ధనుర్మాస ప్రత్యేక కథాస్రవంతి :28
మంచి వెన్నెల వేళ :: వట్టి వెర్రి గొల్ల
పొలతులము! ~ కాత్యాయనీ వ్రతం – 28
రచన : ‘కొత్తావకాయ’ సుస్మిత
**************************
“చెలియా! నిన్నటి ఆనందం వేరొకరికి దక్కేది కాదు. బ్రహ్మేంద్రాదులైనా
తలక్రిందులుగా తపస్సు చేస్తే మాత్రం కన్నయ్య సరసన కూర్చుని భోజనం చెయ్యగలరా? మన పున్నెం ఎంతని
చెప్పాలి! ఇంత పరమానందం మన సొంతమయినాక కూడా, పరవాద్యమీయమని కృష్ణుని ఎలా అడగడం?” వాపోయింది
కమలిని.
“నిజమే! ఎన్ని మాటలన్నాము! ఎన్ని నిందలు మోపాము.
ఇవేవీ పట్టనట్టు ఒక్క క్షణంలో మనని మహదానందంలో ముంచి వెళ్ళిపోతాడు కదా! కన్నయ్య
కరుణ అపారం!” పూవులేరి సజ్జ నింపుతూ కమలినితో చెప్పింది సురభి.
చెంత చేరిన సాటి గొల్లెతలు వారి మాటలను విని
తలొకరూ తాము చేసిన మునుపటి తప్పులను తలచుకోనారంభించారు. తోటి గోపబాలుర మధ్య సింహపు
కొదమ వలే ఒప్పారే కృష్ణుని శైశవక్రీడలను మరి మరి తలచుకు మురిసారు. అతడు
సామాన్యుడని తలచి “అల్లరి వాడని” యశోదకు చాడీలు చెప్పిన తమ తెలివితక్కువ
తనాన్ని గురుతు తెచ్చుకుని బాధపడ్డారు.
కన్నయ్యకు కడుపు నిండుగా పాలిచ్చి, ముద్దులొలికే ఆ
నందకిశోరుడి మోము చుట్టూ చేతులు తిప్పి,
కణతలకు నొక్కుకుని మెటికెలు విరిచి, పాలబుగ్గన
ముద్దిచ్చి, గృహకృత్యాలలో పడిన యశోద కళ్ళు గప్పి, ఇరుగుపొరుగుల
ఇళ్ళలో దూరేవాడు నల్లనయ్య. గోపికలు పెరుగు చిలుకుతూ ఉంటే కవ్వాన్ని గట్టిగా
పట్టుకుని ఆపి వెన్న పెట్టమని మాటి మాటికీ నిర్భంధించేవాడు. “కన్నయ్యా, ఏదీ ఒక మారు నృత్యం
చేస్తివా.. ఇదిగో ఈ వెన్నముద్ద నీ
చేత పెడతా”మని గోపికల చేత అడిగించుకుని
ఘల్లుఘల్లుమంటున్న గజ్జెలతో, మొలనూలి మువ్వలతో, మొలక నవ్వు చిందులేస్తున్న ముద్దు మోముతో.. ఆడి కనువిందు చేసేవాడు.
మైమరచి చూస్తున్న గోపికల చేత వెన్న ముద్దను తటాలున చేజిక్కించుకొని ‘గున్న ఏనుగు తొండం
చివర మెరిసే తెల్లకలువ మొగ్గవలే‘ అందాలు చిందే తన చేత వెన్నముద్దను చూపుతూ, నవ్వుతూ పరుగులు
తీసేవాడు.
అందరి ఇళ్ళలోనూ చక్కగా కాగిన పాలు, రాయి వలే తోడుకున్న
పెరుగు, నేయి, వెన్న, మీగడ తను తిన్నంత తిని స్నేహితులకు పెట్టి మిగిలిన కుండలు పగులగొట్టి
పాలన్నీ నేలపాలు చేసి వెళ్ళేవాడు. ఎంతో ఎత్తున ఉట్లలో జాగ్రత్తగా పెట్టుకున్న
వెన్న కడవలకు తూట్లు పొడిచి నవనీతం యధేచ్ఛగా ఆరగించేవాడు. ఇన్ని దొంగిలించి
భోంచేసినా, ఏమీ ఎరుగని వాని వలే తల్లి ఒడిలో చేరి పాలిమ్మని మారాం చేసేవాడు.
తనతో పాటు బలరాముడు, మిగిలిన గోపబాలురను
వెంటపెట్టుకుని “మీరు ఆవులు, నేను ఆబోతును” అని రంకెలు వేసే వాడు. “నేను రాజును, మీరు నా
భటులు” అని రాజ కార్యాచరణకు ఉపక్రమించేవాడు. “నేనేమో దొంగను, మీరు
గృహస్థులు” అని నిద్రపోతున్నట్టు నటిస్తున్న వారి సొమ్ములు అపహరించి, ఎవరికీ తెలియని
స్థలంలో దాచి తనూ దాగేవాడు. చేతి బంతులతో ఆటలు, ఉయ్యాలలు, దాగిలిముతలు
ఇలా అనేకవిధాలైన ఆకతాయి ఆటలు ఆడుతూ గొల్లపల్లెలో వాడవాడల గగ్గోలుగా పరుగులు
తీసేవాడు.
గోపకిశోరుని అల్లరిపనులను గొల్లెతలు
తాళలేక యశోదతో మొరపెట్టుకున్నారు..” ఓ యశోదమ్మా! నీ ముద్దులపట్టి వల్లమాలిన
అల్లరితో మమ్ములను బతకనీయడం లేదమ్మా! మా కడవల్లో ఎర్రగా కాగినపాలన్నీ తన తోటి
వారికి పోసి, తాను తాగి వెళ్ళిపోతే బాగుండేది. కడవలన్నీ ముక్కలుచేసి మిగిలిన
పాలన్నీ నేలపాలు చేయడమేమైనా పిల్ల చేష్టా? పసివారికి పాలులేవని బాలెంతలు వాపోతూ ఉంటే, మీ వాడు లేగదూడలను
విడిచిపెట్టి మా ఆవుల పొదుగుల్లో చుక్క పాలు మిగులనివ్వడు. ఈ అల్లరికి హద్దుందా?
బాలురకు బాలు లేవని, బాలింతలు మొఱలువెట్ట పకపక నగి యీ
బాలుడాలము
సేయుచు, నాలకు
గ్రేపులను విడిచె నంభోజాక్షీ!
వట్టి పసివాడని భ్రమసేవేమో! ఉట్టి మీద
కుండలని అందుకోడానికి రోళ్ళు, పీటలు ఒక దానిపై ఒకటి పెట్టి ఎక్కేస్తాడు. తిన్నంత తిని కుండలకు
తూట్లు పెట్టడమేమిటో? ఏమైనా బాగుందా? పోనీ వెళ్ళేవాడు వెళ్ళిపోకుండా నిదురిస్తున్న ఓ కోడలి మూతికి
కాస్త వెన్న రాసి పోయాడు. దొంగిలించినది కోడలేనని అనుకుని అత్త నింద మోపిందని, అత్తాకోడళ్ళూ సిగపట్లు
పట్టుకున్నారు. ఇంకొక ఇల్లు దూరి పాలన్నీ గుటుకు గుటుకు తాగి ఆ కుండలు వేరొక చోట
విడిచి వచ్చాడట! ఆ రెండు కుటుంబాల పోరూ అంతా ఇంతా కాదు. మైమరచి నిద్రిస్తున్న ఆమె
కొడుకు పిలకకు లేగదూడ తోకని ముడి వేసి దాన్ని వీధిలోకి తోలాడట నీ ముద్దుల
కృష్ణుడు! ఏమైనా చిన్న ఆగడమా ఇది! వీధి చివర ఆడుకుంటున్న ఓ పిల్లాడి కుత్తుక వరకూ వెన్న
బలవంతంగా తినిపించాడట! మా పిల్లలు పిల్లలు కారా? మేము ఈ
గొల్లపల్లెలో బతకాలా, వద్దా?” అని ప్రశ్నించారు.
బిత్తర పోయి చూస్తున్న యశోద ముందుకు..
దురుసుగా ఒక అడుగు వేసిన ఓ గొల్లెత “ఓ యశోదమ్మా! మేము మీ అంత భాగ్యవంతులము
కాదమ్మా! పది కడవల పాలు నేల దొర్లించి కడవలను పిండి చేసాడు. “నువ్వేం
చేస్తున్నావని” నా మొగుడు నన్ను తిట్టిపోసాడు. తాళం పెట్టిన ఇంట్లో ఎలాదూరాడో, నీ మాయ
పిల్లడు!” అని వాపోయింది. మరో గొల్ల పడుచు “మా లేగలు, ఆవులను ఒక చోట
చేర్చి పెద్ద పెద్ద బొబ్బలు పెట్టాడు నీ కొడుకు! అవి బెదిరి అడవిలోకి పరుగులు తీసాయి. ఎంత
వెతికినా కనిపించలేదు. మేమెలా బతకాలో నువ్వే చెప్పు!”అని కన్నీళ్ళు
పెట్టుకుంది.
ఓయమ్మ నీ కుమారుడు మా
యిండ్లను బాలుబెరుగు మననీడమ్మా
పోయెదమెక్కడికైనను, మాయన్నల
సురభులాన మంజులవాణీ!
“అందరూ కలిసి వేరే ఎక్కడికైనా వలసపోతాం, నువ్వూ, నీ గారాల కృష్ణుడూ
ఒంటరిగా ఈ గొల్లపల్లెలో ఉట్టికట్టుకు ఊరేగండని” కోపంగా
చెప్తున్న వారికి మంచి మాటలు చెప్పి,
‘నా బిడ్డ నా చన్ను వీడి రాడ‘ని ఒట్లు పెట్టి, వారిని శాంతింపచేసి
ఇళ్ళకు పంపించింది యశోదమ్మ.
ఇంటికి వచ్చిన కన్నయ్య అన్యమనస్కంగా
కూర్చున్న అమ్మ ఒడిలో దూరి “ఆకలేస్తోందమ్మా! పాలివ్వవూ!” అని ఒక చేత్తో
ఆమె కొంగు లాగుతూ, మరో చేతిని ఆమె గడ్డం కింద ఉంచి ముద్దు ముద్దుగా బతిమాలాడు. కరిగి
నీరైన ఆ తల్లి చప్పున కన్నయ్యకి పాలివ్వనారంభించింది. పాలునిండిన బొజ్జతో ఆయాస
పడుతూ, పాలచారికలతో మెరిసే బుగ్గలతో అమాయకంగా తననే చూస్తున్న కృష్ణునితో
“కన్నయ్యా! పాలు తాగి మనింట్లోనే ఉండి ఆడుకోరాదా? ఎందుకు ఇరుగుపొరుగు
వారి మాటలు పడుతున్నావు! నా వద్ద పాలెప్పుడూజాలై
ప్రవహిస్తున్నవి కదా! “తల్లిపాలు గుక్కెడు – మిగిలినవి పుట్టెడు సరిసమాన”మన్న
నానుడి నా పట్ల బొంకైనదేల! ఎందుకు నీకింతటి లేనిపోని రొష్టు?” అని
ప్రశ్నించింది. మారాడక తల్లి గుండెలపై తల ఆన్చి కనులు ఓరగా మూసుకుని నిద్రపోయాడు
కన్నయ్య.
తెల్లారిందో లేదో “అమ్మా! తమ్ముడు
మన్ను తిన్నాడని” బలరాముడు పరుగున వచ్చి చెప్పాడు. నిన్న చెప్పిన సుద్దులు
అప్పుడే పెడచెవిన పెట్టాడన్న కోపంతో పరుగు పరుగున కన్నయ్య వద్దకు వెళ్ళింది యశోద.
“కన్నా! మన్ను తిన్నావా? నీకు ఆకలైతే పాలూ, వెన్నా లేవా? అతి రుచికరమైన
భక్ష్యాలు ఎల్లవేళలా ఇంట్లో ఉంటాయి కదా! మన్ను తినాల్సిన అగత్యమేమొచ్చింది?” అని
గద్దించింది.
“లేదమ్మా.. అన్న కొండేలు చెప్తున్నాడు. నేనేమైనా
వెర్రి వాడినా? కొంటె పనులు మానేసానమ్మా! వీళ్ళందరూ నాపై చాడీలు చెప్తున్నారు. నమ్మకం
కుదరని దానివైతే ఇదిగో.. నా నోరు చూడు!” అని ముత్యాల పాల పలువరుసతో, ఎర్రనెర్రని చిట్టి
నాలుకతో ప్రకాశిస్తున్న నోటిని తెరచి చూపాడు.
యశోద కృష్ణుని నోటిలోకి తేరిపారా
చుసింది. ఎక్కడా మన్ను జాడలేదు. కానీ సూర్యచంద్రులూ, తారకలూ, గ్రహాలూ, సప్తసముద్రాలతో, పర్వతాలతో
కళకళలాడుతున్న విశాలవిశ్వం సాక్షాత్కరించింది. ఆ మాయ ‘కలో, నిజమో!‘ తెలియనిదై నందుని
ఇల్లాలు చిగురాకువలే వణికింది.
కలయో వైష్ణవమాయయో యితర సంకల్పార్థమో సత్యమో
తలపన్
నేరకయున్నదాననో యశోదాదేవి గానో పర
స్థలమో
బాలకుడింత యాతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై
యుండుటకేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపగన్
“తన ఎదుట ఉన్నది సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే”నని తెలుసుకుని
కైమోడ్చి నమస్కరించింది. తృటిలో తన తల్లికి ఆ స్మృతి తొలగి మామూలుగా అయ్యేలా మాయ
చేసాడు కన్నయ్య.
“అలాంటి కన్నయ్యని సామాన్యుడని తలచి ఎన్ని మాటలన్నాము! ఎన్ని పేర్ల
పిలిచాము, మన పాపానికి నిష్కృతి లేదు. కృష్ణుడే దయ చూపి మనని అక్కున
చేర్చుకోవలసినదే కానీ, మనం చేసేదేమీ లేదని” పదే పదే అనుకుంటూ కాత్యాయనికి పూజ పూర్తి
చేసుకున్నారు గోపవనితలు. యమున ఒడ్డున కూర్చుని ఇప్పుడేమి చేద్దామన్నట్టు ఒకరినొకరు
చూసుకున్నారు.
“చెలియలూ! గోవిందుని శరణనడం తప్ప మనం చేయగలిగినదేమీ లేదు. అతడెక్కడ
లేదు కనుక! వెర్రి పొలతులమై ఆ ఇంట్లో ఉన్నాడని, ఈ తలుపు వెనుక
ఉన్నాడని తలచి మేలుకొలుపులు పాడాము. వెర్రి కోరికలు కోరాము. “పరవాద్యము తప్ప
వేరేదీ అక్కర్లేదని” మనసారా కృష్ణుని తలచి కలసి వేడుకుందాం.” అని
చెప్పింది ఆనందిని. “ఔనని, కృష్ణుడే శరణమ”ని ఏకకంఠంతో పాడసాగారు గోపవనితలు.
చీకాకు పడకూ – చిడుముడి పడకూ-
నీ
కరుణ వినా మాకేమున్నది చెప్పు?
మా పున్నెము వలన గదా
మా
కోసమె గాదా, మా
గోపకులములోన
దిగి
గోవిందుడవైనావు!
గోవులవెంబడి ఏవో
కోనలలో
కానలలో, బడి
పోవు
వట్టి వెర్రి గొల్ల
పొలతులము
చిన్ని పేర పిలిచాము ఎన్నొ మాటలన్నాము
ఎన్ని
జన్మమములదో ఈ వీడని మన బంధము
ఇక
దయచేయుము వరము పరవాద్యము
చీకాకు పడకు చిడుముడి పడకు
నీ
కరుణ వినా మాకేమున్నది చెప్పు!
“కృష్ణా! ఆశ్రిత వత్సలా! మాకేమీ తెలియదు. కుడిఎడమల తేడా ఎరుగని వెర్రి
గొల్లలం. గోవుల వెంట కొండల్లో తిరిగే మా పున్నెం ఎంత గొప్పదో..! మా మధ్య మా వాడివై
పుట్టావు. నీ అసలు రూపం తెలుసుకొనుట నీ తల్లికే సాధ్యపడలేదు. మా వల్లనయేదా చెప్పు!
ఎన్ని మాటలన్నామో, ఎన్ని పేర్లతో పిలిచి నిన్ను చిన్నతనపరిచామో! మా యందు దయ ఉంచాలే తప్ప
మాదేమీ లేదు. సూర్యుని కాంతి వీడనట్టు,
పూవుని పరిమళం వీడిపోలేనట్టు నిన్ను విడిచి మేమూ
లేము. మా వ్రత సంపూర్తికి పర వాద్యము వరమివ్వాల్సిన వాడివి నువ్వే!” అని
వేడుకున్నారు.
అమర్యాదః క్షుద్రః చలమతిః అసూయా ప్రసవభూః
కృతఘ్నో, దుర్మానీ
స్మరపరవశో వంచన పరః
నృశంసః
పాపిష్ఠః కథమిహమితో దుఖః జలధేః
అపారాత్
ఉత్తీర్ణః తవ పరిచరేయం చరణయోః
“మర్యాద లేని వాడను, క్షుద్రుడను, చంచలమైన మనస్సు కలిగిన వాడను, అసూయ నిండిన మనసుతో పుట్టిన వాడను, కృతఘ్నుడను, మానము లేని వాడను, కామపీడితుడను, వంచనపరుడను, చెడ్డమాటలాడేవాడను, పాప కార్యాలను
చేసేవాడను.. ఇన్ని దుర్గుణాలున్న నన్ను దుఖఃజలధి దాటించే నావ నీ చరణములే!”
అని ఒప్పుకుని శరణన్న వాడికి పరమాత్మ క్షణమైనా వీడి ఉండలేడు. “అమ్మా.. తప్పు
చేసాను.” అని ఒప్పుకున్న వాడిని అక్కున చేర్చుకుని కన్నీరు తుడిచేదే తల్లి..
కదూ!
(పరవాద్యము దక్కేనా? రేపు చూద్దాం!)
(ఆండాళ్ “తిరుప్పావై” పాశురాలకు, దేవులపల్లి
కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత)
(ఆండాళ్ “తిరుప్పావై”, బమ్మెర పోతనామాత్య
ప్రణీత “శ్రీమదాంధ్ర భాగవతము”, పిలకా గణపతి శాస్త్రి గారి “హరి వంశము”
ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)