రవాణా నౌకలే లక్ష్యంగా చెలరేగిపోతోన్న హౌతీల (us forces attack on houthis rebels) ఆగడాలకు చెక్ పెట్టేందుకు అమెరికా చర్యలకు దిగింది. హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా, బ్రిటన్ సైన్యాలు ఇవాళ ప్రతీకారదాడులు చేశాయి. యెమెన్లో హౌతీ స్థావరాలపై అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. భారీ యుద్ధనౌక నుంచి టొమాహక్ క్షిపణులతో అమెరికా సైన్యం విరుచుకుపడింది. తిరుగుబాటుదారుల శిబిరాలు, ఆయుధ నిల్వలే లక్ష్యంగా అమెరికా సైన్యం దాడులు చేసింది.
గత కొంత కాలంగా ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలే లక్ష్యంగా పేట్రేగిపోతున్నారు. నౌకలను హైజాక్ చేసి పెద్ద ఎత్తున నగదు డిమాండ్ చేస్తున్నారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అగ్రరాజ్యం కార్యాచరణకు దిగింది.
బ్రిటన్, అమెరికా సైన్యం నేరుగా దాడుల్లో పాల్గొన్నాయి. ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, నెదర్లాండ్ దేశాలు మద్దతు పలికాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు.
ప్రపంచంలోనే కీలక జలమార్గాల్లో ఎర్ర సముద్రం ముఖ్యమైంది. అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛా రవాణాను రక్షించడానికి దాడులు తప్పలేదని అమెరికా ప్రకటించింది. 2023 నవంబరు నుంచి ఇప్పటి వరకు హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో 27 నౌకలపై దాడులు చేశారు. అమెరికా ప్రతి దాడులపై యెమన్ స్పందించింది. దాడులకు తీవ్ర ప్రతీకార చర్యలుంటాయని హెచ్చరించింది.