తల్లులు, కుమారులకు సంబంధించి కొన్ని వీడియోలు అసభ్యంగా చిత్రీకరించి యూట్యూబ్లో పోస్ట్ చేయడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (youtube crime news) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ యూట్యూబ్ ఇండియాకు సమన్లు జారీ చేసింది. జనవరి 15న అలాంటి ఛానళ్ల జాబితాతో, తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. భారత్లోని యూట్యూబ్ పబ్లిక్ పాలసీ హెడ్ మీరా ఛాట్కు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమన్లు జారీచేసింది.
అసభ్యకర వీడియోల వల్ల చిన్నారుల భద్రత, వారి శ్రేయస్సుకు హాని కలుగుతుందని, మైనర్లు అసభ్య వీడియోలు చూడటానికి అనుమతించడం ఆందోళన కలిగిస్తోందని కమిషన్ సమన్లలో పేర్కొంది. ఇలాంటి వీడియోలను గుర్తించి వెంటనే తొలగించాలని , అందుకు మీరు ఎలాంటి విధానాలు అవలంభిస్తున్నారో కూడా వివరించాలని ఆదేశించింది. సమన్లకు స్పందించకపోతే అరెస్టులు తప్పవని హెచ్చరించింది.
తల్లులు, యుక్తవయసు పిల్లల సంభాషణలతో కొందరు అసభ్య వీడియోలు పోస్ట్ చేస్తున్నారని కమిషన్ ఛైర్మన్ ప్రియాంక్ కనూంగో ఆందోళన వ్యక్తం చేశారు. అశ్లీల కంటెంట్ పోస్ట్ చేసే వారిపై ఫోక్సో చట్టం కింద చర్యలుంటాయని హెచ్చరించారు. అశ్లీల వీడియోలతో వ్యాపారం చేయడం, అలాంటి వీడియోలను అమ్మడంలాంటి దారుణాలకు పాల్పడే వారిని జైలుకు పంపుతామని కనూంగో హెచ్చరించారు.