ప్రముఖ
జ్యోతిర్లింగ క్షేత్రం, శైవక్షేత్రమైన శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రికి ధ్వజారోహణ కార్యక్రమాన్నిశాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
ఉత్సవాల
సందర్భంగా ప్రతీరోజు ఆదిదంపతులకు వాహన సేవలు జరుగుతాయి. రేపు భృంగివాహనసేవతో పాటు
ప్రాకరోత్సవం నిర్వహించనున్నారు.
భోగి పర్వదినం రోజున ఉదయం 10 గంటలకు అక్కమహాదేవి
అలంకార మండపంలో ఐదేళ్ళ లోపు చిన్నారులకు ఉచిత సామూహిక భోగిపండ్లు పోసే కార్యక్రమం
నిర్వహిస్తారు. సంక్రాంతి రోజు మహిళలకు ప్రత్యేకంగా ఆలయ దక్షిణ మాడవీధిలో ముగ్గులు
పోటీ నిర్వహించనున్నారు.
మకర సంక్రమణం
రోజున గంగాపార్వతీ సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం జరగనుంది.
పుష్పోత్సవం,
శయనోత్సవ సేవా కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు జనవరి 18న ముగుస్తాయని ఆలయ ఈవో పెద్ది
రాజు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆర్జిత హోమాలు నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఇక
ప్రతీ మంగళవారంతో పాటు అమవాస్యనాడు శ్రీ బయలు వీరభద్రస్వామికి విశేష అర్చన
జరపనున్నారు. ఈ స్వామిని ఆరాధించడం ద్వారా గ్రహదోషాలు నివారించబడటంతో పాటు ,
క్లిష్ట సమస్యలు సైతం పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకం, ప్రమాదాలు నివారించబడి,
సర్వ కార్యానుకూలత చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పరోక్షసేవ జరిపించే భక్తులు
ఆన్లైన్లో రూ.1,116 సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు
8333901351ను సంప్రదించవచ్చు అని తెలిపారు.