ధనుర్మాస ప్రత్యేక కథాస్రవంతి :25
మంచి వెన్నెల వేళ :: ఒక అమ కొమరుడవై, వేరొక అమ ఒడిలో
దాగి! ~ కాత్యాయనీ వ్రతం – 25
రచన : ‘కొత్తావకాయ’ సుస్మిత
**************************
ఒక లేమ అన్యమనస్కంగా చీరచెంగుని వేలితో
ముడి వేస్తోంది. మరో ముదిత ముంగురులు మాటిమాటికీ సర్దుకుంటోంది. మరో లలన కింది
పెదవి పదే పదే కొరుకుతూ, ఆలోచనలోంచి తేరుకోలేకపోతోంది. వేరొక చాన కృష్ణుని ఇంటి దారి పై నిలచిన
చూపు మరల్చలేకపోతోంది. వేరొక అతివ తత్తరపాటుతో తన చీరకుచ్చిళ్ళు తానే తొక్కుకొని
తూలబోయింది. ఇంకొక తరుణి కంపిస్తున్న చేతులతో పక్కనున్న భామిని చేతిని
నలిపేస్తోంది. “కాత్యాయని” పూజకి స్నానించి సిధ్ధమైన గోపవనితలలో, ఏ ఒక్కరి మనసూ
మనసులో లేదు. సైకత కాత్యాయని ప్రతిమను చూడగానే అమ్మని చూసిన పిల్లల్లా తమ మొర
వినిపించారు. “కన్నయ్య ఎంత మాయ చేసాడో!” చెప్పుకు బాధపడ్డారు.
“అతనికి అలవాటేగా!” అని కృష్ణుని మునుపటి చేష్ఠలు తలచుకున్నారు. పూజ
పూర్తి చేసుకుని “నీదే భారమని” కాత్యాయనికి మరిమరి చెప్పి కృష్ణుని
వద్దకు బయలుదేరారు.
“ఈ రోజు ఆ మాయవానికి లొంగిపోకూడదు. నిన్న కృష్ణుడు ఒక్క మాట కూడా
మాట్లాడలేదు. మీకేం కావాలని అడగలేదు. ఇవాళ మాత్రం మనకు కావలసినవి
అడిగేద్దాం.” ఒకరితో ఒకరు చెప్పుకుని దృఢ నిశ్చయంతో కృష్ణుని ముంగిలి చేరారు.
కృష్ణుడు నిన్న కూర్చున్న చోటే.. అదే
పైడిగద్దెనెక్కి కూర్చుని ఉన్నాడు. గోపబాలలను చూసి పలకరింపుగా నవ్వాడు! జర్రున
జారిపోతున్న మనసులను ఒడిసిపట్టి, పెదవులపైకి దూకేస్తున్న మందహాసాన్ని అదిమిపట్టి, ముఖరాజీవాలను
అలంకరించబోతున్న సంతోషాన్ని మరుగుపరచి.. బింకంగా నల్లనయ్య ఎదురుగా నిలబడ్డారు.
“పూబంతులూ.. కుశలమేనా?”
మరుని వింటినారి ఝుమ్మంది.
“ఊ..” అతిప్రయాసపై బదులుపలికారు. అతని
సమ్మోహన శక్తి సామాన్యమైనదా?
“వేగుచుక్క తోడుగా చక్కని చుక్కలు మేలుకొలిపేందుకు
వస్తే బాగుంది కానీ, చలి..!! ఇంత దూరం నడిచి వచ్చారే! అయ్యో!”
“హ్మ్..” బింకం సడలిపోతోంది. ఏ క్షణమైనా
దాసోహమనేసేలా ఉంది వారి పరిస్థితి.
“సరే! ఇంతకీ ఏ పని మీద వచ్చారు?” అమాయకంగా
ప్రశ్నిస్తున్న కృష్ణుడిని చూస్తే, ఉక్రోషం ముంచుకొచ్చింది గోప వనితలకి.
“నువ్వు రప్పించుకునే వాడివి! మేము రావాల్సిన
వాళ్ళమూను!” నిష్ఠూరంగా అన్నామనుకున్నారు.
“ఓహో! అవునా! హ్మ్.. పనేమిటో చెప్పారు కాదు!”
కొంటెనవ్వు కలనేసిన ప్రశ్న సంధించాడు. గుచ్చుకుంది.
“కృష్ణా! పరవాద్యమిస్తావని వచ్చాం. నిన్ను
అర్ధించి తీసుకెళ్దామని వచ్చాం.”
“అయ్యో! ఎంత మాట! అర్ధించడమా!! అయినా మీకు
ఇచ్చేంతటి వాడినా! ఏదో.. మీ ఇళ్ళలో పాలూ, వెన్నా దొంగలించి పెరిగిన వాడిని!” అమ్మకి
చెప్పిన చాడీలను మర్చిపోతాడా, వెన్నదొంగ! హన్నన్నా!!
“మీ అమ్మకి నీ మీద కొండెం చెప్పామనే కదా! అప్పుడు
తెలియదులేవయ్యా.. నువ్వింతటివాడివని!” ఉక్రోషంతో లలనల ముఖాలు ఎర్రబారిపోయాయి.
“ఇప్పుడైనా ఎంతటి వాడిని కనుక! గోవులు కాచే
గోపన్నని!!” అమాయకత్వం కన్నయ్యకి పెట్టని ఆభరణం మరి!
“నీ గురించి మాకు తెలియదనుకున్నావా?” ప్రశ్నించారు
వెర్రి గొల్లెతలు.
“నా గురించా.. ఏం తెలుసేంటి?” కవ్వించాడు
అల్లరి కృష్ణుడు.
“నీ పుట్టుపూర్వోత్తరాలు ఎరిగిన వాళ్ళం. మాకేం తెలియదనుకున్నావా? ఆయమ్మకు పదవ మాసం
ప్రవేశించిన పిదప ఐదు గ్రహాలు ఉచ్ఛ స్థానాలలో ఉన్న తరుణంలో శ్రావణ బహుళాష్టమి నాడు
రోహిణీ నక్షత్రమందు జన్మించావు. ఇసుమంతైనా ప్రసవవేదన కలగనీయక నల్లని ఉంగరాల వంటి
చిన్ని చిన్ని ముంగురులతో, తేనెసోనల వంటి చిరునవ్వుల చిందులతో, శ్రావణమేఘపు
వన్నెతో.. ఉదయభానుని వలే కన్నులపండువగా పుట్టిన నిన్ను చూసి ఆ తలిదండ్రులు ఎంత
మురిసి ఉంటారో!”
“ఊ..” తన చిన్ననాటి కబుర్లు వినాలనే ఆసక్తికి
లోకేశ్వరుడైనా అతీతుడు కాదేమో!
“కంసుని బారి నుండి నిన్ను కాపాడేందుకు ఓ తట్టలో పడుకోబెట్టి, తలకెత్తుకుని ఆ
అర్ధరాత్రి యమున దాటాడు.. నిను కన్న తండ్రి! నువ్వు సామాన్యుడివే అయితే..
మింటిధారలు నిన్ను తడపకుండా శేషుడు గొడుగై వెంట నడిచేవాడా!
మెత్తని ఇసుకదారి విడిచి యమున రెండుగా చీలిపోయేదా?”
“అవునా.. అప్పుడు!”
“ఈయమ్మ పొత్తిల్లో పడుకోబెట్టాడు. నవమాసాలూ మోసిన పున్నెం ఆమెదైతే, పాలిచ్చి.. నీ
ఊసులు, తారంగాలు, బోర్లా పడి పారాడే చిన్నెలు, తప్పటడుగులూ, పరుగులు, అల్లరి పనులు, అలకలూ, కబుర్లూ, కథలూ.. కనులారా
చూసి, సొంతం చేసుకోవడం.. ఈ తల్లి పుణ్యాల ఫలం!” తల్లుల పేర్లు
చెప్పకుండా రహస్యం రహస్యంగానే ఉంచి లౌక్యంగా మాట్లాడామనుకుని గర్వపడ్డారా
గొల్లపిల్లలు!
“నల్ల పిల్లాడినని వెక్కిరించారుగా!” ఎనిమిదేళ్ళ ముద్దుల బుజ్జాయి
ఉక్రోషంగా బుంగమూతి పెట్టుకుని అడుగుతున్నట్టే కనిపించి ఫక్కున నవ్వేసారు
గోపికలందరూ!
“నల్ల పిల్లాడివే! మట్టిలో పొర్లాడి, నోటి నిండా పాల
చారికలతో, వెన్న పూసుకుని, కాటుక అలికేసుకుని.. అబ్బెబ్బే.. నీలాంటి పిల్లాడిని మేమెక్కడా
చూడలేదమ్మా!” కన్నయ్యని ఉడికించారా భాగ్యశాలులు!
“పోన్లెండి.. అలాంటి వాడి వెంట ఎందుకు పడతారు మరీ? వెళ్ళండి.. మీరేమో
అన్నుల మిన్నలూ.. నేను నల్లనివాడిని..!” ‘నల్లనివాడు..
పద్మనయనమ్ముల వాడు.. నవ్వు రాజిల్లెడు మోము వాడు.. మౌళి పరిసర్పిత పింఛము వాడు..‘ అలుక నటించాడు. అలిగిన కృష్ణుని అందాన్ని
చూసి మురిసారా ముద్దు గుమ్మలు.
“కృష్ణా! సౌందర్యముద్రామణీ! త్రైలోక్య రక్షామణీ! నీ దొరతనాన్ని పొగిడే
మాటలు మాకెక్కడివీ! సిరి తనకు తానుగా వలచి పెండ్లాడిన సుందరుడివి! అనురాగపు గనివి!
నిను హింసించిన అసురులను దహించే మంటవు! అర్థులకు అమృతాల పంటవు!! నీ కల్యాణ గుణగానం
చేస్తూ.. మమ్మల్ని మేము మరచిపోతాం. నీ తీయని పేరు తలిస్తే చాలు.. విరహమైనా
మమ్మల్ని బాధించదు! మా పెద్దవారు చెప్పిన వ్రతానికి అవసరమైన పరవాద్యం మాకు ఇచ్చి
పంపు.”
అర్థులము, అనుగులము!
అంజలింప
వచ్చినాము
అడిగిన
వరమిడుదువని
అనురాగపు
గని వనీ!
ఒక అమ కొమరుడవై, వే
రొక అమ
ఒడిలో దాగి,
ఒదిగిన
నిను హింసింపగ
ఊహించిన
కంసునకు,
అసురునకు
కడుపు మంటవు!
అర్థులకూ
అమృతాల పంటవు!
సిరి కూడా వలచే నీ
దొరతనమూ, దోర్వీర్యము
పరవశమున
పాడి, పాడి
విరహమెల్ల
మరతుము!
పరవాద్యము
కరుణింపుము
పరమానంద
మొసంగుము!
నల్లనయ్య చల్లగా నవ్వాడు. “అపరంజి
బొమ్మలూ! మీ శ్రమని గుర్తించని వాడిని కాను కానీ.. మీరడిగిన వస్తువు ఉందో లేదో, మంచీ చెడూ చూడాలి
కదా! నాకు కొంచెం సమయం ఇవ్వండి. రేపు రండి.”
చేసేదేముందని వెనుతిరిగిన గొల్లపడుచుల్లో
కొందరికి కోపమొచ్చింది. “కృష్ణుని పొందాలని మనకే కానీ, అతనికి మనం అక్కర్లేదా?” అని
దురుసుగా ప్రశ్నించారు. వారిని వారించి సమాధాన పరిచారు ఆనందిని, సురభి.
“అమ్మాయిలూ! అన్నీ తెలిసినవాడు కృష్ణుడు. నందుడే
స్వయంగా “మీకు కృష్ణుడే సహాయపడగలడు.” అని చెప్పి మరీ కాత్యాయనీ
వ్రతానికి మద్దతు ఇచ్చాడు. నిర్విఘ్నంగా జరిగిపోతుంది. సంశయం వలదు.” నమ్మకంగా
చెప్పింది సురభి.
“ఏమోనమ్మా! మనం వెంట పడుతున్నాం. మనం విరహంలో
వేగిపోతున్నామే కానీ.. కన్నయ్యకి కాస్తైనా దయ లేదే!” వాపోయింది ఓ కోమలి.
“అలా కలలో కూడా అనుకోకు చెలీ! మనకంటే మనని తన
వద్దకు చేర్చుకోవాలని పరమాత్మకే ఎక్కువ చింత ఉంటుందట. రాముడూ సీత కోసం ఎంత
పరితపించలేదు!” మౌనంగా అడుగులు వేస్తున్న నేస్తాలకు ఉత్సాహం తేవాలని రాముని
కథ చెప్పనారంభించింది ఆనందిని.
“చూడామణిని హనుమ చేత ఉంచి “ఇది నా ప్రభువుకు చూపించు. వచ్చి నన్ను
తీసుకెళ్ళమను. ఒక్క మాసం కంటే ఎక్కువ కాలం ఎదురుచూడలేనన్నానని చెప్పు. నెలదాటితే
నీ సీత బతికి ఉండదని చెప్పు.” అని సీతమ్మ చెప్పిందట.
“ఊ..” జాలిగా పలికాయి వారి గొంతులు.
“ఆ కబురు తెచ్చిన హనుమతో రామచంద్రుడేమన్నాడో
తెలుసా!”
చిరంజీవతీ వైదేహీ యది మాసం ధరిష్యతీ
న
జీవేయం క్షణమపి వినా తాం అసితేక్షణాం
నయా
మామపి తం దేశం యత్ర దృష్టా మమ ప్రియా
న
తిష్ఠేయం క్షణమపి వినా తాం అసితేక్షణాం
ఒక మాసం బతికేమాటుంటే వైదేహి ఎన్నాళ్ళైనా
ఉండగలదు. నల్లని కన్నుల నా సీత లేనిదే క్షణమైనా జీవించలేను. అని బేలగా
చెప్పాడట!”
“అవునా! అయ్యో!” జలజల రాలేందుకు నీటి
ముత్యాలు సన్నద్ధమయ్యాయి.. వారి నల్ల నల్లని కన్నులలో..
“నా ప్రియభామిని ఉన్న దేశానికి నన్ను వెంటనే
తీసుకెళ్ళు, హనుమా! క్షణమైనా ఆ అసితేక్షణకు దూరంగా ఉండలేను.” అన్నాడట!
“మనసు వెన్న! కన్నయ్య కూడా అంతే! మనని అల్లరి
పెట్టాలని కాదు. ఏదో కారణం లేకుండా రేపు రమ్మనడు!” హృదయాలను ఆర్ద్రం చేసిన
రామకథను పదే పదే తలుచుకుంటూ ఇళ్ళకు చేరారు గోపకాంతలు.
(రేపు మళ్ళీ వెళ్దాం.. కన్నయ్య దగ్గరకు..!)
(ఆండాళ్ “తిరుప్పావై” పాశురాలకు, దేవులపల్లి
కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత)
(ఆండాళ్ “తిరుప్పావై”, బమ్మెర పోతనామాత్య
ప్రణీత “శ్రీమదాంధ్ర భాగవతము”, పిలకా గణపతి శాస్త్రి గారి “హరి వంశము”
ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)