జై కిసాన్, జై జవాన్ అనగానే స్మరణకు వచ్చే వ్యక్తి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. ఇవాళ ఆయన 58వ వర్థంతి. కేవలం ఆయన ప్రధానిగా 19 మాసాలే పనిచేసినా, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి రెండవ ప్రధానిగా సేవలందించారు. నీతి, నిజాయితీకి ఆయన నిలువెత్తు సాక్ష్యం. సున్నితమైన ప్రవర్తనతో ప్రజల మన్ననలు పొందారు.
1964లో జవహర్లాల్ నెహ్రూ మరణం తరవాత, శాస్త్రి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికే లాల్ బహదూర్ శాస్త్రి, రైల్వే, హోం శాఖలు లాంటి కీలకమైన పదవుల్లో అనుభవం గడించారు. ఒక చిన్న రైలు ప్రమాదం జరిగితే దానికి బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయం ఆయన కాలం చేసి 58 సంవత్సరాల (lal bahadhur sastry 58th death anniversary) తరవాత కూడా నిత్యం ఏదొక రూపంలో గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.
లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబరు 2న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సమీపంలోని మొఘల్సరాయ్ గ్రామంలో జన్మించారు. అతని తండ్రి ఉపాధ్యాయుడు. శాస్తి ఏడాదిన్నర వయసు సమయంలో తండ్రిని కోల్పోయారు. వారణాసిలోని మామయ్య నివాసంలో ఉంటూ అక్కడే చదువు కొనసాగించారు. చిన్న వయసులోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తాడు. మహాత్మాగాంధీ పిలుపుతో పదహారేళ్ల వయసులోనే సహాయ నిరాకరణ ఉద్యమంలోకి దూకాడు.బ్రిటిష్ వారితో పోరాటంతో, ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో నాయకత్వ లక్షణాలను బాగా ఒంటపట్టించుకున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన తరవాత కీలక పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తిగా శాస్త్రి చరిత్రలో నిలిచిపోయాడు.
1964లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణంతో, లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని పదవి చేపట్టారు. 1965 యుద్ధంలో పాక్‌ను సమర్థంగా తిప్పికొట్టారు. అప్పట్లో ఆహార కొరత ఒక వైపు, యుద్దాలతో సతమతం అవుతోన్న దేశాన్ని గట్టెకించేందుకు, రైతుల్లో, సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు జైజవాన్, జైకినాస్ అంటూ శాస్త్రి ఇచ్చిన పిలుపు నేటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.
1966 జనవరి 11న రష్యా పర్యటనలో ఉండగా శాస్త్రి గుండెపోటుతో మరణించారు. దేశ ప్రజలను ప్రభావితం చేసిన అతి కొద్ది మంది ప్రముఖుల్లో శాస్త్రి చోటు సంపాదించారు. నీతి, నిజాయితీకి నిలువుటద్దంలా నిలిచారు.శాస్త్రి 58వ వర్థంతి సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఘన నివాలర్పించారు.