Kanuma is the festival of respecting animals
మకర సంక్రమణం మొదలైన రెండోరోజును కనుమ పండుగగా (Kanuma
festival) జరుపుకుంటారు. ఇది తెలుగునాట మాత్రమే కనిపించే పండుగ. సంక్రాంతి
సంబరాలు వ్యవసాయ సంబంధమైనవి, రైతన్న ఉత్సాహానికి చెందినవీ అని నిరూపించే పండుగ
ఇది. (Festival of animals)
రైతులు తమ వ్యవసాయానికి అండగా నిలిచి, తమకు
ఎనలేని సేవలు అందించే పశువులను గౌరవించుకునే పండుగ కనుమ. దీన్నే పశువుల పండుగ అని
కూడా అంటారు. చాలామంది కనుమ మరునాడు కూడా ముక్కనుమ పేరుతో ఈ పండుగను
కొనసాగిస్తారు. ఆధునికత ముదురుతున్న కొద్దీ ముక్కనుమ పండుగ కనుమరుగవుతోంది.
పూర్వకాలంలో మనదేశంలో గోసంపదనే ధనంగా పరిగణించేవారు.
అందుకే చాలావరకూ భారతీయ భాషల్లో పశువులను సొమ్ములు అనీ, లేదా ధనమనీ వ్యవహరిస్తారు.
అలాంటి పశువులను, ప్రధానంగా వ్యవసాయానికి ఉపయోగించే ఎడ్లను పూజించుకోవడమే ఈ పండుగ
అంతరార్ధం.
కనుమ పండుగ రోజు రైతులు ఉదయాన్నే లేచి, పశువుల
కొట్టాల ముందు పాలు పోసి పొంగళ్ళు వండుతారు. పశువులకు శుభ్రంగా స్నానం చేయించి
వాటి ముఖాలు, కొమ్ములు, గిట్టలను పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. వాటికి పువ్వుల
దండలు వేసి కొత్తబట్టలు పెడతారు. ‘‘పాలపొంగలి, పశువుల పొంగలి’’ అని గట్టిగా కేకలు
వేస్తారు. ఆ పొంగలి దేవతలకు నివేదించి, కొంత నైవేద్యం పశువులకు తినిపిస్తారు. మరికొంతభాగంలో
పసుపు కుంకుమ కలిపి ఆ నైవేద్యాన్ని తమ పొలాల్లో చల్లుతారు. దానివల్ల దుష్టశక్తులు
దూరమవుతాయనీ, పంటపొలాలు బాగా పండుతాయనీ విశ్వాసం,
రైతుకు అసలైన సంపద తమ పశువులే. అవి శ్రమపడితేనే
సంక్రాంతి పండుగ నాటికి పంటలు చేతికి అందివస్తాయి. అందుకే పశువులకు
కృతజ్ఞతాసూచకంగా వాటికి కొత్తబియ్యంతో పొంగలి వండిపెడతారు. ఇంక శీతాకాలం
రాత్రిసమయం ఎక్కువగానూ పగటి సమయం తక్కువగానూ ఉంటుంది. కాబట్టి పొద్దున్న లేవగానే
ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు పెసలతో కూడిన ఆహారం తీసుకోవడం మంచిది.
అందుకే వైద్యపరంగానూ పొంగలి నివేదనకు ప్రాధాన్యం ఉంది.
కనుమ రోజు సాయంకాలం గంగిరెద్దుల ఆటపాటలు ఉంటాయి. ఎడ్లపోటీలు,
కోడిపందేలు, పొట్టేలు పందేలు, పశువుల ఊరేగింపులూ జరుపుతారు. ఈ ఆటపాటల్లో
గ్రామంలోని అందరూ ఒక్కచోట కలిసి పాల్గొంటారు. అలా సాంఘికంగా, సామాజికంగా ప్రజలను
కలిపిఉంచే అపురూపమైన పండుగ కనుమ.
గోవులు మనకు పాల రూపంలో ఆహారాన్ని ఇస్తున్నాయి.
ఆవుపాలు మానవులకు సమగ్రమైన పోషకాహారం. అందుకే మన ధర్మశాస్త్రాలు ఆవుపాలను తల్లిపాలతోనూ,
అమృతంతోనూ సమానం అని వర్ణిస్తాయి. ఇంక ఎద్దులు వ్యవసాయం చేయడానికి అత్యవసరం.
ఎద్దులతో పొలం దున్నకపోతే పంటే లేదు. అందుకే ఆవులను, ఎడ్లను సమానంగా పూజిస్తే
తల్లిదండ్రులను, బ్రహ్మదేవుడినీ పూజించినట్లే. జంతుజాతికి మానవులు కృతజ్ఞత
చెప్పుకునే విశిష్టమైన పండుగే కనుమ.