Advani to attend Ram Temple Consecration Ceremony
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రామమందిర
ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కీలక నాయకుడు లాల్‌కృష్ణ ఆఢ్వాణీ (Lal Krishna Advani) అయోధ్యలో బాలరాముడి
నూతన మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి (Ayodhya Ram Mandir Consecration Ceremony) హాజరవుతారు. ఆ విషయాన్ని విశ్వహిందూ పరిషత్
అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ (Alok Kumar, VHP) వెల్లడించారు.
అలోక్‌కుమార్, ఆర్ఎస్ఎస్ నాయకులు కృష్ణగోపాల్,
రాంలాల్ బుధవారం ఆఢ్వాణీ నివాసానికి వెళ్ళి ఆయనను రామమందిర ప్రాణప్రతిష్ఠ
కార్యక్రమానికి హాజరవవలసిందిగా మరోసారి ఆహ్వానించారు. దానికి ఆఢ్వాణీ
ఒప్పుకున్నారని అలోక్‌కుమార్ చెప్పారు. ఆఢ్వాణీ వయోభారం, అనారోగ్య పరిస్థితులను
దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేస్తామని కూడా అలోక్ కుమార్ చెప్పారు.
రామజన్మభూమి ఉద్యమంలో ఆఢ్వాణీతో పాటు పాల్గొని, ఉధృతంగా
ప్రచారం చేసిన మరో నాయకుడు మురళీ మనోహర్ జోషి (Murli Manohar Joshi) హాజరవుతారో లేదో అన్న సంగతి
తెలియరాలేదు. వారిద్దరికీ మొదట్లో ఆహ్వాన పత్రికలు అందజేసినప్పుడు వారు హాజరు కాబోరు
అన్నట్లు ప్రచారమయింది. అసలు వారిద్దరినీ శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్
ప్రతినిధులే రావద్దని చెప్పినట్లుగా దుష్ప్రచారం కూడా విస్తృతంగా చేసారు. అలాంటిదేమీ
లేదనీ, వారిద్దరూ కూడా వీలైనంతవరకూ తప్పకుండా అయోధ్య వెళ్ళడానికే సిద్ధంగా
ఉన్నారనీ విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసినా, ఆ దుష్ప్రచారం ఆగలేదు.
రామలల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం రోజుల్లోకి
వచ్చిన తరుణంలో విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు స్వయంగా ఈ ప్రకటన చేయడం ద్వారా
ఆఢ్వాణీ హాజరుపై తప్పుడు ప్రచారానికి తెరపడింది.