First indigenous UAV inaugurated
భారతదేశం మొట్టమొదటి మానవ రహిత విమానాన్ని దేశీయంగా
తయారు చేసింది. ఇది ఆకాశంలోనే చాలా సమయం ఉండి శత్రువుపై నిఘా వేయగలదు. (First
Indigenous UAV)
దేశీయంగా తయారు చేసిన మొదటి మానవ రహిత విమానాన్ని
హైదరాబాద్ తుక్కుగూడాలోని అదానీ ఏరోస్పేస్ పార్క్‌లో (Adani Aerospace
Park) నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ ప్రారంభించారు. దీనిని
‘దృష్టి 10 స్టార్‌లైనర్’గా (Drishti 10 Starliner)
పిలుస్తున్నారు. దీనికి ఇంటెలిజెన్స్, నిఘా
(ఐఎస్ఆర్) సామర్థ్యాలున్నాయి. ఆకాశంలో 36
గంటలపాటు నిరంతరాయంగా ఎగరగలదు. ఏ రకమైన వాతావరణంలోనైనా పనిచేయగలదని నిర్ధారించే స్ట్రాంగ్
4671 సర్టిఫికేషన్ కూడా ఈ యూఏవీకి వచ్చింది. ఇది 450 కేజీల
పేలోడ్‌ను తీసుకుని వెళ్ళగలదు.
యూఏవీ ఆవిష్కరణ సందర్భంగా అడ్మిరల్ హరికుమార్
మాట్లాడుతూ ‘‘సముద్రంపై ఆధిపత్యం, ఐఎస్ఆర్ సాంకేతికతలో స్వయంసమృద్ధి దిశలో ఇది ముందడుగు.
అదానీ గ్రూపు ఈ రంగంలో తయారీపైనే కాకుండా.. సామర్థ్యాల అభివృద్ధిపై కూడా ఎంతగానో
శ్రమించింది. దృష్టి 10ను నౌకాదళ కార్యకలాపాల్లో భాగస్వామిని చేయడంతో మా
సామర్థ్యాలు మెరుగుపడనున్నాయి. సముద్ర గస్తీలో మా సంసిద్ధత బలోపేతం అవుతుంది.
కేవలం 10 నెలల్లోనే ఈ యూఏవీని తయారు చేయడం అదానీ డిఫెన్స్
నిబద్ధతను తెలియజేస్తోంది’’ అన్నారు.
తెలంగాణ ఐటీ మంత్రి
శ్రీధర్ బాబు మాట్లాడుతూ ‘‘ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యూఏవీని ఆవిష్కరించడం
గొప్ప విజయం. హైదరాబాద్ ఏరోస్పేస్ రంగంలో తయారీ, ఇతర
సాంకేతిక పరంగా ముందుంది. భారత రక్షణ రంగంలో అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్ కీలక పాత్ర
పోషిస్తోంది’’ అని అన్నారు.