MP Kesineni Nani Meets CM Jagan:
వైసీపీ
అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన
వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని మండిపడిన కేశినేని నాని, సీఎం జగన్
పేదల పక్షపాతి అని కీర్తించారు.
తాను
టీడీపీకి ఏం అన్యాయం చేశానో లోకేశ్ చెప్పాలన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన లేఖను
మెయిల్ ద్వారా స్పీకర్‌కు పంపినట్లు తెలిపారు.
జగన్మోహన్ రెడ్డితో కలిసి రాజకీయంగా
ప్రయాణించాలని నిర్ణయించుకున్నాను. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమికి 40 సీట్లు
కంటే ఎక్కువ రావని జోస్యం చెప్పారు. తాను వైసీపీలో చేరిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో
టీడీపీ 60 శాతం ఖాళీ కావడం కాయమన్నారు.
2013 జనవరిలో టీడీపీలో చేరినప్పటి నుంచి ఆ పార్టీ
అభివృద్ధికి శ్రమించానన్నారు. విజయవాడ అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం కనీసం
రూ.100 కోట్లు కూడా కేటాయించలేదన్నారు. విజయవాడ రియాలిటీ అయితే అమరావతి ఓ కల
అన్నారు. అమరావతి అభివృద్ధి జరగదని తాను పలుమార్లు
చంద్రబాబుకు సూచించినట్లు తెలిపారు.
పేదలకు
అండగా ఉంటున్న సీఎం జగన్ తీరు తనకు నచ్చిందని తనతో రాజకీయంగా ముందుకు సాగాలనుకుంటున్నట్లు
చెప్పారు.
2014 ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను తన
భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు సాగానన్నారు. కొంతమందికి ఆ రోజు నెలవారీ జీతాలు
కూడా చెల్లించినట్లు తెలిపారు.
2019 ఎన్నికల సమయంలో తనకు టికెట్ ఇవ్వకుండా జాప్యం చేసి ఇబ్బంది పెట్టారన్న
కేశినేని నాని, ప్రజాగ్రహంతోనే తర్వాత టికెట్ ఇచ్చారన్నారు.
2019
ఎన్నికల్లో లోకేశ్ ఓడిపోయినా తాను గెలిచానని చెప్పిన కేశినేని నాని, ఎన్నికల
సమయంలో కొంతమంది వ్యక్తులను తీసుకువచ్చి తనను తిట్టించారని చెప్పారు. అయినా పార్టీ
స్పందించకపోవడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన
కుటుంబంలోని వ్యక్తికి సీటు ఇచ్చి తనను కొట్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
ఎమ్మెల్యేగా ఓడిపోయిన లోకేశ్ పాదయాత్ర చేస్తే నేను పాల్గొనాలా అని ప్రశ్నించారు. విశాఖ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావు పేట సీటు ఇవ్వకుండా
తన సీటే ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటన్నారు.