Ram Temple Consecration Ceremony is a festival bigger than Deepavali
అయోధ్య నూతన రామమందిరంలో (Ayodhya Ram Mandir) బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం (Consecration Ceremony) దీపావళి కంటె పెద్ద పండుగ అని హైదరాబాద్ చిలుకూరు వేంకటేశ్వర ఆలయం (Chilkur Balaji Temple) ప్రధాన అర్చకులు రంగరాజన్ (Rangarajan) అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ ఆ రోజు గొప్పగా పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు.
‘‘జనవరి 22న అయోధ్య రామమందిరంలో బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. అది కేవలం మన దేశానికి మాత్రమే పండుగ కాదు, మొత్తం ప్రపంచానికే పండుగ. అయోధ్య, రాముడు అవతరించిన పవిత్రభూమి. అక్కడ రామమందిరాన్ని పునర్నిర్మించడం, బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుండడం మనందరికీ గొప్ప పండుగ. అది దీపావళి కంటె పెద్ద పండుగ’’ అని రంగరాజన్ చెప్పారు.
‘‘బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ జరిగే రోజును శ్రీరామనవమి పండుగలా జరుపుకోవాలని భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆరోజు సాయంత్రం కనీసం ఐదు దీపాలు వెలిగించండి. దేశం రామరాజ్యం కావాలని మనందరం ప్రార్ధిద్దాం. ఆ రోజు భక్తులందరం దీపోత్సవం (Deepotsavam) జరుపుకుందాం’’ అని రంగరాజన్ పిలుపునిచ్చారు.
జనవరి 22 మధ్యాహ్నం అభిజిన్ముహూర్తంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాలరాముడి విగ్రహాన్ని గర్భగృహంలో ప్రవేశపెడతారు. వారణాసికి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ అనే అర్చకులు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహిస్తారు.