Makar Sankranti the festival of farmers and villages of
India
ప్రకృతికి అనుగుణంగా జీవించడం భారతీయ సనాతన
సంప్రదాయం. అందుకే మన పండుగలు అన్నీ ప్రకృతి సంబంధమైన మార్పులతో ముడిపడి ఉంటాయి. సంక్రాంతి
పండుగ కూడా అంతే. పైగా మన దేశంలో, పంటలు ఇంటికి చేరే వేళ కావడంతో రైతన్నల సంబరాలకు
కూడా సరైన సమయమిది.
‘సంక్రాంతి’ అంటే చేరడం అని అర్ధం. భారతీయ
పంచాంగం ప్రకారం పన్నెండు రాశులు ఉంటాయి. సూర్యుడు నెలకు ఒక రాశిలో చేరినప్పుడు ఆ
రాశికి చెందిన సంక్రమణం అవుతుంది. అలా మకర రాశిలో చేరిన సందర్భాన్నే మకర సంక్రమణం లేదా
మకర సంక్రాంతి అంటారు. పన్నెండు రాశులకూ పన్నెండు సంక్రాతులు ఉంటాయి. అలాంటప్పుడు
మకర సంక్రమణాన్నే ఎందుకు పండుగగా చేసుకుంటాం? మకర సంక్రమణ వేళ నుంచీ సూర్యుడి గమనం
దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు మారుతుంది. అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయనంలోకి
మారుతుంది. ఈ ప్రాకృతికమైన మార్పును గుర్తిస్తూ మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా
చేసుకోవడం ఆనవాయితీ.
రైతుల పరంగా ఈ పండుగ విశిష్టతను గమనిద్దాం.
తొలకరిలో మొలకెత్తిన జొన్న, సజ్జ మొదలైన మెట్టపైరులతో పాటు రాగి, వరి, కూరగాయల
వంటి మాగాణి పంటలు సైతం ఈ సమయానికి కాపువచ్చి, పంటపండి, ఎటుచూసినా కళకళలాడుతూ ఉంటాయి.
పల్లెసీమల చుట్టుపక్కల నిండుగా పండి, వెన్నులు ఒరిగి, కోతకు సిద్ధంగా ఉండే వరిచేలు,
బంతి-చేమంతి వంటి పూలతోటలూ కనులపండువగా ఉంటాయి. పశువులు పాలతో సమృద్ధిగా ఉంటాయి.
ఇలా పల్లెటూళ్ళు, రైతుల లోగిళ్ళు పాడిపంటలతో తొణికిసలాడుతుంటాయి. ఇళ్ళ నిండా
ధాన్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరుస్తుంటాయి. అందుకే ఉత్తరాయనాన్ని దేవతలకు ప్రధానమైన
ఉత్తమకాలంగా భావిస్తాం.
సూర్యుడు ధనూరాశిలో ఉండే ఆఖరి రోజు భోగి
పర్వదినం. ఆనాటితో కలుపుకుని అంతకుముందు ముప్ఫైరోజులూ ధనుర్మాసం అంటారు. అక్కడితో
దక్షిణాయనం సంపూర్ణమవుతుంది. మకరరాశిలో సూర్యుడు ప్రవేశించే పవిత్ర సందర్భమే మకర
సంక్రమణం లేదా మకర సంక్రాంతి పర్వదినం. ఆనాటినుంచి ఉత్తరాయనం మొదలవుతుంది. ఆ రోజు
నుంచీ సూర్యుడి కిరణాల్లో పదును క్రమంగా పెరుగుతుంది. ప్రకృతి ఉత్తేజితమవుతుంది. ఆ
ప్రాకృతికమైన మార్పును ఆహ్వానిస్తూ జరుపుకునే పండుగే మకర సంక్రాంతి.
ఒకప్పుడు శివుణ్ణి భర్తగా పొందగోరిన కాత్యాయనీ
దేవి హేమంత ఋతువులో ధనుర్మాస ఉషోదయాల్లో శివుణ్ణి ఆరాధించి సాత్వికాహారమైన హవిస్సు
నివేదించి వ్రతం చేసిన కారణంగా ఆ వ్రతానికి ధనుర్మాస వ్రతం అనే పేరు వచ్చింది.
అనంతర కాలంలో ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని కోరుకున్న గోపికలు ఈ వ్రతాన్ని కాత్యాయనీ
వ్రతంగా ఆచరించారు. కలియుగంలో గోదాదేవి లేదా చూడికుడుత్త నాచియార్ ఆ గోపికలు చేసిన
పూజావిధిని అనుసరించి ధనుర్మాసంలో రోజుకొక్క పాశురం చొప్పున పాడుతూ వైకుంఠనాథుడైన
రంగనాథుడిని అర్చించింది. ఆ విధంగా ధనుస్సంక్రమణ
వేళ నుంచి మకర సంక్రమణ వేళ వరకూ కాత్యాయనీ వ్రతం ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది.
మకర సంక్రమణ వేళ నుంచీ పుష్యమాసం ప్రవేశిస్తుంది.
ఇది భూమిని సస్యశ్యామలం చేసే సమయం. పౌష్యము అంటే పోషించునది అని అర్ధం. రైతులు
పడిన శ్రమ చేతికి పంటగా అందే మాసం ఇది. ధాన్యపు రాశులు, చెరకు రసాలు, పనస తొనలు, గుమ్మడి
పళ్ళు, రేగి పళ్ళు… ఇలా పంటలన్నీ అందివచ్చే వేళ రైతుల సంబరం అంబరాన్ని అంటుతూ
ఉంటుంది. అందుకే సంక్రాంతిని, వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో పెద్దపండుగగా
జరుపుకుంటారు. ఈ సమయంలో దేశమంతా ప్రాంతానికొక్క పేరుతో ఈ పండుగ జరుపుకుంటుంది.
గంగిరెద్దుల మేళాలు, గోపూజలు, బొమ్మల కొలువులు,
బొంగరాల ఆటలు, గాలిపటాల పోటీలు, కోడిపందేలు, పడవ పందేలు, హరిదాసుల ఆధ్యాత్మరామాయణ
గానాలు, భాగవతుల నగర సంకీర్తనలు… ఇలా అందరి మనసుల్లో వెల్లివిరిసే ఆనందానికి
ప్రతీక సంక్రాంతి పండుగ. పూర్వం వామనావతారంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని
పాతాళానికి తొక్కివేస్తాడు. అయితే శ్రీమహావిష్ణువు కరుణించడంతో బలి చక్రవర్తి ప్రతీయేటా
ఒకసారి ఈ సంక్రాంతి పర్వదిన సమయాన భూమిమీదకు వచ్చి తన ప్రజల సుఖసంతోషాలను చూసి
వెడతాడట. ఆయనను స్వాగతిస్తూ ఒక ఇంటినుంచి మరో ఇంటికి రథాల ముగ్గులు వేస్తారని ఒక కథనం.
సంక్రాంతి లక్ష్మి రంగురంగుల ముగ్గుల రథాలనెక్కి
రంగరంగ వైభవంగా ప్రతీ ఇంటికీ ఊరేగాలని, ఇంటింటా సుఖ సంతోషాలు నిండాలనీ, సూర్యుడి
వెచ్చదనం అందరి బ్రతుకులలోనూ వెల్లివిరియాలనీ ఆ భగవంతుడికి స్వాగతాంజలి
సమర్పిద్దాం. సంక్రాంతి పురుషుడు ప్రజలందరినీ ఆధ్యాత్మిక చింతనలో నడిపి అందరికీ
ఇహపరాలలో ఆనందాన్ని కలిగించాలని కోరుకుందాం.