోళ్ళలో ఈ ప్రత్యేక లక్షణమే
పందేలకు పురిగొల్పేలా చేస్తోంది. కోళ్ళ చరిత్ర, పందేల ప్రస్థానం తెలుసుకుంటే
ఆశ్చర్యం కలగక మానదు.
ప్రపంచంలో 10 వేల రకాల జాతుల పక్షులున్నాయి. కోళ్ళలోనే దాదాపు 100 రకాలు ఉన్నాయి. అసలీ కోడి జాతి మొట్టమొదట ఎలా పుట్టిందో పరిశోధకులకు
కూడా తెలియదు. ఓ అంచనా ప్రకారం తూర్పు , దక్షిణ ఆసియా
దేశాల్లో మొట్ట మొదటిసారిగా కోడి జాతి జన్మించినట్లు చెబుతున్నారు. సాధారణంగా
మనుషులతో జీవించేందుకు పక్షులు ఇష్టపడవు. అలాంటిది కోళ్ళు మాత్రం మనుషులను చూసి
పారిపోతూనే… అదే మనుషులతో మచ్చికగా ఉంటాయి. ఎప్పుడో 10 వేల ఏళ్ళ కిందటే కోళ్ళను ప్రజలు పెంచుకున్నట్లు తెలుస్తోంది.
ఆధారాలు మాత్రం పూర్వ సామాన్యశకం 3వ శతాబ్దంలో లభిస్తున్నాయి. హరప్పా ,
మొహెంజోదారోలో కోడి ఆకారంలోని కొన్ని చిత్రాలు
కనిపించాయి. తద్వారా అప్పటి ప్రజలు కోళ్ళను పెంచుకున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం ఉన్న కోళ్ళను ప్రధానంగా
రెండు రకాలుగా విభజించారు. వాటిలో ఒకటి గ్రే జంగల్ ఫౌల్. ఇవి ఇండియాలో ఎక్కువగా
కనిపించే కోళ్ళు. రెండో రకం రెడ్ జంగల్ ఫౌల్. ఇవి తూర్పు ఆసియాలో కనిపించే కోళ్ళు.
ఇండియన్ కోళ్ళ కంటే తూర్పు ఆసియాలో కోళ్ళు పొడవైన రెక్కలు , పెద్ద సైజు తోకతో ఆకట్టుకుంటున్నాయి.
కోళ్ళ పందేల్లో ఇప్పుడంటే డబ్బుతో
పందేలు కట్టి ఆడుతున్నారు కానీ… పూర్వం అంటే సింధు నాగరికత కాలంలో కోళ్ళ పందేలు
వినోదం కోసం మాత్రమే జరిపేవాళ్ళు. ఈజిఫ్టులో కూడా కోళ్ళ పందేలకు ప్రత్యేక
గుర్తింపు ఉండేది. మనుషులకు ఎలాంటి హానీ లేకుండా… పక్షులు మాత్రమే
దెబ్బలాడుకుంటుంటే, ఆ యుద్ధాన్ని చూసి ఆనందపడుతూ అదో వినోదంగా భావించేవాళ్ళు
అప్పటి పాలకులు.
గ్రీస్‌లో యుద్ధాలకు వెళ్లేముందు
శత్రువుల పేర్లను కోళ్ళకు పెట్టి పందేలు కాసేవాళ్ళు. తద్వారా తమ పుంజు గెలిస్తే ,
యుద్ధం గెలిచినట్లు భావించేవాళ్ళు. సిరియన్లు
గెలిచిన కోళ్ళకు పూజలు చేసేవాళ్ళు. కోడి గెలిస్తే తాము కూడా విజయం సాధిస్తామన్న
బలమైన నమ్మకం వాళ్ళది. రోమన్లు చనిపోయిన కోళ్ళను దేవతలకు నైవేద్యంగా ఇచ్చేవాళ్ళు.
ఇక దాని జోలికి వెళ్లేవాళ్ళు కాదు. రానురానూ కోళ్ళ పందేల అర్థం మారిపోయింది. పరువుప్రతిష్టలకు
ప్రతిరూపంగా భావిస్తున్నారు.
తెలుగు నేలపై కోళ్ళ పందేలకు సంబంధించి
కచ్చితమైన ఆధారాలున్నాయి. 11వ శతాబ్దంలో అప్పటి పల్నాటి రాజులు కోళ్ళ
పందేలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాల నాగమ్మతో పందెంలో ఓడిపోయిన పల్నాటి
బ్రహ్మనాయుడు అడవులకు వెళ్లాడని చరిత్రలో ఉంది. బొబ్బిలి , విజయనగర రాజుల మధ్య కూడా కోడి పందేలు జోరుగా సాగాయి. కోడి ఓడితే పరువు
పోయినట్లు, తల కొట్టేసినట్లు భావించేవాళ్ళు.
కాలం గడిచే కొద్దీ , కోడి పందేలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాయి తెలుగు
రాష్ట్రాలు. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాల్లో కోట్ల రూపాయల బెట్టింగులు
జరుగుతున్నాయి. జీవహింస మహా పాపం అంటూనే… కోళ్ళకు కత్తులు కట్టి మరీ
విన్యాసాల్ని వీక్షిస్తున్నారు ప్రజలు.