Surat’s textile industry prepares two lakh caps and two lakh flags with Lord Ram’s name
అయోధ్యలో బాలరాముడి
ప్రాణప్రతిష్ఠ జరగనున్న సందర్బంగా సూరత్ వస్త్ర పరిశ్రమ ఓ కార్యక్రమం తలపెట్టింది.
రామనామంతో రకరకాల టోపీలు, జెండాలూ
తయారుచేస్తోంది.
సూరత్ వస్త్రపరిశ్రమకు చెందిన లక్ష్మీపతి గ్రూప్ మొత్తం
రెండు లక్షల టోపీలు, రెండు లక్షల జెండాలు తయారు చేస్తోంది. వాటిపై శ్రీరాముడి
చిత్రాన్ని ముద్రించారు. వాటిని దేశవ్యాప్తంగా పంచిపెట్టాలని వారి ఉద్దేశం.
లక్ష్మీపతి గ్రూప్ యాజమాన్యం చెబుతున్న వివరాల ప్రకారం
మొక్కజొన్న పీచు, పాలియెస్టర్ కలిపిన మిశ్రమ దారంతో కాషాయ రంగు టోపీలు తయారు
చేస్తున్నారు. ఒక్కొక్క టోపీ పొడవు 11.5 అంగుళాలు, వెడల్పు 3.5 అంగుళాలు ఉంటుంది.
దానిమీద శ్రీరాముడు, రామమందిరం బొమ్మలతో పాటు జై శ్రీరామ్ నినాదం కూడా
ముద్రిస్తున్నారు.
ఇమామ్ అనే కార్మికుడు, రాముడి పేరుతో ఉన్న టోపీలు తయారు
చేసే పని దొరికినందుకు సంతోషం వ్యక్తం చేసాడు. ‘‘ఈ టోపీలు కుట్టే ఆర్డర్ రావడం
ఎంతో సంతోషంగా ఉంది. మామూలుగా మేము పనిచేసేటప్పుడు చెప్పులు వేసుకునే ఉంటాం. కానీ
ఈ టోపీలు, జెండాలు చేసేటప్పుడు శ్రీరామచంద్ర ప్రభువుకు గౌరవసూచకంగా చెప్పులు విప్పేస్తున్నాం. రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా మా తరఫున ఇలా
సేవ చేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పాడు.
రామజన్మభూమిలో నూతన మందిర నిర్మాణం సందర్భంగా
దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల నుంచి ప్రజలు తమకు తోచిన కానుకలు తమ శక్తిసామర్థ్యాల
మేరకు అందజేస్తున్నారు.