సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళ విపక్షాల ఇండీ కూటమి ఢిల్లీలో సమావేశమైంది. వర్చువల్‌గా ఈ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇండీ కూటమి (I.N.D.I.A.alliance) అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇండీ కూటమి అధ్యక్ష పదవికి జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా పోటీ పడ్డారు. కూటమి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులే ఉండాలని నితీశ్ భావించడంతో, ఖర్గే పేరు ఖరారు చేశారు. నితీశ్‌కు కన్వీనర్ పదవి అప్పగించాలని కూటమి భావించినా, దాన్ని ఆయన తిరస్కరించారు.
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ సీట్ల సర్ధుబాట్లు, కూటమిలోని పార్టీలను బలోపేతం చేయడంలాంటి అంశాలపై నేతలు చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ ఈ వర్చువల్ సమావేశానికి హాజరుకాలేదు.