సంక్రాంతి
తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు నెలల పాటు సందడి వాతావరణం కొనసాగనుంది.
సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడటంతో రాష్ట్రంలో రాజకీయం రంజుగా మారింది. అత్యంత
ఖరీదైన ఎన్నికలకు కేరాఫ్‌గా నిలిచే రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఈ
సారి ఓ పట్టాన అంతుబట్టడం లేదు. గెలుపోటములపై అంచనాకు రావడం కష్టంగా మారింది.
సిట్టింగ్‌లను
బదిలీ చేస్తోన్న వైసీపీ అధినేత జగన్, అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా తన
వ్యూహాలకు పదును పెడతున్నారు. సిట్టింగ్‌లు, సీనియర్ల అభిప్రాయాలతో సంబంధం లేకుండా
హైకమాండ్ నిర్ణయమే అంతిమంగా ముందుకెళుతోంది. మరో వైపు ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసి
పట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, మిత్రపక్షం జనసేన కలసికట్టుగా అడుగులేస్తున్నాయి.
మరోవైపు బీజేపీ కూడా క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలతో మమేకం అవుతోంది. మోదీ చరిష్మాతో
రాష్ట్రంలో ప్రభావం చూపేందుకు శక్తివంచన లేకుండా పోరాడుతోంది.
ప్రభుత్వ
వ్యతిరేకతను చీల్చి లబ్ధిపొందేందుకు పాలక వైసీపీ కొత్త ఎత్తులు వేసింది సిట్టింగ్
ఎమ్మెల్యేల స్థానాలను మార్చేసింది. గడిచిన ఆరు నెలలుగా ఎమ్మెల్యే పనితీరును అంచనా
వేసిన వైసీపీ కోర్ కమిటీ, ఐ ప్యాక్ టీమ్ అందజేసిన నివేదికలకు అనుగుణంగా రాష్ట్ర రాజకీయాల్లో
ఎన్నడూ లేని విధంగా సంచలనాలకు తెరలేపింది. రెండు, మూడు మార్లు గెలిచిన
ఎమ్మెల్యేలకు కూడా స్థానభ్రమణం కల్పించింది.
ఎమ్మెల్యేలను లోక్ సభలో బరిలో ఎంపీలను
శాసనబరిలోకి దించేందుకు సిద్ధమైంది.
ఇప్పటికే
మూడు విడతలుగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలకు ఇంచార్జీలను ప్రకటించిన వైసీపీ
హైకమాండ్
కొందరు
సిట్టింగ్ లకు సీటు లేదని తేల్చి చెప్పింది. దీంతో వారంతా వేరే పార్టీ పంచనచేరడం
మినహా వేరే దారి లేకుండా పోయింది. అయితే సిట్టింగ్ స్థానంతో పాటు టికెట్ కోల్పోయిన
అభ్యర్థల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. దీంతో వైసీపీ పదేపదే
చెప్పే సామాజిక న్యాయం ఇదేనా అంటూ బాధిత అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
ఓట్ల కోసం
బీసీల జపం చేస్తోన్న వైసీపీ, బలమైన బీసీ నేతలను పక్కన పెడుతోందని ఆరోపిస్తున్నారు.
ఆర్థికంగా బలంగా ఉన్న ఇతర రంగాల్లోని ప్రముఖలకు తమ సీట్లు ఎందుకు
కట్టబెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. తమను రాజకీయంగా కోలుకోలేని దెబ్బ కొడుతున్నారని
ఆవేదన చెందుతున్నారు. దీంతో పార్టీలో అసంతృప్త స్వరాలు ఎగసిపడుతున్నాయి.
ప్రచార
పర్వంలో పాలక వైసీపీ ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఒకటి తమ ప్రభుత్వం ఇప్పటి
వరకు అందజేసిన సంక్షేమ పథకాలను పదే పదే నొక్కి చెబుతోంది. పథకాల ద్వారా లబ్ధి పొందిన
వారు వాటి కొనసాగింపు కోసం తమకు అండగా నిలవాలని కోరుతున్నారు. మరో వైపు టీడీపీ-జనసేన
కూటమికి చెక్ పెట్టేలా అభ్యర్థులను బరిలో నిలపడంతో పాటు ఆ కూటమికి వ్యతిరేకంగా
ప్రచారం చేయడం ఇప్పటికే ప్రారంభించింది.
పేదలు-
పెత్తం దారుల మధ్య యుద్ధం అనే నినాదంతో ముందుకుసాగుతున్న జగన్, వైసీపీ అధికారంలో
లేకపోతే రాష్ట్రంలో సంక్షేమమనే పదం
వినపడదని ప్రజలకు చెబుతున్నారు.
ఏడాది
వరకు వైసీపీ పరిస్థితి బాగానే ఉంది. కానీ రాను రాను ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతుంది.
గతం కంటే సీట్లు తగ్గినా మళ్ళీ అధికారం తమదేనని వైసీపీ గతంలో చెప్పినంత బలంగా
ఇప్పుడు చెప్పలేకపోతోంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ క్యాడర్ లో అసహనం
పెరిగింది. వర్గపోరుకు తోడు ప్రభుత్వ వ్యతిరేకతతో కునారిల్లుతోంది.
2019లో
వైసీపీకి ఓటు వేసిన సామాజికవర్గాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా దూరం అవుతున్నాయి.
నిరుద్యోగ
సమస్యను పరిష్కరించడంలో వైసీపీ విఫలమైందని ఆయా వర్గాలు ఆగ్రహంగా ఉన్నాయి.
నవరత్నాలతో నష్ట నివారణ చేయవచ్చు అనుకున్న వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది.
దళిత,
మైనారటీ, కాపు వర్గాల ఓటర్లలో ఏర్పడిన చీలిక స్పష్టంగా కనబడుతోంది. ప్రజావ్యతిరేకత
పెద్ద ఎత్తున ఎగసిపడుతోంది.
ఆంధ్రప్రదేశ్
ఓటర్లలో పావుశాతమున్న కాపులు ఈ సారి పాలనలో వాటా కోరుకుంటున్నారు. అందుకు
జనసేనకు ఆ వర్గాలు అండగా నిలవబోతున్నాయి.
మొత్తం
175 స్థానాల్లో 75 చోట్ల కాపు, ఒంటరి, బలిజ కులాలు ప్రభావశీలంగా ఉన్నాయి.
దీంతో
ఆయా సామాజికవర్గాల్లోని శ్రీమంతులు, ప్రజాకర్షక నేతలకు టికెట్లు ఇచ్చేందుకు వైసీపీ
సిద్ధమైంది. కాపునేత ముద్రగడకు టికెట్ ఇచ్చేందుకు సుముఖత తెలిపింది. కానీ ఆయన
జనసేనలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ
ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో బోల్తా కొట్టడం ఖాయమని పలు సర్వే
సంస్థలు చెబుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ
జరగగా, ప్రతిపక్ష కాంగ్రెస్ లాభ పడిందని, ఇక్కడ కూడా వైసీపీ, బీజేపీ బదులు
టీడీపీ-జనసేన కూటమి నెగ్గుతోందని అంచనా వేస్తున్నారు.
గ్రామీణ
ప్రాంతాల్లోని మహిళల ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా ఉంటుందని వైసీపీ ధీమా గా ఉంటే
దానికి ప్రతిగా పట్టణ ఓటుబ్యాంకుపై కూటమి కన్ను వేసింది.
కుదిరితే
కూటమిలో భాగస్వామి లేదంటే ఒంటిరిగా పోటీ చేసైనా ప్రభావం చూపాలని బీజేపీ
పోరాడుతోంది. రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు
చేస్తున్నారు. కేంద్రమంత్రుల పర్యటనలు కూడా బీజేపీకి మేలు చేసేలా ఉన్నాయి. రాష్ట్ర
ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో కేంద్రం వాటాను వివరిస్తున్నారు. పేదలు, రైతుల కోసం కేంద్రం
అమలు చేస్తోన్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. బీజేపీకి అధికారం ఇవ్వాలని
కోరుతున్నారు.
ఇక
రాష్ట్రంలో కనుమరుగైపోయిందనకున్న కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ పుంజుకునే
అవకాశమొచ్చింది. వైఎస్ షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే ఆ పార్టీ కూడా
ఆంధ్రా రాజకీయాల రేసులోకి వస్తోంది. వైసీపీ టికెట్ దక్కని నేతలు ఈ సారి హస్తం
గుర్తుపై పోటీ చేసే అవకాశముంది. షర్మిల రాకతో దళిత క్రైస్తవుల ఓట్లతో పాటు ఆ
పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు మళ్లీ కాంగ్రెస్ వైపు నిలిచే
అవకాశముంది. దీనికి తోడు ప్రత్యేక హోదా
హామీ ఆ పార్టీకి కాస్తాకూస్తో మేలు చేస్తోందనే విశ్లేషణలు ఉన్నాయి.