Kanchi Mutt 40-day special
worship on the eve of Jan 22 Consecration
జనవరి 22న అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి
నూతన మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం (Ram
Temple Consecration Ceremony) సందర్భంగా
అదేరోజు నుంచి 40 రోజుల పాటు కాశీలోని కంచి కామకోటి పీఠానికి (Kanchi Kamakoti Mutt) చెందిన యజ్ఞశాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ విషయాన్ని పీఠాధిపతి
విజయేంద్ర సరస్వతి (Vijayendra
Saraswati) ఇవాళ కాంచీపురంలో వెల్లడించారు.
శంకర ఆమ్నాయ పీఠాలకు చెందిన నలుగురు
శంకరాచార్యులు అయోధ్య కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి కారణం వారి అసంతృప్తులే
అని దుష్ప్రచారం జరుగుతున్న సమయంలో కంచి కామకోటి పీఠాధిపతి ప్రకటన ప్రాధాన్యం
సంతరించుకుంది.
‘‘శ్రీరామచంద్రప్రభువు ఆశీస్సులతో
అయోధ్యలో జనవరి 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఆ మహత్తరమైన
సందర్భాన్ని పురస్కరించుకుని కాశీలో ఉన్న
మా మఠానికి చెందిన యజ్ఞశాలలో అదే రోజు నుంచి 40 రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు
జరుగుతాయి. లక్ష్మీకాంత్ దీక్షిత్ సహా వేదపండితుల మార్గదర్శనంలో ఆ మండలదీక్ష జరుగుతుంది’’
అని కంచి కామకోటి పీఠాధిపతి ప్రకటన వెల్లడించింది.
‘‘ప్రాణప్రతిష్ఠ రోజున మొదలుపెట్టి వందమందికి
పైగా వేదపండితులు యజ్ఞశాలలో మండలకాలంపాటు పూజలు, హోమాలు చేస్తారు. ప్రధానమంత్రి
నరేంద్రమోదీ దేశమంతటా పుణ్యక్షేత్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన
నేతృత్వంలోనే కేదారనాథ్, కాశీ విశ్వనాథ దేవాలయాల విస్తరణ కార్యక్రమాలు జరిగాయి’’
అని విజయేంద్ర సరస్వతి స్వామి చెప్పారు.
జనవరి 22న అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహానికి
ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుంది. దానికి వారం రోజుల ముందు నుంచీ అంటే
జనవరి 16 నుంచీ వైదిక సంప్రదాయబద్ధమైన ముందస్తు కార్యక్రమాలు మొదలవుతాయి.
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధానమంత్రి
నరేంద్రమోదీ చేతులమీదుగా జరుగుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మోదీ నిన్న
శుక్రవారం నుంచి 11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం చేపట్టారు. ‘‘అయోధ్యలో బాలరాముడి
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఇంక 11 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ పవిత్ర సందర్భాన్ని
సాక్షీభూతుడిగా సందర్శించే అదృష్టం నాకు దక్కింది. ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో
దేశవాసులు అందరి తరఫునా పాల్గొనే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. దాన్ని దృష్టిలో
ఉంచుకుని ఇవాళ్టి నుంచీ నేనొక ప్రత్యేకమైన అనుష్ఠానం మొదలుపెడుతున్నాను. ఈ పదకొండు
రోజులూ అనుష్ఠానంలో ఉంటాను. దానికి మీ అందరి ఆశీస్సులూ కోరుకుంటున్నాను’’ అంటూ
మోదీ శుక్రవారం ఒక ఆడియో సందేశం విడుదల చేసారు.
ఇలాంటి చారిత్రక సంఘటనలో
భాగస్వామి కావడం తన అదృష్టమని మోదీ చెప్పారు. ‘‘ఇటువంటి అనుభూతి నా జీవితంలో మొదటిసారి
కలుగుతోంది. నేనొక విభిన్నమైన భక్తిభావంతో పులకరించిపోతున్నాను. నా వరకూ నాకు ఈ
భావోద్వేగ ప్రయాణం వివరించగలిగేది కాదు, గ్రహించగలిగేది మాత్రమే. ఆ ఉద్వేగపు
గాఢతను, విస్తృతిని, తీవ్రతను నేను మాటల్లో చెప్పలేను. నా పరిస్థితిని మీరు సరిగ్గా
అర్ధం చేసుకోగలరు. ఎన్నో తరాలు కన్న కలను సాకారం చేసుకునే అవకాశం నాకు లభించింది’’
అని మోదీ తన సందేశంలో వివరించారు.