చేరికలు,
అలకలు, అసంతృప్తులతో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా పెనమలూరు
ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, టీడీపీ నేతలతో సమావేశం కావడంతో ఉమ్మడి కృష్ణా జిల్లా
రాజకీయాలు మరింత రసకందకాయంగా మారాయి.
విజయవాడలోని
ఎమ్మెల్యే ఆఫీసులో జరిగిన సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మైలవరం
టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్థసారథిని
టీడీపీలోకి ఆహ్వానించగా ఆయన కూడా ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నెల
18న గుడివాడలో జరిగే ‘రా కదిలి రా’ బహిరంగ సభ వేదికపై చంద్రబాబు సమక్షంలో టీడీపీలో
చేరేందుకు ముహూర్తం ఖాయమైందని కూడా తెలుస్తోంది.
చంద్రబాబుతో గత శనివారమే పార్థసారధి
సమావేశమైనట్లు కూడా వార్తలొచ్చాయి.
యాదవ
సామాజికవర్గానికి చెందిన కొలుసు పార్థసారథి ప్రస్తుతం పెనమలూరు నుంచి ఫ్యాన్ గుర్తుపై
శాసనసభకు ఎన్నికయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.
ఈయన వియ్యంకుడు బుర్రా మధుసూదన్ కనిగిరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం
వహిస్తున్నారు.
పార్థసారధి
తండ్రి కొలుసు రెడ్డయ్య , 1983లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
1991లో బందరు పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు.
కిరణ్
కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పార్థసారథి, 2014 ఎన్నికలకు ముందు
వైసీపీ లో చేరారు. ఆ ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడారు. 2019లో పెనమలూరు
నుంచి ఎమ్మెల్యేగా, టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ పై విజయం సాధించారు. కానీ ఆయనకు
మంత్రి పదవి దక్కలేదు.
దీంతో ఆయన అసంతృప్తితోనే పార్టీలో కొనసాగారు.అయితే ఈ సారి
అసెంబ్లీ టికెట్ కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు
తెలుస్తోంది.