నెల రోజులపైగా అంగన్వాడీలు చేస్తోన్న సమ్మెకు (anganwadi workers strike) పరిష్కారం లభించలేదు. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వంతో అంగన్వాడీలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలంటూ అంగన్వాడీలు పట్టుబట్టడంతో సమస్యకు పరిష్కారం లభించలేదు. 2024 జులైలో జీతాలు పెంచుతామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చినా అంగన్వాడీలు వెనక్కు తగ్గలేదు. పదవీ విరమణ ప్రయోజనాలు కొంత మేర పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
ఇప్పటికే అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన రోజు నుంచి పది రోజుల్లో విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు పోతాయంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. సమ్మె చేయగానే డిమాండ్లు నెరవేరడానికి, ఇది ఫ్యాక్టరీ కాదంటూ సజ్జల విమర్శించారు. విధుల్లో చేరకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుందని అంగన్వాడీలను హెచ్చరించారు. సమ్మె కొనసాగిస్తే ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చిన హామీలు కూడా అమలు కావని సజ్జల చెప్పడంతో అంగన్వాడీల సమ్మె మరింత తీవ్రరూపం దాల్చింది. సంక్రాంతి తరవాత నిరాహారదీక్షలకు దిగుతామని అంగన్వాడీ నేతలు హెచ్చరించారు.