ఖలిస్తానీ
ఉగ్రవాది, సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో
వివరాలు అందజేసేందుకు అమెరికా నిరాకరించింది. హత్యకు యత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న
నిఖిల్ గుప్తా, న్యూయార్క్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, కేసుకు సంబంధించిన
ఆధారాలు ఇవ్వాలని కోరారు. అయితే అందుకు అమెరికా నిరాకరించింది.
నిఖిల్
గుప్తా అనే వ్యక్తి భారత దౌత్యాధికారితో కలిసి పన్నూ హత్యకు యత్నించినట్లు అమెరికా
ఆరోపిస్తోంది. గతేడాది జూన్ లో చెక్‌రిపబ్లిక్ అధికారులు అతడిని అరెస్టు చేసి
ప్రాగ్ జైల్లో ఉంచారు. అతడిని తమకు అప్పగించాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది.
అమెరికా
ఆరోపణల నేపథ్యంలో గుప్తా తరఫు న్యాయవాది న్యూయార్క్ లోని యూఎస్ డిస్ట్రిక్ కోర్టులో
పిటిషన్ వేశారు.
నిఖిల్ గుప్తాపై నేరాభియోగాలు మోపిన అమెరికా, అందుకు తగిన
సాక్ష్యాలను అందజేయలేదని వ్యాజ్యంలో పేర్కొన్నారు. న్యాయవాదులకు సమాచారం
అందజేయకుండానే నిఖిల్ గుప్తాను అమెరికా అధికారులు జైల్లో రెండుసార్లు విచారించారని
కోర్టుకు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వకుండా విచారించడం వెనుక
ఉద్దేశమేంటని ప్రశ్నించారు.
నిఖిల్‌గుప్తా
న్యాయవాది అభ్యంతరాలపై స్పందన తెలియజేయాలని
అమెరికా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీంతో నిఖిల్ గుప్తా న్యూయార్క్
కోర్టులో హాజరైనప్పుడు మాత్రమే ఆధారాలు అందజేస్తామని బదులిచ్చింది.
ప్రాగ్ జైల్లో నిబంధనలకు
అనుగుణంగానే నిఖిల్ గుప్తాను ప్రశ్నించినట్లు అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు
తెలిపారు.
భారత
అధికారితో కలిసి నిఖిల్ గుప్తా, పన్నూ హత్యకు కుట్ర చేయగా దానిని అమెరికా భగ్నం
చేసిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు
వచ్చాయి. వీటిని భారత దౌత్యాధికారులు ఖండించారు. పన్నూ హత్యకు కుట్ర కేసును అమెరికాకు
చెందిన దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. భారత్ కూడా ఓ కమిటీని
నియమించింది.