ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు
గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ
జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు.
ఇటీవల కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీని
విలీనం చేసిన వైఎస్ షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని కొన్ని రోజులుగా
ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గిడుగు రుద్రరాజు రాజీనామాకు ప్రాధాన్యత
ఏర్పడింది.
రెండు, మూడు రోజుల్లో పీసీసీ కొత్త బాస్ పేరును ఏఐసీసీ ప్రకటించనుంది.
దివంగత వైఎస్, సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ
సన్నిహితుల్లో గిడుగు రుద్రరాజు ఒకరు. ఆయన గతంలో కీలక పదవుల్లో కాంగ్రెస్ కు సేవలు
అందించారు. 2005 నుంచి 2007 వరకు వైద్య ఆరోగ్య శాఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్
చైర్మన్ గా పనిచేశారు. 2007 నుంచి 11 వరకు శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. 2012 లో
ఉత్తరప్రదేశ్ ఎన్నికల పరిశీలకుడిగా పనిచేశారు.
గతంలో తెలంగాణ కేంద్రంగా వైఎస్సార్ టీపీని
ప్రారంభించిన వైఎస్ షర్మిల అక్కడ పాదయాత్ర చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల
సందర్భంగా పోటీకి దూరంగా ఉండి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. తర్వాత ఈ ఏడాది
జనవరి 4న కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఆమెను ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా
నియమించాలని కాంగ్రెస్ భావిస్తోంది. షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కాంగ్రెస్
పుంజుకునే అవకాశముందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె అసెంబ్లీ లేదా పార్లమెంటుకు
పోటీ చేసే అవకాశముందని కూడా ప్రచారం జరుగుతోంది.