Cultural presentations from other states in Ayodhya ahead
of ‘Pran Pratishtha’
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ (Ayodhya Consecration Ceremony)సందర్భంగా దేశంలోని
అన్ని రాష్ట్రాల సాంస్కృతిక కళలను (Cultural
Presentation) ప్రదర్శిస్తారు. ఇవాళ మకర సంక్రాంతి మొదలుకొని ఆ ప్రదర్శనలు
అయోధ్య వాసులకు కనులవిందు చేస్తాయి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన మేరకు
దేశంలోని విభిన్న సంస్కృతులను ప్రతిబింబించే కళా ప్రదర్శనలతో అయోధ్య కళకళలాడుతుంది.
రామ్ కీ పైదీ, ధరమ్ పథ్, తులసీ ఉద్యాన్, సర్క్యూట్ హౌస్, సాకేత్ కళాశాల వంటి
ప్రదేశాల్లో ఈ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ‘నూతన అయోధ్య’ అనే ఇతివృత్తంతో ఈ
కార్యక్రమం జరుగుతుంది.
జనవరి 15, అంటే నేటి నుంచీ ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త
దేవకీనందన్ ఠాకూర్ రామకథా పార్క్ వద్ద రామకథ చెబుతారు. ప్రతీరోజూ ఉదయం 11 గంటల
నుంచి 2గంటల వరకూ జరిగే ఈ ప్రవచనం జనవరి 23వరకూ కొనసాగుతుంది. నిజానికి ఈ
కార్యక్రమం జనవరి 8నే ప్రారంభమైంది. వారానికి ఒకరు చొప్పున రామకథను ప్రవచనం చేస్తూ
ఉంటారు. మొత్తం 70 రోజుల పాటు ఈ ప్రవచనాలు జరుగుతాయి. మొదటివారం అంటే జనవరి 8 నుంచి
14 వరకూ చిన్మయానంద బాపు ప్రవచనం చేసారు.
రామ్ కీ పైదీ వద్ద కళాకారులు తమ కళలతో రాముణ్ణి
సేవించుకుంటారు. మహారాష్ట్రకు చెందిన శైలేష్ భాగవత్ షెహనాయి వాయిస్తారు. అదే
రాష్ట్రానికి చెందిన హర్షవర్ధన్ సారంగి వాదనంతో రాముణ్ణి కొలుచుకుంటారు. ఢిల్లీకి
చెందిన శాశ్వత్ మండల్ భక్తిగీతాలు ఆలపిస్తారు. అనుజ్ మిశ్రా కథక్ నాట్యాన్ని
ప్రదర్శిస్తారు. జ్యోతి శ్రీవాస్తవ ఒడిస్సీ నాట్యాన్ని ప్రదర్శిస్తారు. అంజనా ఝా,
సురభి శుక్లా జంటగా కథక్ నాట్యం చేస్తారు. మీనూ ఠాకూర్ కూచిపూడి నృత్యంతో
రామభక్తులను అలరిస్తారు.
మకర సంక్రాంతి రోజు – అంటే ఇవాళ సాకేత్ పెట్రోల్ పంప్ దగ్గర
శశికాంత్ దూబే బృందం భజనలు, అయోధ్యకే చెందిన శీతలా ప్రసాద్ వర్మ ఫరువాహీ జానపద
నృత్యం ప్రదర్శనలు జరుగుతాయి. ధరమ్ పథ్ వద్ద అయోధ్యకు చెందిన రాజేష్ గౌడ్ కహర్వా
నృత్యం చేస్తారు, గోండాకు చెందిన శ్వేతా సింగ్ భజనలు, జానపద గీతాలు ఆలపిస్తారు.
రామ్‌ఘాట్ హాల్ట్ దగ్గర రమా ప్రజాపతి బధావా నాట్యం
ప్రదర్శిస్తారు. మానవేంద్రదాస్, మానస్దాస్ ద్వయం భక్తిగీతాలు ఆలపిస్తారు. సాకేత్ కళాశాల
దగ్గర సుల్తాన్‌పూర్‌కు చెందిన దయాశంకర్ పాండే అవధీ జానపదగీతాలు ఆలపిస్తారు.
ప్రకృతి యాదవ్ జానపద నృత్యం చేస్తారు.
పరాగ్ డైరీ చేరువలో ముఖేష్ కుమార్ ఫరువాహి జానపద నృత్యం
చేస్తారు. తులసీ ఉద్యాన్ వద్ద ఝాన్సీకి చెందిన సీతారామ్ కుశ్వాహా భజనగీతాలు గానం
చేస్తారు. జౌన్‌పూర్‌కు చెందిన అశోక్ కుమార్ జానపద గీతాలు ఆలపిస్తారు. ప్రయాగరాజ్‌కు
చెందిన ఓంప్రకాశ్ శర్మ షెహనాయ్ వాయిస్తారు.