కాంగ్రెస్ సీనియర్ నేత మిలింద్ దేవ్రా పార్టీకి రాజీనామా సమర్పించారు. నా రాజకీయ జీవితంలో కీలక అధ్యాయం తుది అంకానికి చేరిందని, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో తన కుటుంబానికి ఉన్న 53 సంవత్సరాల అనుబంధం ముగిసినట్లేనని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మిలింద్ కాంగ్రెస్‌ను వీడటంతో మహారాష్ట్రలో ఆ పార్టీకి గట్టి షాక్ తగిలినట్టైంది.
కాంగ్రెస్ సీనియర్ నేత మురళీ దేవ్రా కుమారుడే మిలింద్ దేవ్రా. కాంగ్రెస్ పార్టీలో బలమైన యువ నేతల్లో మిలింద్ దేవ్రా ఒకరు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2012లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 2019లో శివసేన నేత అరవింద్ సావంత్ చేతిలో ఓడిపోయారు. భవిష్యత్తు కార్యాచరణపై త్వరలో నిర్ణయం వెలువరించే అవకాశముంది. ఇండీ కూటమిలో శివసేన చేరడంతో మిలింద్కు టికెట్ దక్కదనే అనుమానాలు ఆయన్ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ వీడినట్లు వార్తలొస్తున్నాయి.